వాట్‌ టు డూ... వాట్‌ నాట్‌ టు డూ!

Sakshi Cinema interview with director Atlee

‘‘వాట్‌ టు డూ... ఏం చేయాలి? వాట్‌ నాట్‌ టు డూ... ఏం చేయకూడదు? ఈ రెండూ తెలిస్తే... దర్శకుడి వర్క్‌ చాలా సింపుల్‌. మాస్‌ పల్స్‌ పట్టుకోవడమే సక్సెస్‌ మంత్ర’’ అంటున్నారు దర్శకుడు అట్లీ. 30 ఏళ్ల ఈ యువకుడు ఇప్పటివరకు తీసింది మూడు సినిమాలే. అందులో రెండు తెలుగులోనూ విడుదలై, అట్లీకి మంచి పేరు తెచ్చాయి. ముచ్చటగా మూడోది... తమిళనాట పలు వివాదాలు, సంచలనాలకు నెలవైన ‘మెర్సల్‌’ ఈ వారమే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అదిరింది’గా తీసుకొస్తున్నాయి తేనాండాళ్‌ స్టూడియోస్, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ వచ్చిన అట్లీతో ‘సాక్షి సినిమా’ ఇంటర్వ్యూ...

► మీ వైఫ్‌ తెలుగమ్మాయే! అత్తారింటికి వచ్చినట్టుందా?
(నవ్వుతూ...) నిజమే! ప్రియ (అట్లీ వైఫ్‌) తెలుగమ్మాయే. బట్, సెటిల్డ్‌ ఇన్‌ చెన్నై. మా అత్తగారి ఫ్యామిలీ చెన్నైలోనే ఉంటోంది. వాళ్లందరూ ఇంట్లో తెలుగులో మాట్లాడుకుంటారు. తెలుగు అర్థమవుతుంది కానీ... తిరిగి తెలుగులో రిప్లై ఇవ్వలేను.

► మీ చిత్రాలు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. సో, మీ వైఫ్‌ హ్యాపీయేనా!
షి ఈజ్‌ వెరీ హ్యాపీ! ‘రాజా రాణి’, ‘పోలీస్‌’ చిత్రాలకు తెలుగులో మంచి స్పందన వచ్చినప్పుడు నాకంటే తనే ఎక్కువ సంతోషపడింది. ‘అదిరింది’ తమిళ్‌ వెర్షన్‌ (‘మెర్సల్‌’) ఆల్మోస్ట్‌ 150 ప్లస్‌ క్రోర్స్‌ కలెక్ట్‌ చేసింది. సో, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు సినిమా చూస్తారా? అని ఎదురు చూస్తోంది.

► విజయ్‌తో వరుసగా రెండు సినిమాలు చేశారు. మీ ఇద్దరి వేవ్‌ లెంగ్త్‌ బాగా కుదిరినట్లుంది?
శంకర్‌ సార్‌ దగ్గర ‘ఎందిరన్‌’ (తెలుగులో ‘రోబో’), ‘నన్బన్‌’ (తెలుగులో ‘స్నేహితుడు’) చిత్రాలకు రచన, దర్శకత్వ విభాగాల్లో పనిచేశా. ‘నన్బన్‌’కి చేసేటప్పుడు విజయ్‌ అన్నతో మంచి రిలేషన్‌షిప్‌ ఏర్పడింది. నేను ఆయనకు పెద్ద అభిమానిని కూడా! ‘రాజా రాణి’ తర్వాత విజయ్‌ అన్నను కలసి ‘తెరి’ (తెలుగులో ‘పోలీస్‌’) కథ చెప్పా. ఆయనకు కథ నచ్చడంతో వెంటనే షూటింగ్‌ స్టార్ట్‌ చేశా. ‘తెరి’ చిత్రీకరణ చివరిదశలో ఉండగానే ‘లెట్స్‌ డూ వన్‌ మోర్‌ ఫిల్మ్‌’ అని విజయ్‌ అన్న అన్నారు.

► బేసిగ్గా మీరు రైటర్‌! విజయేంద్ర ప్రసాద్‌గారి హెల్ప్‌ తీసుకోవడానికి కారణమేంటి?
యాక్చువల్లీ... విజయేంద్ర ప్రసాద్‌గారి కథతో సినిమా చేయాలనేది మా ప్లాన్‌! ఎన్నో డిస్కషన్స్‌ జరిగాయి. కానీ, కథ కుదరలేదు. అప్పుడు నా దగ్గరున్న రెండు కథలను ఆయనకు చెప్పా. ఓ కథ ఫైనలైజ్‌ చేశాం. 40 రోజులు డిస్కషన్లూ, స్క్రిప్ట్‌ వర్కూ జరిగాయి. అప్పుడు సడన్‌గా నాకో ఐడియా వచ్చింది. విజయేంద్ర ప్రసాద్‌గారికి చెప్పగా... ‘ఫెంటాస్టిక్‌ అట్లీ! లెట్స్‌ డూ దిస్‌’ అన్నారు. అదే ‘అదిరింది’. అప్పటివరకూ 40 రోజులు వర్క్‌ చేసిన కథను పక్కనపెట్టేశాం.

► అదేంటో (ఐడియా) మాకూ చెబుతారా?
ఓ కవర్‌లో ప్యాక్‌ చేసిన ఇన్‌ఫాంట్‌ బేబీని నదిలో పడేస్తారు. ఇట్‌ ఈజ్‌ ఎ డెడ్‌ బేబీ. కొందరు ఆ బేబీ దగ్గరకు వెళితే... చెయ్యి కవర్‌లోంచి బయటకు వచ్చి పైకి లేస్తుంది. రైజింగ్‌ హ్యాండ్స్‌ అన్నమాట! అక్కడ రివల్యూషన్‌ మొదలైందనేది ఐడియా.

► రాజా రాణి, పోలీస్‌... లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌. ఇప్పుడీ సినిమాలో పెద్ద బరువు (మెడికల్‌ మాఫియా)ను భుజాలపై పెట్టుకునట్టు అన్పించలేదా?
ప్రతి సినిమాకూ నేనో మెట్టు ఎదగాలనుకుంటా! ‘రాజా రాణి’ 60 కోట్లు కలెక్ట్‌ చేసింది. ‘తెరి’ 120 కోట్లు. నెక్ట్స్‌ నేను తీయబోయేది అంత కంటే కలెక్ట్‌ చేయాలనుకున్నా. తమిళ్‌లో రిజల్ట్‌ చూసిన తర్వాత నేనూ, మా టీమ్‌ హ్యాపీ. నెక్ట్స్‌ తీయబోయేది ఇంతకంటే పెద్ద హిట్‌ కావాలనేది నా టార్గెట్‌.

► మీపై శంకర్‌ ఇన్‌ఫ్లూయెన్స్‌ ఉందా?
యస్‌! స్ట్రాంగ్‌ మెసేజ్, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌... కంప్లీట్‌గా శంకర్‌ సార్‌ స్కూల్‌ నుంచి వచ్చిన సిన్మాగానే ‘అదిరింది’ ఉంటుంది. ఐ లవ్‌ శంకర్‌ సార్‌ రైటింగ్‌. ఆరేళ్లు ఆయన దగ్గర పనిచేశా. సో, ఆ ఇన్‌ఫ్లూయెన్స్‌ తప్పకుండా ఉంటుంది. ‘మాస్‌ మసాలా విత్‌ మెసేజ్‌’ కథలు ఎలా రాయాలో నాకు తెలుసు.

► హీరోకి దర్శకుడు అభిమాని అయితే అడ్వాంటేజ్‌ ఏమైనా ఉంటుందా?
‘వాట్‌ టు డూ... వాట్‌ నాట్‌ టు డూ’ అనేది తెలుస్తుంది. అభిమానులు ఏం ఆశిస్తారో దర్శకుడికి అర్థమవుతుంది.

► ఫైనల్లీ... మీ వైఫ్‌ తెలుగు సినిమాలు చేయమని అడగడం లేదా?
అయ్యో! ఎప్పట్నుంచో తెలుగు సినిమా చేయమని అడుగుతోంది. గతేడాది మహేశ్‌బాబు సార్‌తో, అల్లు అర్జున్‌ సార్‌తో మీటింగ్స్‌ జరిగాయి. డిస్కషన్స్‌ జరిగాయి. రైట్‌ టైమ్, రైట్‌ స్క్రిప్ట్‌ కుదిరినప్పుడు తెలుగులో తప్పకుండా సినిమా చేస్తా. చిరంజీవి, పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌... హీరోలందరూ నా ఫేవరెట్సే.

సమంత ఈజ్‌ మై బ్రదర్‌!
సమంత నాకు మంచి ఫ్రెండ్‌. తనను నేను ‘తంబి’ (బ్రదర్‌) అని పిలుస్తా. నన్నూ తను అలానే పిలుస్తుంది. మేమిద్దరం మాట్లాడుకుంటే... ఇద్దరు బ్రదర్స్‌ మాట్లాడుకున్నట్టే ఉంటుంది. నేను లవ్‌ సీన్స్‌ రాసే విధానం (లైక్‌ ‘రాజా రాణి’) సమంతకు బాగా ఇష్టం. ‘అదిరింది’లో క్యూట్‌ అండ్‌ బబ్లీ క్యారెక్టర్‌ చేసింది. బార్బీ డాల్‌ టైప్‌ ఆఫ్‌ క్యారెక్టర్‌లో కాజల్‌ అగర్వాల్‌ కనిపిస్తుంది. షి ఈజ్‌ వెరీ మెచ్యూర్డ్‌ అండ్‌ క్లాసీ హీరోయిన్‌. సినిమాకు పిల్లర్‌ వంటి ఎమోషనల్‌ రోల్‌లో నిత్యా మీనన్‌ నటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top