ఉద్యోగం లేదు.. ఎలా జీవిస్తారు.. | Real Telugu Love Stories Of Rajesh And Aruna From Chittoor | Sakshi
Sakshi News home page

ఉద్యోగం లేదు.. ఎలా జీవిస్తారు..

Feb 17 2020 3:10 PM | Updated on Feb 17 2020 3:12 PM

Real Telugu Love Stories Of Rajesh And Aruna From Chittoor - Sakshi

గుడి రాజేష్‌ కుమార్‌ దంపతులు

మాది కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని గుడ్ల వాలేరు గ్రామం. మా గ్రామంలో నాది తూర్పు వీధి, నేను మా ఊళ్లోని పడమర వీధికి చెందిన అరుణశ్రీ అనే అమ్మాయిని ప్రేమించాను. ఈ విషయాన్ని రెండేళ్ల క్రితమే పెద్దలకు చెప్పాం. అయితే వాళ్లు ముందు అంగీకరించలేదు. ‘నీకు ఉద్యోగం లేదు. ఎలా జీవిస్తారు’ అంటూ ప్రశ్నించేవారు. బతకడానికి ఎన్నో మార్గాలున్నాయని, ఇష్టమైన అమ్మాయితో వివాహం చేస్తేనే నేను సంతోషంగా ఉంటానని నచ్చచెప్పేవాడిని. అయినా పెద్దలు సుముఖత వ్యక్తం చేయలేదు. వివాహం చేసుకుంటే అరుణశ్రీనే చేసుకుంటానని.. లేదంటే వివాహం అవసరం లేదని తేల్చిచెప్పేశాను. ఇంతలోనే నాకు ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది. దీంతో పెద్దలు జోరుగా పెళ్లి సంబంధాలు చూసేపనిలో పడ్డారు.

నేను ముందుగా చెప్పిన విషయాన్ని పెద్దలకు స్పష్టం చేశాను. ‘మా సంతోషం ముఖ్యమా.. లేదా మీకు ఆర్ధిక అసమానతలంటూ కాలయాపన చేస్తారా?’ అని.. పదే పదే అడిగాను. దీంతో ఇరువురి పెద్దలు ఆర్ధిక అసమానతలతో పాటు అన్ని విషయాలను పక్కన పెట్టారు. దీంతో 2019 మేలో పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నాము. మేము పెద్దల గౌరవానికి, వాళ్ల మనోభావాలకు, సంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నాం.
-  గుడి రాజేష్‌ కుమార్‌, డిపో మేనేజర్‌, ఆర్టీసీ, అలిపిరి డిపో

కులాంతర వివాహమని ఆమె ఇంట్లో ఒప్పుకోలేదు


డాక్టర్‌ పెంచలయ్య దంపతులు

మాది నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం. నాన్న వెంకటయ్య, అమ్మ సుబ్బమ్మ వ్యవసాయ కూలీలు. మా ఆవిడ చిట్టి! అనంతపురం జిల్లా వజ్రకరూర్‌కు చెందిన అంజనయ్య, మాణిక్యమ్మల కుమార్తె. 1986లో తిరుపతిలోని మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదివే సమయంలో చిట్టి బీఎస్సీ నర్సింగ్‌ చదివేది. ఆ సమయంలో మా ఇద్దరి మధ్యా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరి ఇష్టాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ, కులాంతర వివాహమని ఆమె ఇంట్లో ఒప్పుకోలేదు. నాలుగు సంవత్సరాలు ఆగి, ఆ తర్వాత మళ్లీ అడిగి చూశాం. మాపై నమ్మకంతో పెద్దలు పెళ్లికి అంగీకరించడంతో లవ్‌ అండ్‌ అరెంజెడ్‌ మ్యారేజ్‌ జరిగింది.

పెళ్లి జరిగిన సంవత్సరం తర్వాత ఇద్దరం ప్రభుత్వ కొలువులు సాధించాం. మాకు ఇద్దరు పిల్లలు. బాబు డాక్టర్‌ తేజ్‌దీప్‌ ఎంఎస్‌ జనరల్‌, పాప దీప్తి నాలుగో సంవత్సరం ఎంబీబీఎస్‌ చదువుతోంది. ప్రేమికులకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఈ కాలంలో ప్రేమ, వ్యామోహం, ఆకర్షణకు తేడా కొందరు పిల్లలకు తెలియడం లేదు.
- డాక్టర్‌ పెంచలయ్య, డీఎంఅండ్‌హెచ్‌ఓ


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement