నిజంగానే సినిమా కష్టాలు పడ్డాను!

నిజంగానే సినిమా కష్టాలు పడ్డాను!


సినిమాల కోసం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకున్న సృజనశీలి ప్రవీణ్ సత్తారు. దర్శకత్వ శాఖలో ఎవరి దగ్గరా శిష్యరికం చేయకపోయినా, వెండితెరపై తనదైన ప్రతిభా ప్రదర్శనం కావించారాయన. ‘ఎల్బీడబ్ల్యూ’, ‘రొటీన్ లవ్ స్టోరీ’ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి సొంతం చేసుకున్న ఈ ఉత్తరాంధ్ర యువకుడు తన మూడో సినిమా ‘చందమామ కథలు’తో జాతీయ స్థాయిలో తన సత్తా చాటారు. జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘చందమామ కథలు’ ఎంపికైంది. వరుస ఫోన్‌కాల్స్, అభినందనల వెల్లువతో బిజీగా ఉన్న ప్రవీణ్ సత్తారు ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

 

 కంగ్రాట్స్...

 చాలా థ్యాంక్స్. ఇది నేను ఊహించని పురస్కారం. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక కావడమంటే మాటలు కాదు కదా. అయినా నేను అవార్డుల కోసమని ఈ సినిమా తీయలేదు. బాక్సాఫీస్‌ని గెలవకపోయినా, అవార్డు దక్కినందుకు మాత్రం సంతృప్తికరంగా ఉంది.

 

 ఈ పురస్కారం ఎంపికలో మీ సినిమాకు కలిసొచ్చిన అంశాలు ఏమిటనుకుంటున్నారు?

 నిజాయతీ. మన సమాజంలో రోజూ కనిపించే అనేక పాత్రలను వెండితెరపై చాలా నిజాయతీగా ఆవిష్కరించా. ఎక్కడా అతి చేయలేదు. మంచు లక్ష్మి, నరేశ్, ఆమని, కృష్ణుడులాంటి పాత్రలు సమాజంలో ఎక్కడో చోట తారసపడుతూనే ఉంటాయి. అదే జ్యూరీకి నచ్చి ఉంటుంది.

 

 మరి ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదంటారు?

 సరిగ్గా ఎన్నికల వేడిలో విడుదల చేయడం మాకు ప్రధాన ప్రతికూలాంశం. మనకు మనం సర్దిచెప్పుకోవడానికి ఇలా ఏదో ఒక కారణం చెప్పుకోవాలి కదా.

 

 ఈ సినిమాకు నిర్మాత కూడా మీరే కదా!

 అవును నేనే. ఈ సినిమా విడుదల సమయంలో చాలా కష్టాలు పడ్డాను. మొత్తం డబ్బులన్నీ దీనికే పెట్టేశా. అయినా నేనేం బాధపడలేదు. నేను ఈ కథను నమ్మాను. నన్ను నా టీమ్ నమ్మింది. ఇంతకు ముందు రెండు సినిమాలకూ నేనే నిర్మాతను. ప్రతి సినిమాకీ కష్టాలు ఎదుర్కొన్నా. దీనికి మాత్రం చాలా కొత్త కష్టాలు పడ్డా. అయినా నిర్మాతకు సినిమా కష్టాలు సాధారణమే కదా.

 

 అవార్డు వచ్చింది కదా. మళ్లీ సినిమా రిలీజ్ చేయొచ్చుగా?

 (నవ్వేస్తూ) మంత్రాలకు చింతకాయలు రాలనట్టుగానే, అవార్డులకు వసూళ్లు రాలవు. అంతగా కావాలనుకుంటే యూ ట్యూబ్‌లో చూస్తారు తప్ప, థియేటర్లకు వస్తారంటారా!

 

 ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో చేస్తారా?

 సినిమా విజయం సాధించి ఉంటే, కచ్చితంగా ఇతర భాషల్లో చేసేవాణ్ణి. ఇప్పుడైనా ఎవరైనా అడిగితే చేస్తాను.

 

 మీ భవిష్యత్తు ప్రణాళికలు?

 నా దగ్గర 13 స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో ఓ సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరగుతున్నాయి. నేనెలాంటి సినిమా చేసినా అందులో తప్పనిసరిగా వైవిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటా. ఈ పంథాను మాత్రం ఎప్పటికీ వదలను.

 

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top