పూజా హెగ్డే సందడి

Pooja Hegde Shopping Mall And Malti Complex Start In Prakasam - Sakshi

ఒంగోలు (ప్రకాశం): స్థానిక గుంటూరు రోడ్డులో నూతనంగా నిర్మించిన రవిప్రియ మాల్‌ అండ్‌ మల్టీప్లెక్స్‌ను ప్రముఖ సినీనటి పూజాహెగ్డే బుధవారం ప్రారంభించారు. పూజాహెగ్డేతో పాటు మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మాల్‌ చైర్మన్‌ కంది రవిశంకర్, అతని కుటుంబ సభ్యులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తొలుత మాల్‌ అండ్‌ మల్టీప్లెక్స్‌ ముందువైపు ఏర్పాటుచేసిన వాటర్‌ ఫౌంటైన్‌ను పూజాహెగ్డే ప్రారంభించారు.

అనంతరం ప్రధాన భవనాన్ని మంత్రి శిద్దా రాఘవరావు, గ్రౌండ్‌ఫ్లోర్‌లోని మాక్స్‌షాపింగ్‌ మాల్, ఫుడ్‌కోర్టును ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, కేఎఫ్‌సీ సెంటర్‌ను మాజీ మంత్రి మానుగుంట మహీధరరెడ్డి, క్రీమ్‌స్టోన్‌ను మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మంత్రి శ్రీనివాసరావు ప్రారంభించారు. తదుపరి మొదటి అంతస్తులో 65 అడుగుల భారీ స్క్రీన్‌తో నిర్మితమైన స్క్రీన్‌–1 థియేటర్‌ను బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించగా, స్క్రీన్‌–2ను ఎమ్మెల్సీ కరణం బలరాం, స్క్రీన్‌–3ని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ప్రారంభించారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గేమ్‌జోన్‌ను ప్రారంభించారు.

అభిమానులను చూస్తుంటే ఆనందంగా ఉంది : పూజాహెగ్డే
పూజా హెగ్డే రాకతో రెండు గంటల ముందు నుంచే ఆ ప్రాంతానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. మాల్‌ ఎదురుగా రోడ్డు పక్కన, డివైడర్లపై బారులుదీరి ఆమెను చూసేందుకు, ఫొటోలు తీసేందుకు ఉత్సాహం చూపారు. భారీ బందోబస్తు మధ్య డప్పులతో పూజా హెగ్డేకు స్వాగతం పలికారు. మాల్‌ ప్రారంభం అనంతరం పూజాహెగ్డే మాట్లాడుతూ అభిమానులను చూస్తుంటే తనకెంతో ఆనందంగా ఉందన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన రవిశంకర్‌ గ్రూప్‌ వారికి కృతజ్ఞతలు ప్రకటించారు. త్వరలోనే తాను నటించిన అరవింద సమేత విడుదలవుతుందని, ఆదరించాలని కోరారు. కేవలం కేకలు కాకుండా ఈలలు వేసి అభిమానాన్ని చాటాలంటూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. లవ్‌యూ సోమచ్‌ అంటూ గాలిలోకి ముద్దులు విసిరి కుర్రకారును గిలిగింతలు పెట్టారు.

ఐదేళ్ల క్రితమే మాల్‌ నిర్మించాలనుకున్నాం : చైర్మన్‌ రవిశంకర్‌
ఐదేళ్ల క్రితం 2013లోనే ఒంగోలులో మాల్‌ అండ్‌ మల్టీప్లెక్స్‌ నిర్మించాలని తాము భావించినట్లు రవిశంకర్‌ గ్రూప్‌ చైర్మన్‌ కంది రవిశంకర్‌ వెల్లడించారు. అది ఇప్పటికి కార్యరూపం దాల్చిందని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రాండ్లు అయిన మ్యాక్స్, కేఎఫ్‌సీ, క్రీమ్‌స్టోన్, పిజ్జాహట్లు, థియేటర్లతో పాటు పిల్లలకు అవసరమైన గేమ్‌జోన్‌ వంటి వాటిని మాల్‌లో ఏర్పాటు చేశామన్నారు. అన్నింటినీ సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం తాను, తన గ్రూప్‌ ఉన్నతంగా ఉండటానికి ఒంగోలు, పరిసర ప్రాంతాల ప్రజల ఆశీర్వాదమే కారణమన్నారు.

అందుకే ఈ మల్టీప్లెక్స్‌ను ఒంగోలు ప్రజలకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయత కలిగిన కార్నివాల్స్‌ సినిమా గ్రూప్‌ స్క్రీన్‌లు మూడింటిని సినిమాలకు ఏర్పాటు చేశామన్నారు. మాల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కంది సాయినాథ్‌ మాట్లాడుతూ 65 అడుగుల పూర్తిస్థాయి స్క్రీన్‌పై సినిమా చూడటం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కేవలం ఒంగోలు ప్రేక్షకులకే సాధ్యమన్నారు. హైదరాబాద్‌లోని ఐమాక్స్‌లో సైతం కొన్ని సినిమాలను మాత్రమే పూర్తిస్థాయి స్క్రీన్‌పై చూడటం సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో రవిశంకర్‌ గ్రూప్‌ డైరెక్టర్లు ప్రియదర్శిని, విష్ణుమోహన్, విజయసాయి పాల్గొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top