నువ్‌ బతకడమే అనవసరం.. ఎందులోనన్నా దూకి చావు! | Needi Naadi Oke Katha TEASER | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న ‘నీదీ నాదీ ఒకే కథ’ టీజర్‌!

Jan 7 2018 7:50 PM | Updated on Jul 14 2019 3:29 PM

Needi Naadi Oke Katha TEASER - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త కొత్త కథలు తెరపైకి వస్తున్నాయి. నిజజీవితానికి దగ్గరగా ఉన్న కథలు కొత్తదనంతో తెరకెక్కి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్‌ మదిలో వంటి సినిమాలు ఇదే కోవలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆదరణ పొందాయి. తాజాగా ‘అప్పట్లో ఒకడు ఉండేవాడు’ ఫేమ్‌ శ్రీవిష్ణు ఓ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ‘నీదీ నాదీ ఒకే కథ’ అంటున్నాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రశాంతి, కృష్ణవిజయ్‌ నిర్మించిన ఈ సినిమాను నారా రోహిత్‌ సమర్పిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకకులను ఆకట్టుకుంటోంది.

సరిగ్గా చదువు అబ్బని ఓ యువకుడి జీవిత సంఘర్షణ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కినట్టు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ‘పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని గనిగొని పొగుడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ’ అన్న పద్యంతో టీజర్‌ ప్రారంభమవుతుంది. ఈసారైనా పాస్‌ అవుతావా? అన్న డైలాగ్‌ హీరోను వెంటాడుతుంది. తీరా తనకే డౌట్‌ వచ్చి.. ‘ఈ సారైనా నేను పాస్‌ అవుతానా?’ అని చెల్లెల్ని అడుగుతాడు.. ‘హండ్రెడ్‌ పర్సంట్‌ పాస్‌ అవుతావ్‌ అన్నయ్య’ అంటూ చెల్లెలు ధైర్యం చెప్తుంది.. ‘అందుకే డిసైడ్‌ అయ్యాను చదివేద్దామని..’ అని ఎగ్జామ్‌ సెంటర్‌లో హీరో బీరాలు పోతాడు. ‘మరి చదివేశాయా?’ అని ఎగ్జామినర్‌ అడిగితే.. ‘ఏంది చదివేది రాత్రేగా డిసైడ్‌ అయింది’ అంటూ తెల్లముఖం వేస్తాడు శ్రీవిష్ణు.. ‘నువ్వు ఆత్మనూన్యత భావంతో బాధపడుతున్నావ్‌’ అని హీరోయిన్‌ అంటే.. ‘ఇదేదో బ్లడ్‌ క్యాన్సరో.. మౌత్‌ క్యాన్సరో కాదు కదండి’ అని శ్రీవిష్ణు అడిగితే.. దానికంటే పెద్దదని తను బదులిస్తుంది.

చదువులో రాణించలేక ఓ యువకుడు పడే ఘర్షణను టీజర్‌లో దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. ‘పాన్‌ షాపోడిది ఓ బతుక్కాదా? కొబ్బరిబొండాలు అమ్ముకునేవోడిది ఓ బతుక్కాదా? మెకానిక్‌ షెడ్డోది ఓ బతుక్కాదా? డ్రైవర్‌ది బతుక్కాదా? యే.. నీలాంటి లెక్చరర్లు, డాక్టర్లు, ఇంజినీర్లవే బతుకులా?’ అని హీరో ఏమోషనల్‌గా బరస్ట్‌ అయితే.. చాచి చెంపమీద కొట్టి.. ‘నువ్‌ మారావురా ప్రపంచందంతా ఒక దారైతే.. నీ ఒక్కడిది ఒక దారి. నువ్‌ బతకడమే అనవసరం.. ఎందులోనన్నా దూకి చావు’ అని తండ్రి కోపంగా బదులిస్తాడు. ఓ సామాన్యుడి ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను ఓ సామాన్య మెకానిక్‌తో ఆవిష్కరింపజేయడం గమనార్హం. ఈ సినిమా టీజర్‌ 24 గంటల్లోనే 5 లక్షలకుపైగా డిజిటల్‌ వ్యూస్‌ సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement