టైటిల్‌ మార్చాలంటూ బోయ నేతల డిమాండ్‌

Boya Caste Leaders Demands Chane Valmiki Movie Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వాల్మీకి సినిమా టైటిల్‌ మార్చాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి బోయ సామాజిక వర్గం నేతలు సోమవారం సెంట్రల్‌ బోర్డ్‌ ఫిల్మ్‌ సర్టిఫికెట్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రామాయణం రాసిన వాల్మీకిని గ్యాంగ్‌ స్టర్‌తో పోల్చడం వల్ల ఆ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దాంతో వారు తనను సంప్రదించారని తెలిపారు. గ్యాంగ్‌స్టర్‌ మూవీకి వాల్మీకి పేరు పెట్టడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారన్నారు. తక్షణమే ఈ సినిమా టైటిల్‌ మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారన్నారు. లేకపోతే బోయ కమ్మూనిటీ అంతా ఒక్కటి అవుతుందని.. అందుకు నిర్మాతలు, డైరెక్టర్‌, నటులు అందరూ బాధ్యత వహించాల్సి వస్తుందని లక్ష్మణ్‌ హెచ్చరించారు.

టైటిల్‌ మార్చకుంటే రిలీజ్‌ కానివ్వం: గోపి బోయ
మా జాతికి గురువు అయిన వాల్మీకిని ఈ సినిమా ద్వారా రాబోయే తరాలకు గ్యాంగ్‌స్టర్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని బోయ వాల్మీకి సంఘం అధ్యక్షుడు గోపి బోయ ఆరోపించారు. సినిమా షూటింగ్‌ ప్రారంభానికి ముందే. డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌, నిర్మాతలు రాం అచంట, గోపి అచంటలను కలిసి టైటిల్‌ మార్చమని కోరామన్నారు. అంతేకాక హీరో వరుణ్‌ని కూడా కలిసామని కానీ వారు స్పందించలేదని తెలిపారు. టైటిల్‌ మార్చకుంటే సినిమా రిలీజ్‌ కానివ్వమని హెచ్చరించారు.

తమిళ సినిమా జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కిన వాల్మీకి సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటిస్తుండగా తమిళ నటుడు అధర్వ హీరోగా నటిస్తున్నాడు.
(చదవండి: నాతోటి పందాలు వేస్తే సస్తరు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top