breaking news
Routine Love Story
-
నిజంగానే సినిమా కష్టాలు పడ్డాను!
సినిమాల కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకున్న సృజనశీలి ప్రవీణ్ సత్తారు. దర్శకత్వ శాఖలో ఎవరి దగ్గరా శిష్యరికం చేయకపోయినా, వెండితెరపై తనదైన ప్రతిభా ప్రదర్శనం కావించారాయన. ‘ఎల్బీడబ్ల్యూ’, ‘రొటీన్ లవ్ స్టోరీ’ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి సొంతం చేసుకున్న ఈ ఉత్తరాంధ్ర యువకుడు తన మూడో సినిమా ‘చందమామ కథలు’తో జాతీయ స్థాయిలో తన సత్తా చాటారు. జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘చందమామ కథలు’ ఎంపికైంది. వరుస ఫోన్‌కాల్స్, అభినందనల వెల్లువతో బిజీగా ఉన్న ప్రవీణ్ సత్తారు ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. కంగ్రాట్స్... చాలా థ్యాంక్స్. ఇది నేను ఊహించని పురస్కారం. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక కావడమంటే మాటలు కాదు కదా. అయినా నేను అవార్డుల కోసమని ఈ సినిమా తీయలేదు. బాక్సాఫీస్‌ని గెలవకపోయినా, అవార్డు దక్కినందుకు మాత్రం సంతృప్తికరంగా ఉంది. ఈ పురస్కారం ఎంపికలో మీ సినిమాకు కలిసొచ్చిన అంశాలు ఏమిటనుకుంటున్నారు? నిజాయతీ. మన సమాజంలో రోజూ కనిపించే అనేక పాత్రలను వెండితెరపై చాలా నిజాయతీగా ఆవిష్కరించా. ఎక్కడా అతి చేయలేదు. మంచు లక్ష్మి, నరేశ్, ఆమని, కృష్ణుడులాంటి పాత్రలు సమాజంలో ఎక్కడో చోట తారసపడుతూనే ఉంటాయి. అదే జ్యూరీకి నచ్చి ఉంటుంది. మరి ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదంటారు? సరిగ్గా ఎన్నికల వేడిలో విడుదల చేయడం మాకు ప్రధాన ప్రతికూలాంశం. మనకు మనం సర్దిచెప్పుకోవడానికి ఇలా ఏదో ఒక కారణం చెప్పుకోవాలి కదా. ఈ సినిమాకు నిర్మాత కూడా మీరే కదా! అవును నేనే. ఈ సినిమా విడుదల సమయంలో చాలా కష్టాలు పడ్డాను. మొత్తం డబ్బులన్నీ దీనికే పెట్టేశా. అయినా నేనేం బాధపడలేదు. నేను ఈ కథను నమ్మాను. నన్ను నా టీమ్ నమ్మింది. ఇంతకు ముందు రెండు సినిమాలకూ నేనే నిర్మాతను. ప్రతి సినిమాకీ కష్టాలు ఎదుర్కొన్నా. దీనికి మాత్రం చాలా కొత్త కష్టాలు పడ్డా. అయినా నిర్మాతకు సినిమా కష్టాలు సాధారణమే కదా. అవార్డు వచ్చింది కదా. మళ్లీ సినిమా రిలీజ్ చేయొచ్చుగా? (నవ్వేస్తూ) మంత్రాలకు చింతకాయలు రాలనట్టుగానే, అవార్డులకు వసూళ్లు రాలవు. అంతగా కావాలనుకుంటే యూ ట్యూబ్‌లో చూస్తారు తప్ప, థియేటర్లకు వస్తారంటారా! ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో చేస్తారా? సినిమా విజయం సాధించి ఉంటే, కచ్చితంగా ఇతర భాషల్లో చేసేవాణ్ణి. ఇప్పుడైనా ఎవరైనా అడిగితే చేస్తాను. మీ భవిష్యత్తు ప్రణాళికలు? నా దగ్గర 13 స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో ఓ సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరగుతున్నాయి. నేనెలాంటి సినిమా చేసినా అందులో తప్పనిసరిగా వైవిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటా. ఈ పంథాను మాత్రం ఎప్పటికీ వదలను. -
హద్దులు దాటడానికి వెనకాడను!
‘‘సినిమాలో హీరోకి పెదవి ముద్దు ఇచ్చామా? చిట్టి, పొట్టి దుస్తులేసుకున్నామా? అన్నది ముఖ్యం కాదు. సన్నివేశానికి అనుగుణంగానే అవి చేశామా? లేదా అన్నదే ముఖ్యం’’ అంటున్నారు రెజీనా. ఎస్ఎమ్ఎస్, రొటీన్ లవ్‌స్టోరీ తదితర చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె. సాయిధరమ్ తేజ్ సరసన ఆమె నటించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రం ఈ నెల 14న విడుదల కానున్న సందర్భంగా రెజీనాతో చిట్‌చాట్. ‘పిల్లా నువ్వు లేని జీవితం’లో మీదెలాంటి పాత్ర? ఇప్పటివరకు నేను చేసిన పాత్రలన్నిటికన్నా భిన్నంగా ఉంటుంది. సమస్యల్లో ఉండే అమ్మాయిగా నటించాను. అందుకని ఎప్పుడూ సీరియస్‌గా ఉంటా. ప్రేమిస్తున్నానంటూ హీరో వెంటపడ్డా సినిమా చివరి వరకూ ప్రేమను అంగీకరించను. సీరియస్ కారెక్టర్ అంటున్నారు.. మీ నిజజీవితానికి ఎంతవరకూ దగ్గరగా ఉంటుంది? కొంత కూడా దగ్గరగా ఉండదు. ఎందుకంటే, నేనంత సీరియస్ అమ్మాయిని కాదు. అలాగని వసపిట్టనూ కాదు. కావల్సినంత వరకు మాట్లాడతాను. నా పనేంటో నేనేంటో అన్నట్లుగా ఉంటాను. ఈ సినిమాలోలాగా నిజజీవితంలో కూడా అబ్బాయిలు మీ వెంటపడేవారేమో? నావైపు కన్నెత్తి చూసేవాళ్లు కాదు. ఎందుకంటే, నేనంటే భయం. నాకు ఆత్మవిశ్వాసం, గుండె ధైర్యం ఎక్కువ. నా ధైర్యం గురించి తెలిసి, నాతో మామూలుగా మాట్లాడటానికి కూడా భయపడేవాళ్లు. సో.. అమ్మాయిలందరూ మీలా ధైర్యంగా ఉండాలంటారు... నాలా ఉండమని చెప్పే స్థాయిలో లేను కానీ, కచ్చితంగా ధైర్యంగా ఉండాలి. అప్పుడే సమాజంలో నెగ్గుకు రాగలుగుతారు. ఓకే... సాయిధరమ్ గురించి చెప్పండి? నిరాడంబరంగా ఉంటాడు. కష్టపడి పని చేసే మనసత్త్వం. మెగా కుటుంబం నుంచి వస్తున్న హీరో కాబట్టి అతని పై అంచనాలుంటాయి. సాయి పడుతున్న కష్టం చూస్తుంటే మంచి స్థానానికి చేరుకుంటాడనిపిస్తోంది. మళ్లీ సాయిధరమ్తోనే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రం చేస్తున్నారు.. కారణం ఏంటి? నాకైతే కథ, పాత్ర నచ్చి ఒప్పుకున్నాను. పైగా, పెద్ద బేనర్లో అవకాశం అంటే చిన్న విషయం కాదు. మళ్లీ మా జంటనే తీసుకున్నారంటే.. బహుశా ‘పిల్లా నువ్వు లేని జీవితం’లో మా కెమిస్ట్రీ నచ్చి ఉంటుందేమో. ఇటీవల విడుదలైన ‘రంగ్ రసియా’ చిత్రంలో నందనాసేన్ నగ్నంగా నటించారు. ఆ తరహా పాత్రలొస్తే...? నేను ఆర్టిస్ట్నండి. అందుకే సన్నివేశం డిమాండ్ మేరకు గత చిత్రాల్లో లిప్ లాక్ సీన్ చేశాను. భవిష్యత్తులో పెదవి ముద్దు సన్నివేశాల పరంగా ట్రెండ్ సృష్టిస్తానేమో (నవ్వుతూ). ఆ సంగతలా ఉంచితే.. ‘రంగ్ రసియా’ గురించి విన్నాను. కళాత్మకంగా తీశారట. అలాంటి సినిమాకి అవకాశం వస్తే.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. నేను చేసిన ఎస్ఎమ్ఎస్, రొటీన్ లవ్‌స్టోరీ చూసి... ‘రెజీనా మన పక్కింటమ్మాయిలా ఉంది’ అన్నారు. నాలో వేరే కోణం ఉందని నిరూపించడానికి ఆ తర్వాత గ్లామరస్ రోల్స్ చేశాను. దాంతో రెజీనా ఈ పాత్రలకూ పనికొస్తుందనే అభిప్రాయానికి వచ్చారు. నాలోని భిన్న కోణాల్ని ఆవిష్కరించే పాత్రలైతే, హద్దులు దాటడానికి వెనకాడను. బన్నీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా... బన్నీ (అల్లు అర్జున్), నేను కలిసి ఓ యాడ్‌లో నటించాం. దానికోసం ఉదయం ఆరు గంటలకు మొదలుపెట్టి, మర్నాడు ఉదయం నాలుగు గంటల వరకు షూటింగ్ చేశాం. అప్పుడు బన్నీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా.