ప్రేమ ప్రయోగం నా కొంపముంచింది!

Sad Love Stories In Telugu : Seshu One Side Love - Sakshi

నేను డిగ్రీ చదువుతున్న రోజులు. ఇంటర్‌ తర్వాత డిగ్రీకి మా ఊరు నుంచి టౌన్‌కు డైలీ అప్‌ అండ్‌ డౌన్‌ చేయాల్సి వచ్చింది. కొత్తలో బస్‌స్టాండ్‌లోకి.. ముఖ్యంగా నలుగురు ముందుకు రావాలంటే చాలా ఇబ్బంది పడేవాన్ని. అలా రోజులు గడిచిపోతున్నాయి. నాకు చిన్నప్పటినుంచి హీరో సూర్య అంటే చాలా ఇష్టం. అతడి సినిమాలు బాగా చూసేవాడ్ని. సూర్య సన్‌ఆఫ్‌ కృష్ణన్‌ సినిమాను డీవీడీలో ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదు. ముఖ్యంగా అందులోని ట్రైన్‌ సీన్‌ నన్ను బాగా ఆకట్టుకుంది. నాకప్పుడు అనిపించింది.. ఓ అమ్మాయి వైపు చూడగానే ప్రేమలో పడతామా అని! ఆలోచించాను.. మరీ ఎక్కువగా ఆలోచించి జుట్టుపీక్కోవటం ఇష్టంలేక ఓ నిర్ణయానికి వచ్చాను.

ఎవరైనా ఓ అందమైన అమ్మాయి మీద ప్రయోగం చేద్దామనుకున్నాను. అప్పుడప్పుడు మా బస్సులో కనిపించేది ఓ అమ్మాయి.. మా కంటే సీనియర్‌! అప్పుడు తను ఎంబీఏ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ఆమె అయితే బాగుంటుంది అనుకున్నాను. అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ రోజు బస్సులు ఆలస్యంగా వచ్చాయి. వెంటవెంటనే రెండు బస్సులు రావటంతో అందరూ ముందుగా కదిలే బస్సు ఎక్కి వెళ్లిపోయారు. వేళ్ల మీద లెక్కపెట్టే మందిమి మాత్రమే రెండో బస్సులో ఉన్నాము. అందులో ఆమె కూడా ఉంది. వెన్నెల రాత్రిలో.. బస్సులోకి చల్లగా వీస్తోంది గాలి. అంతా ఓ కళలా ఉంది! తను ఎడమ వైపు ఉండే సీట్లో నా ముందుగా కూర్చుంది.

ఆమె వైపే చూస్తూ ఉండిపోయాను. ఎంత సేపు చూస్తూ ఉన్నానో నాకు తెలియదు.. గంట ఇట్టే గడిచిపోయింది. అంతలోనే నేను దిగాల్సిన స్టాప్‌ వచ్చింది. అయిష్టంగానే దిగివెళ్లిపోయాను కానీ, తనంటే అప్పటినుంచి ఇష్టం ఏర్పడింది. ఇక ప్రతి రోజూ తన కోసం బస్సు వెతికే వాడ్ని. తను రోజూ వచ్చే బస్సుకే నేను కూడా ఎక్కేవాడ్ని. ఒక వేళ తను ఆ బస్సుకు రాకపోతే! మధ్యలో బస్సు దిగి ఆమె వస్తుందనే నమ్మకం ఉన్న వేరే బస్సు ఎక్కేవాడ్ని. తను కనిపించపోతే ఏదోలా ఉండేది. కొన్ని నెలల తర్వాత నేను తనని చూస్తూన్నానని తనుకు కూడా తెలిసిపోయింది. ఎవరా! అని నన్ను చూడటం మొదలుపెట్టింది.

నేను కొద్దిగా ధైర్యం చేసి తన సీటు పక్కగా నిలబడటం, లేదా ఆమె దగ్గరిగా ఉండే సీట్లో కూర్చోవటం చేసేవాడ్ని. కొన్ని రోజుల తర్వాత తను కనిపించలేదు. ఎందుకని ఆరా తీస్తే! ఫైనల్‌ సెమిస్టర్‌ ఎక్షామ్‌ అని.. ఆ తర్వాతినుంచి తను రాదని తెలిసింది. అంతే! నా మనసు మనసులో లేదు. రాత్రిళ్లు నిద్ర కూడా సరిగా పట్టేది కాదు. నాకు మొదటిసారి మా హీరో మీద కోపం వచ్చింది.. ప్రేమ ప్రయోగం నా కొంపముంచిందనిపించింది. ఓ వారంరోజుల తర్వాత తను కనిపించింది. అదే తనని చివరి సారి చూడటం. తను కనిపించని రోజులు నేను పడ్డ బాధ ఆ దేవుడికే తెలుసు ఆ బాధనుంచి కోలుకోవటానికి చాలా రోజులు పట్టింది. ఇంకెప్పుడూ ప్రేమ ప్రయోగాల జోలికి పోకూడదనిపించింది.
- శేషు, చెన్నై


Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top