హీరోగా...నరేశ్ తనయుడి తెరంగేట్రం | Sakshi
Sakshi News home page

హీరోగా...నరేశ్ తనయుడి తెరంగేట్రం

Published Thu, Aug 7 2014 11:59 PM

హీరోగా...నరేశ్ తనయుడి తెరంగేట్రం

 సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయకృష్ణ హీరోగా మారారు. ఆయన హీరోగా రూపొందుతోన్న చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. అడ్డాల చంటి, గవర పార్థసారథి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్‌ప్రసాద్ రగుతు దర్శకుడు. ముహూర్తపు దృశ్యానికి డా.డి.రామానాయుడు, కె.రాఘవేంద్రరావు కలిసి కెమెరా స్విచాన్ చేయగా, కృష్ణ, మహేశ్‌బాబు కలిసి క్లాప్ ఇచ్చారు. సినిమా విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు.
 
  హీరో నవీన్ విజయకృష్ణ నాయనమ్మ, ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల ముహూర్తపు దృశ్యానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ -‘‘మా కుటుంబం నుంచి నవీన్ రూపంలో మరో హీరో ఇండస్ట్రీకి రావడం ఆనందంగా ఉంది. నవీన్ మంచి ప్రతిభాశాలి. తనలో మంచి ఎడిటర్ కూడా ఉన్నాడు. తప్పకుండా విజయం సాధిస్తాడని నా నమ్మకం’’ అన్నారు. నరేశ్ మాట్లాడుతూ -‘‘మా అబ్బాయి హీరోగా పరిచయం అవుతుంటే ఏదో తెలీని ఆనందం కలుగుతోంది. నా చిన్నతనంలోనే ‘పండంటికాపురం’లో బాలనటునిగా నటించాను.
 
 17 ఏళ్ల ప్రాయంలో ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాను. మూడు దశాబ్దాల నట ప్రస్థానం నాది. ఇప్పుడు నా కుమారుడు నా వారసుడిగా రావడం గర్వంగా ఉంది. ప్రముఖ నటి మేనక కుమార్తె కీర్తి ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. కృష్ణవంశీ శిష్యుడు రామ్‌ప్రసాద్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తాడని నా నమ్మకం’’ అని చెప్పారు. సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మహతిసాగర్, కూర్పు: త్యాగరాజన్.
 

Advertisement
 
Advertisement
 
Advertisement