'ప్లీజ్.. నన్ను హీరోలా చూడకండి' | Sakshi
Sakshi News home page

'ప్లీజ్.. నన్ను హీరోలా చూడకండి'

Published Thu, Jul 28 2016 6:23 PM

'ప్లీజ్.. నన్ను హీరోలా చూడకండి'

'నన్ను కమెడియన్గానే చూడండి, ప్లీజ్.. హీరోలా చూడకండి' అంటున్నాడు సునీల్. ఈ శుక్రవారం సునీల్ 'జక్కన్న' విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించాడు. కమెడియన్గా కెరీర్ను మొదలుపెట్టి స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న సునీల్ 'అందాలరాముడు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన 'మర్యాదరామన్న' సూపర్ హిట్ అవ్వడంతో పూర్తిస్థాయి హీరోగా కొనసాగుతున్నాడు. అయితే గత కొంతకాలంగా సునీల్ ఖాతాలో ఒక్క హిట్టూ పడకపోవడంతో తిరిగి తనకు బాగా అలవాటైన కామెడీనే నమ్ముకునే ప్రయత్నంలో ఉన్నాడు.  

దీనిపై సునీల్ మాట్లాడుతూ.. 'నా అభిమాని అడిగిన ఒక ప్రశ్న నా ఆలోచనను మార్చుకునేలా చేసింది. ఇతర ఏ ఆర్టిస్ట్లోనూ కనపడని కామెడీ టైమింగ్ మీలో ఉంటుంది. అది తెలిసి కూడా మీకు సూటవ్వని సీరియస్ క్యారెక్టర్లు (హీరో) ఎందుకు చేస్తున్నారని ఓ అభిమాని అడిగిన ప్రశ్న నా మనసుని ఆలోచనలో పడేసింది' అన్నారు. జక్కన్నలో తాను హీరోను కాదని, ఒక కమెడియన్ని మాత్రమేనని, కేవలం స్టంట్స్ చేసిన రెండు ఎపిసోడ్స్లో మాత్రమే తను హీరోలా కనిపిస్తానని చెప్పుకొచ్చారు. తనను కమెడియన్గా చూడాలే తప్ప హీరోలా అనుకుని సినిమా చూడొద్దని ప్రేక్షకులను కోరారు. జక్కన్న పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని, ఇంత మంచి సినిమాను రూపొందొంచినందుకు డైరెక్టర్ వంశీకృష్ణ ఆకెళ్లకు, ఆకట్టుకునే పంచ్ డైలాగులు రాసిన భవానీ ప్రసాద్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Advertisement