నవ్వడం మానేశారు

Director G Nageswar Reddy at Tenali Ramakrishna BABL - Sakshi

‘‘ఇప్పటి మనుషులు డబ్బు వేటలో, ఉద్యోగాల ఒత్తిడి వల్ల నవ్వడం మానేశారు. పైగా ఈ మధ్య టాలీవుడ్‌లో పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రాలు రావడం తగ్గింది. అందుకే పూర్తి వినోదాత్మకంగా ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ సినిమాని తెరకెక్కించాం’’ అని డైరెక్టర్‌ జి. నాగేశ్వర రెడ్డి అన్నారు. సందీప్‌ కిషన్, హన్సిక జంటగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అన్నది ఉపశీర్షిక. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్‌.ఎన్‌.ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌ రెడ్డి, రూపా జగదీష్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి చెప్పిన విశేషాలు.

► తెనాలి రామకృష్ణ అంటే తిమ్మిని బొమ్మి చేయగల సమర్థుడని చరిత్రలో చదువుకున్నాం. మా చిత్రంలో లాయర్‌గా సందీప్‌ పాత్ర కూడా అలాగే ఉంటుంది. తెనాలి రామకృష్ణకు ఉండే అన్ని లక్షణాలు ఈ లాయర్‌ పాత్రకు ఉంటాయి. అందుకే ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌’ అనే టైటిల్‌ పెట్టాం.

► రాజీపడితే కేసులు, గొడవలు, కోర్టులు ఉండవు అనే ధోరణిలో ఉండే హీరో ఓ కేసులో రాజీపడే ప్రసక్తే లేదు అన్నట్టుంటాడు. రెండు ఉద్దేశాలు కలిగిన హీరో పాత్రని వినోదాత్మకంగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాతో సందీప్‌కి కొత్త ఇమేజ్‌ వస్తుంది. ఈ సినిమా చిత్రీకరణలో ఒక యాక్షన్‌ సీక్వెన్స్‌ చేస్తున్నప్పుడు   సందీప్‌కి  గాయం అయింది. దాంతో రెండు నెలలు షూటింగ్‌ వాయిదా పడింది.

► ఈ చిత్రంలో హన్సికది కూడా లాయర్‌ పాత్రే. మహా మేధావి అనుకునే ఇన్నోసెంట్‌ లాయర్‌ పాత్ర ఆమెది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ని ముఖ్యమైన పాత్ర కోసం తీసుకున్నాం.

► ఈ సినిమాలో కమెడియన్స్‌గా నటించిన పోసాని కృష్ణమురళి, ‘వెన్నెల’ కిషోర్, సప్తగిరి, సత్య కృష్ణల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వీరి కామెడీ ట్రాక్‌ తెనాలి రామకృష్ణ పాత్రకు మించి ఉంటుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top