బిగ్‌బాస్‌: ట్రోల్స్‌పై స్పందించిన నాని

Bigg Boss 2 Telugu Host Nani Break Silence On Trolls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌ 2 రియాల్టీ షో తుది అంకానికి చేరుకుంది. సోషల్‌ మీడియాలో తొలి నుంచి ఈ షో పై హైప్‌ క్రియేట్‌ అయింది. దీంతో హౌస్‌లో జరిగే ప్రతి విషయంపై అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. గత వారం  నూతన్‌ నాయుడు ఎలిమినేషన్‌ సరిగ్గా జరగలేదని, ఓట్లు ఎక్కవ వచ్చినా కావాలనే ఎలిమినేట్‌ చేశారని షో నిర్వాహకులు, హోస్ట్‌ నానిపై ప్రేక్షకులు మండి పడుతున్నారు. అంతా స్క్రిప్టెడ్‌ గేమ్‌ అని తనీష్‌ లేక గీతామాధురిల్లో ఒకరిని విజేతగా ప్రకటించడానికే బిగ్‌బాస్‌ ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఎలిమినేట్‌ చేయాలనుకుంటే డైరెక్ట్‌ చేయాలని కానీ తమ ఓట్లు అడిగి అవమానించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

షోపై నమ్మకం పోయిందని, హోస్ట్‌ నాని కూడా వారి పక్షాన నిలుస్తూ మద్దతు తెలుపుతున్నారని కామెంట్‌ చేస్తున్నారు. కొందరైతే నాని మూవీ ‘దేవదాసు’ ను బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. ఇంకొందరు తమ అభిమాన హీరో నానియే తమని మోసం చేస్తున్నాడని, అతనిపై ఉన్న గౌరవం పోయిందని సోషల్‌ మీడియాలో పేర్కొంటున్నారు. అయితే తాజాగా ఈ ట్రోల్స్‌పై హోస్ట్‌ నాని ట్విటర్‌లో స్పందించారు. తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వారికి క్లారిటీ ఇస్తూ ఓ లేఖను పోస్ట్‌ చేశాడు. దీనికి క్యాప్షన్‌గా.. ‘బిగ్‌బాస్‌కు సంబంధించిన కొన్ని రిప్లయ్‌లను చూశాను. వీటికి నేను సమాధానం చెప్పనని బిగ్‌బాస్‌ టీమ్‌ భావించింది. కానీ చెప్పకుండా ఎలా ఉంటా’ అని పేర్కొన్నాడు.

ఆ లేఖలో ఏముందంటే.. ‘క్షమించండి.. మీలో కొంత మంది బాధపడ్డారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. షో చూస్తున్న మీరు మీ అభిమాన కంటెస్టెంట్‌ను ప్రత్యేకంగా ట్రీట్‌ చేస్తారు. కానీ నేను ఓ హోస్ట్‌గా అలా చేయలేను. అందరిని సమానంగా చూస్తాను. దీంతో మీరు నేను ఒకరికి వత్తాసు పలుకుతున్నానని అనుకుంటున్నారు. కానీ నాకు ప్రతి ఒక్కరు సమానమే. ఈ విషయంలో నాపై నమ్మకం ఉంచండి. అలాగే మీ మద్దుతుతోనే ఒకరు విజేతగా నిలుస్తారు. ఓటింగ్‌, ఎలిమినేషన్స్‌ అన్ని మీ ఓట్లతోనే జరుగుతాయి. ఓ హోస్ట్‌గా, నటుడిగా.. నా నుంచి బెస్ట్‌ ఇస్తాను. మీరు నన్ను ఇష్టపడ్డా.. ఇష్టపడకపోయినా మీరంతా నా ఫ్యామిలీయే. మీరు చేసేది ఏదైనా నాపై ప్రభావం చూపుతుంది. మీరైతే నన్ను కిందపడేయాలని చూడరు. మీ ప్రేమను పొందేందుకు నా సాయశక్తుల ప్రయత్నిస్తా.- మీ నాని’  అని ఆ లేఖలో వివరించాడు.

చదవండి : బిగ్‌బాస్‌ ఇంటి ముచ్చట్లు 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top