
ఎప్పటి నుంచో ఉపయోగంలో లేని పాడుబడ్డ భవంతి అది. అందులోకి వెళ్లాంటే గుండె నిండా ఖలేజా కావాలి. ఓ రోజు మెరుపుల శబ్దాల మధ్య ఆ భవంతి తలుపులు తెరుచుకున్నాయి. వెలుగును వెంబడిస్తూ భయంతో వడివడిగా అడుగులు వేస్తున్న ఒకరి చూపులు దేన్నో ఆత్రుతగా వెతుకున్నాయి. అంతే.. హఠాత్తుగా పెద్ద శబ్దం. దేన్నో వెతుకున్న ఆ మనిషి చేతిలోని టార్చ్‌లైట్ వెలుగు గోడపై ఫ్లాష్ అయ్యింది. కట్ చేస్తే.. ఓ అమ్మాయి. చేతిలో మేకును సుత్తితో బలంగా కొట్టుకుంది. ఆ అమ్మాయి తనని తాను ఎందుకలా శిక్షించుకుంది? బుధవారం రిలీజైన ‘భాగమతి’ టీజర్ కహానీ ఇది. అసలు కహానీ ఏంటో వెయిట్ అండ్ సీ. టైటిల్ రోల్‌లో అనుష్క నటించిన ఈ చిత్రాన్ని అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. జనవరి 26న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
భాగమతికి బాహుబలికి కితాబు
ప్రభాస్ – అనుష్క కలసి పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అందుకే స్వీటీ (అనుష్క ముద్దు పేరు)ని అభినందించారు ప్రభాస్. ‘‘డిఫరెంట్‌గా ట్రై చేయడంలో అనుష్క ఫస్ట్ లేడీ. ప్రతి సినిమాలోనూ ఆమె క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. గుడ్‌లక్ టు స్వీటీ అండ్ యూవీ క్రియేషన్స్ టీమ్’’ అంటూ ప్రభాస్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ‘భాగమతి’ టీజర్‌ను పోస్ట్ చేశారు.