‘రేసుగుర్రం’ రేసులో లేదా?

Producers, director Gunasekhar spoke to the media on Thursday. - Sakshi

2014, 2015, 2016 సంవత్సరాలకుగాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించడం, ఎంపిక పారదర్శకంగా జరగలేదని విమర్శలు రావడం తెలిసిందే. ఈ విషయమై నిర్మాతలు కె. వెంకటేశ్వరరావు, నల్లమలుపు బుజ్జి, దర్శకుడు గుణశేఖర్‌ గురువారం మీడియాతో మాట్లాడారు.

మెగాఫ్యామిలీ ఇన్‌వాల్వ్‌మెంట్‌ లేదు – నిర్మాత కె. వెంకటేశ్వరరావు
అల్లు అర్జున్‌ హీరోగా నేను, నల్లమలుపు బుజ్జి 2014లో నిర్మించిన ‘రేసుగుర్రం’ ఎంత హిట్‌ అయిందో.. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో తెలిసిందే. ఈ సినిమాకు బెస్ట్‌ యాక్టర్‌గా అల్లు అర్జున్‌ సైమా, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. బెస్ట్‌ కొరియోగ్రాఫర్, ‘సినిమా చూపిస్త మామ...’ సాంగ్‌కు బెస్ట్‌ సింగర్‌ అవార్డులనూ సైమా ఇచ్చింది. అంత మంచి సినిమాకు నంది అవార్డు రాకపోవడం అన్యాయం. ఏపీ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన నంది అవార్డులు ఇచ్చిందో అర్థం కావడం లేదు. మంచి జ్యూరీ మెంబర్స్‌ని నియమించి, సినిమాను ఒకటికి నాలుగు సార్లు చూడాలి. 24 క్రా‹ఫ్ట్స్‌ పరిశీలించి, బాగున్న దానికి అవార్డులు ఇస్తే మాలాంటి నిర్మాతలకు ఆనందంగా ఉంటుంది. నంది అవార్డులు మాకే రావాలని కాదు. బెస్ట్‌ మూవీకి రావాలన్నదే మా అభిప్రాయం.

అవార్డుల కోసమే అయితే ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘నంది అవార్డుల కోసం రోడ్డు మీద పడకండి’ అని నిర్మాత సి.కల్యాణ్‌ అనడం తప్పు. ఆయన తీసిన సూపర్‌ హిట్‌ సినిమాకు అవార్డు రాకపోతే ఆ బాధ తెలుస్తుంది. ‘రుద్రమదేవి’ సినిమాకు సరైన అవార్డులు రాలేదు. నాగేశ్వరరావుగారు నటించిన ‘మనం’ చిత్రానికి కూడా అవార్డు ఇవ్వకపోవ డాన్ని అన్యాయంగానే భావిస్తున్నాం. ‘రుద్రమదేవి’, ‘మనం’, ‘బాహుబలి’ వంటి చరిత్రలో నిలిచిపోయే సినిమా లకు సరైన అవార్డులు రాలేదు. కమిటీ మెంబర్లు ఇంకా బాగా ఆలోచిస్తే మిగతా సినిమాలకీ మంచి అవార్డులు వచ్చేవి. మంచి సినిమాలకు అవార్డుల కోసం లాబీయింగ్‌ చేయాల్సిన అవసరం లేదు. జ్యూరీ మెంబర్స్‌ని తప్పుపట్టడం లేదు. మాకు అర్హత ఉన్నా అవార్డులు రాలేదని చెబుతున్నాం. ఇందులో మెగా ఫ్యామిలీ ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఏమీ లేదు.

కడుపు మండి వచ్చాను! – నల్లమలుపు బుజ్జి
మంచి విజయం సాధించిన ‘రేసుగుర్రం’ సినిమాను పక్కన పెట్టి ఏవేవో సినిమాలకు అవార్డులు ఇచ్చారు. నంది అవార్డుల కమిటీ, ప్రభుత్వం సినిమాల ఎంపికలో వన్‌సైడెడ్‌గా ఆలోచించారు. వాళ్ల ఇష్టం వచ్చిన వాళ్లకు ఇచ్చారు. కొంతమంది నిర్మాతలు పిచ్చిగా మాట్లాడుతున్నారు. నా కెరీర్‌లో 24క్రాఫ్ట్స్‌లో సూపర్‌గా తీసిన సినిమా ‘రేసుగుర్రం’. కంటి తుడుపు అవార్డులు ఇచ్చారు. అవార్డులను పంచుకున్నారా? ఏపీ ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నా. ప్రజలు మెచ్చిన సినిమాలను ప్రభుత్వం గుర్తించి అవార్డులు ఇస్తే ఇంకా మంచి సినిమాలు తీయాలని నిర్మాతలకు అనిపిస్తుంది. జ్యూరీ మెంబర్స్‌ కూడా ఆలోచించుకోండి. ఎప్పుడూ ప్రెస్‌మీట్‌కి రాని నేను... కడుపు మండి వచ్చాను. పబ్లిసిటీ కోసం కాదు. ‘రేసుగుర్రం’ సినిమాలో అల్లు అర్జున్‌ బాగా నటించారు.

హీరో సినిమాను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు సడన్‌గా ఒక కమెడియన్‌ వచ్చి కాసేపు స్క్రీన్‌ మీద ఉంటే సినిమా మొత్తం మారిపోతుందా? అవార్డుల ఎంపిక కమ్మ లాబీయింగ్‌లా ఉంది. ఏంటిది? అని ప్రశ్నించడానికే ఈ ప్రెస్‌మీట్‌. ఎవరి మీదా వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. నా సినిమాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాను. క్యాస్ట్‌ గురించి తేవడం కరెక్ట్‌ కాదు కదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘మొత్తం అవార్డులు చూస్తే ఆ విషయం తెలుస్తుంది సార్‌’ అన్నారు. అవార్డుల ఎంపిక సరైన ప్రామాణిక అంశాలతోనే జరిగిందా? అన్న ప్రశ్నకు.. ‘మొత్తం  దొంగ అవార్డులే అన్నారు. మరి, ఆ అవార్డుల కోసం ఎందుకు అడుగుతున్నారనే ప్రశ్నకు.. సినిమా ఉంది కాబట్టే అడుగుతున్నాం. ‘బాహుబలి’ సినిమాకి ఉత్తమ నటుడిగా ప్రభాస్‌కు ఎందుకు అవార్డు రాలేదు? గుణశేఖర్‌ ‘రుద్రమదేవి’ సినిమాకు అర్హత లేదా? ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకి పన్ను మినహాయింపు ఇచ్చుకుంటారు.

కానీ, ‘రుద్రమదేవి’కి ఇవ్వరు. మాకు వాళ్ల మీద వ్యతిరేకత ఏముంటుంది? గవర్నమెంట్‌ ఎవరిదో అందరికీ తెలుసు’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ...  అల్లు అర్జున్‌ సినిమా షూట్‌లో బిజీగా ఉన్నారు. ఆయనకు ఈ ప్రెస్‌మీట్‌ గురించి తెలియదు. ‘మనం’కు అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ, సరైన అవార్డు రాలేదు’ అన్నారు. పునర్జన్మల కథలకు నంది అవార్డులు ఇవ్వరు కదా? అన్న ప్రశ్నకు... ‘ఈగ’కు నేషనల్‌ అవార్డు, నంది అవార్డు ఇచ్చారు కదా. కనీసం జరిగిన తప్పులను సరిదిద్దుకోండి. మా ఆవేదన జ్యూరీ సభ్యులకు తెలియాలనుకున్నాం. ఈ  ప్రెస్‌మీట్‌తో సాధించేది ఏమీ లేదు.  టీడీపీ ప్రభుత్వం అని కాదు.. ఏ ప్రభుత్వం ఉన్నా అన్యాయం అన్యాయమే. నేను సినిమా వాడిని. సినిమాల గురించి చెప్తున్నాను. జ్యూరీ చేసిన తప్పులను చెప్తున్నాను. ప్రభుత్వం చేసిన తప్పులను చెప్తున్నాను. మాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు అని చెప్తున్నాం. నేను క్యాస్ట్‌ల గురించి మాట్లాడటం లేదు. లాబీయింగ్‌ జరిగింది. మాకు లాబీయింగ్‌ చేయడం చేతకాదు’ అన్నారు.

అప్పుడు నన్నూ విమర్శించారు     – గుణశేఖర్‌
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు అమరావతి ప్రారంభోత్సవం సమయంలో...  ‘‘రుద్రమదేవి మూలాలు ఉన్న అమరావతి శంకుస్థాపన నా చేతుల మీదగా జరగడం ఆనందంగా ఉంది’’ అన్నారు. అలా రుద్రమదేవి గొప్పతనాన్ని చెప్పిన ఏపీ ప్రభుత్వం ఆమె జీవితం ఆధారంగా తీసిన సినిమాకి పన్ను మినహాయింపు, అవార్డులు ఇవ్వలేదని గుణశేఖర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇదేదో అవార్డులు రాని సంఘం కాదు. మేం గ్రూప్‌ కట్టలేదు. బుధవారం ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో డిబేట్‌ జరుగుతున్నప్పుడు గౌరవ జ్యూరీ సభ్యులు ఒక ఇష్యూని లేవనెత్తారు. దాని గురించి ప్రస్తావించాలని వచ్చా. అందులో ఒక జ్యూరీ మెంబర్‌ని.. అల్లు అర్జున్‌కు క్యారెక్టర్‌ అవార్డు ఇచ్చారని ప్రశ్నించినప్పుడు... ‘కావాలని ఇవ్వలేదు. ఆ డైరెక్టర్‌ ఆ విభాగంలో ఆప్లై చేశారు కాబట్టే ఇచ్చాం’ అన్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఆప్లై చేశారా? అని చాలా మంది ఫోన్లు చేసి అడిగారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఆప్లై చేశానన్నది వాస్తవం కాదు. ఇదే గోనగన్నారెడ్డి పాత్రకు సపోర్టింగ్‌ ఆర్టిస్టుగానే సైమా, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నాం. ఒక్క ఏపీ ప్రభుత్వమే అల్లు అర్జున్‌లాంటి హీరోను క్యారెక్టర్‌ ఆర్టిస్టు అని చెప్పింది. దానిని గౌరవంగా తీసుకోవాలా..? లేక అవార్డు వచ్చినందుకు (ఏస్వీ రంగారావు అవార్డు) ఆనందపడాలో అర్థం కావడం లేదు. ప్రూఫ్‌తో సహా వచ్చాను. సహాయ నటుడు విభాగంలోనే అల్లు అర్జున్‌ పేరు రాశా.

‘రుద్రమదేవి’ తెలంగాణకు చెందిన చిత్రం కాబట్టి పన్ను మినహాయింపు, అవార్డు ఇవ్వలేదని కొందరన్నారు. రుద్రమదేవి జాతీయ నాయకురాలు. రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఒకే విధంగా ‘రుద్రమదేవి’ చిత్రానికి పన్ను మినహాయింపు కోసం ప్రయత్నించాను. తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఏపీ ప్రభుత్వం కూడా స్పందిస్తుందనుకున్నా. సమాచార లోపం లేకుండా మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుగార్ల చేత ముఖ్యమంత్రికి విన్నవించుకున్నాను. బహిరంగంగా విమర్శించకుండా లేఖ రాశాను. ఆ లేఖకు స్పందన లేదు. నేనో పెద్ద నిర్మాతను కాననా? నంది అవార్డుల ఎంపికలో ‘టామీ’ సినిమాకు

ఇచ్చిన స్థాయి ‘రుద్రమదేవి’కి లేదా? జ్యూరీ మెంబర్స్‌ని మెప్పించలేకపోయిందా?
‘మీరు పన్ను మినహాయింపుకు ఓ ప్రశ్న అడిగారు. జవాబు ఇప్పుడు వచ్చింది. అవార్డులు రాకపోవడమే జవాబు’ అని నెటిజన్లు అంటున్నారు. ఏస్వీరంగారావుగారి అవార్డును తక్కువ చేసి మాట్లాడటం లేదు. కేటగిరీల స్థాయి గురించి మాట్లాడను. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రకాశ్‌రాజ్‌కు ఆప్లై చేశాను. బన్నీ ఆ కేటగిరీకి కరెక్ట్‌ కాదు. ఆప్లికేషన్‌ ప్రింట్‌లో ఈ అవార్డులపై మీడియా ముఖంగా అభ్యంతరం చెప్పినవారు మూడేళ్లు అవార్డులకు అర్హులు కారని నియమనిబంధనలతో కూడిన ఒక బుక్‌ ఉంది. అంతకు ముందు లేదు. ఇప్పుడే పెట్టారు. ఇలా అవార్డులు ఇవ్వడానికే ఆ నిబంధన పెట్టారనిపిస్తోంది.  నంది అవార్డులు నాకు వ్యక్తిగతంగా ఎనిమిది వచ్చాయి. నేను తీసిన 12 సినిమాల సాంకేతిక నిపుణులకు, ఆర్టిస్టు లకు దాదాపు 30 నంది అవార్డులు వచ్చాయి. ‘ఒక్కడు’ సినిమాకి 8 అవార్డులు వచ్చినప్పుడు నన్ను విమర్శించారు.అవార్డుల ఎంపికలో మంచి ప్రమాణాలను పాటించాలని కోరుతున్నాను.

అనుకూలంగా ఉన్నవారికే అవార్డులు– నిర్మాత మల్కాపురం శివకుమార్‌
నంది అవార్డులు పచ్చపార్టీ తమ కార్యకర్తలకు కండువాలను కప్పినట్లుగా ఉంది. అవార్డుకు అర్హత ఉన్న చిత్రాలను విస్మరించి తమకు అనుకూలంగా ఉన్నవారికే ప్రకటించింది. 2015లో సరికొత్త కాన్సెప్ట్‌తో నేను నిర్మించిన ‘సూర్య వర్సెస్‌ సూర్య’ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇలాంటి కాన్సెప్ట్‌తో హాలీవుడ్‌లో ఓ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. హాలీవుడ్‌ వాళ్లకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన తెలుగు సినిమా నంది అవార్డు కమిటీకి కనిపించలేదా?  ఈ అవార్డులు ప్రభుత్వం తరపున కాకుండా పార్టీ తరపున ఇస్తే బాగుండేది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top