పాట పురుగులు

 Alisha Chinai backs allegations against Anu Malik - Sakshi

# మీ టూ

సినిమా సంగీత రంగంలో ఇన్ని అపస్వరాలు ఉన్నాయని మీటూ ఉద్యమంతో తేటతెల్లమైంది.

ఒక తెలుగు సినిమాలో బ్రహ్మానందం మ్యూజిక్‌ డైరెక్టర్‌. త్రిష అప్‌కమింగ్‌ సింగర్‌. కాంపిటీషన్‌కు ముందే ఆమె మీద కన్నేసిన బ్రహ్మానందం గదిలోకి పిలిచి ‘డీల్‌’ మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ‘నువ్వు గెస్ట్‌హౌస్‌కు వస్తే నీకు  సింగర్‌గా చాన్స్‌లిస్తా’ అంటాడు. త్రిష ఒప్పుకోదు. అది కడుపులో పెట్టుకుని కాంపిటీషన్‌ సమయంలో ఆమె మీద కేకలేస్తాడు. ‘నిన్ను ఎక్కడికో తీసుకెళ్దామనుకుంటే నువ్వు రావు’ అంటాడు. లైంగికంగా వేధించడం ఒక వేధింపు అయితే పని పరంగా వేధించడం మరో వేధింపు. ఇలా వేధించే సంగీతకారులు హిందీ సినిమా రంగంలో ఉండటం ఒక వర్తమాన వాస్తవం అని మీటూ ఉద్యమం ద్వారా తెలుస్తోంది.‘బాజీగర్‌’ సినిమాలోని ‘ఏ కాలీ కాలీ ఆంఖే’ వంటి పెద్ద హిట్‌ పాటలిచ్చిన అనూ మలిక్‌పై మీటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బప్పీలహరి ప్రభ ముగిశాక బాలీవుడ్‌లో వెలిగిన సంగీత దర్శకుల్లో అనూ మలిక్‌ ఒకడు. ‘బోర్డర్‌’, ‘ఇష్క్‌’, ‘మై హూ నా’ వంటి చాలా సినిమాలు అతడి ఖాతాలో ఉన్నాయి. అతడి దృష్టిలో పడితే సింగర్‌గా మంచి కెరీర్‌ దక్కుతుందని కొత్త సింగర్లు ఆశిస్తారు. ఆ ఆశనే అతడు అవకాశంగా మలుచుకున్నాడని మీటూ ఆరోపణల వల్ల తెలుస్తున్నది. గాయనులు శ్వేతా పండిట్, సోనా మహాపాత్ర అతనిలోని కీచక స్వరాన్ని లోకానికి చాటారు. 

‘2000 సంవత్సరంలో నాకు పాట ఇస్తానని స్టూడియోకి పిలిచి రికార్డింగ్‌ రూమ్‌లో హఠాత్తుగా నన్ను ముద్దు పెట్టమన్నాడు. అప్పుడు నాకు 15 ఏళ్లు కూడా లేవు. ఏమీ తెలియదు. కానీ అతడి పెదాల మీద పూసిన విషపు నవ్వుని చూసి భయంతో వణికిపోయాను. మా అమ్మకు కూడా ఈ విషయం చెప్పక ఇంటికి రాగానే దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాను’ అని శ్వేతా పండిట్‌ చెప్పింది.
మరో గాయని సోనా మహాపాత్ర అయితే ‘అతడు నాతో ప్రదర్శించిన వైఖరిలోనే లైంగిక చొరబాటు ఉంది’ అని చెప్పింది. ఇప్పుడు తాజాగా మరో గాయని కారలిసా మంటేరో ఈ ఇద్దరితో జత కలిసి అనూను తప్పు పట్టింది. ‘అతడు నన్ను ఊరికూరికే ఇంటికి రమ్మని ఇబ్బంది పెట్టేవాడు. పాట ఏదైనా ఉంటే రికార్డింగ్‌ స్టూడియోలోనే కలుస్తాను. ఇంట్లో కలవను అని చెప్పేదాన్ని. అప్పటికీ ఒకసారి వెళ్లాల్సి వస్తే నా స్నేహితుణ్ణి తీసుకుని వెళ్లాను’ అని చెప్పిందామె. తెలిసిన గాయనుల అనుభవాలు ఇలా ఉండగా అంతగా వృద్ధిలోకి రాకపోయినా అనూతో హడలెత్తించే అనుభవాలున్న మరో ఇద్దరు గాయనులు కూడా పత్రికలలో తమ పేర్లు ప్రస్తావించకుండా అనూ చేసిన దౌష్ట్యాలు చెప్పుకొచ్చారు. ‘అతడు నన్ను ఇంటికి పిలిచాడు. ఇంట్లో ఎవరూ లేరని  అక్కడకు వెళ్లాక తెలిసింది. అతడు నన్ను దాదాపు రేప్‌ చేయబోయాడు. ఈలోపు బెల్‌ మోగడంతో బతికిపోయాను. ఆ తర్వాత నన్ను ఇంటి దగ్గర డ్రాప్‌ చేస్తానన్న నెపంతో దారిలో తప్పుగా వ్యవహరించాడు. దారి మధ్యలో కారు ఆపి బలవంతం చేశాడు’ అని ఒక సింగర్‌ చెప్పగా మరో సింగర్‌ ‘రికార్డింగ్‌ రూమ్‌లో అతడు నా ఒళ్లంతా తడిమేశాడు’ అని చెప్పింది.

అనూ మలిక్‌ మీద వచ్చిన ఆరోపణల దుమారానికి అతడు ఇండియన్‌ ఐడల్‌ జడ్జి పదవి నుంచి తప్పుకున్నాడు. లాయర్‌ ద్వారా ఈ ఆరోపణలన్నీ అభాండాలు అని చెప్పిస్తున్నాడు. కానీ అనూ మలిక్‌ అలాంటి వాడేనని అతని మీద వచ్చిన అభియోగాల్లో ప్రతి అక్షరం సత్యమే అయ్యే అవకాశం ఉందని సీనియర్‌ గాయనీమణి అలీషా చినాయ్‌ ప్రకటన చేసింది. రెండు దశాబ్దాల క్రితం అనూ మలిక్‌ తనతో చెడుగా వ్యవహరించాడని కోర్టులో కేసు వేసిన అలీషా అతడి అసలు రూపాన్ని లోకానికి వెల్లడి చేసే ప్రయత్నం చేసింది. ఆ కేసును అనూ మలిక్‌ ఎలాగోలా సర్దుబాటు చేసుకున్నాడు. అలీషా, అనూ కలిసి పని చేశారు కూడా. అయినప్పటికీ ఆ పాత గాయాన్ని ఆమె మర్చిపోలేదు. తాజా ఆరోపణల నేపథ్యంలో తనూ గొంతు కలిపింది. ‘ఆ రోజుల్లో నేను ఒక్కదాన్నే పోరాడాను. ఇవాళ చాలామంది కలిసి పోరాడుతున్నారు’ అని అందామె. ‘గాయపడినవాళ్లకే ఆ గాయం తాలూకు నొప్పి తెలుస్తుంది’ అని కూడా అంది.

లైంగిక చొరబాటుకు, చెడు వర్తనకు ఏవో ఏకాంత ప్రదేశాలు, హోటల్‌ రూములు అక్కర్లేదని ఇల్లే పెద్ద ప్రమాదకరమైన ప్రదేశం అని అనూ మలిక్‌ ఉదంతం ద్వారా తెలుస్తోంది. అనూ మలిక్‌ స్త్రీలను ఇబ్బంది పెట్టేందుకు తన ఇంటినే ఎక్కువగా ఎంచుకున్నాడు. కుటుంబీకులు ఇంట్లో ఉన్నా లేకపోయినా అతడు కొత్త అమ్మాయిలతో చెడుగా వ్యవహరించడానికి తెగించేవాడని ఉదంతాలు చెబుతున్నాయి.మరోవైపు గాయకుడు కైలాష్‌ ఖేర్‌ మీద కూడా ఇలాంటి ప్రవర్తన గురించి ఫిర్యాదులు వచ్చాయి. గాయని సోనా మహాపాత్ర, గాయని వర్షా సింగ్‌ అతని వైఖరి అభ్యంతరకరం అని ప్రకటనలు చేశారు. హిందీ సినిమా సంగీతంలో గొప్ప గొప్ప సంగీతకారులు, గాయకులు ఉన్నారు. హిందీ సినిమా సంగీతం పట్ల కోట్లాదిమంది అభిమానులకు గౌరవం, ప్రేమా ఉన్నాయి. అలాంటిది ఆ రంగంలో ఇలాంటి స్వరముఖ వ్యాఘ్రాలు ఉండటం వాంఛనీయం కాదు.మీటూ చాలా వాటిని కరెక్ట్‌ చేస్తోంది. సినిమా రంగాన్ని తగిన స్వరంలో పెడుతుందని ఆశిద్దాం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top