ప్రియాంక పెట్టిన వివాహ భోజనం!
ఎవరైనా రుచికరమైన వంటకాలతో భారీ ఎత్తున విందు ఇస్తే, వెంటనే ‘మాయాబజార్’లోని ‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు..’ అనే పాట
ఎవరైనా రుచికరమైన వంటకాలతో భారీ ఎత్తున విందు ఇస్తే, వెంటనే ‘మాయాబజార్’లోని ‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు..’ అనే పాట గుర్తొచ్చేస్తుంది. ఇటీవల ఈ రేంజ్ విందునే ప్రియాంకా చోప్రా ఇచ్చారు. అయితే అది ఆమె వివాహ భోజనం కాదు. ఈ విందుకు వేరే కారణం ఉంది. అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’లో నటించడం మొదలుపెట్టాక హిందీ చిత్రం ‘బాజీరావ్ మస్తానీ’కి తేదీలు కేటాయించే విషయంలో ప్రియాంక తడబడ్డారట.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఈ షూటింగ్ విషయంలో తానెంత ఇబ్బందిపెట్టినా చిత్రబృందం ఒక్క మాట కూడా అనకుండా సహకరించడం ప్రియాంకను కదిలించేసింది. దాంతో షూటింగ్ చివరి రోజున అందరికీ గ్రాండ్‌గా లంచ్ ఏర్పాటు చేయాలనుకున్నారు. ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్‌కి రెస్టారెంట్స్ ఉన్నాయి.
ఇటాలియన్ ఫుడ్, ఇండియన్ డిషెస్, చైనీస్... ఇలా వెరైటీ డిషెస్ తయారు చేయమని సిద్ధార్థ్‌కి విన్నవించుకున్నారు. మొత్తం రెండు వందల మంది కోసం ఈ లంచ్ ఏర్పాటు చేశారు. ప్రియాంక ఇచ్చిన ఈ భారీ విందును చిత్రబృందం ఓ పట్టు పట్టారు. ‘అన్నదాతా! సుఖీభవ’ లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదు కానీ, ఎంతో శ్రద్ధగా తమ కోసం లంచ్ ఏర్పాటు చేసినందుకు ప్రియాంకకు అందరూ ధన్యవాదాలే తెలిపారట. ఆనందంతో ఆవిడగారి కళ్లు చెమర్చాయట!


