టీడీపీలో ఆధిపత్య పోరు

tdp leaders arguments in committee meeting in krishna - Sakshi

కానూరులో బాహాబాహీ

సమన్వయ కమిటీ సమావేశంలో వాగ్వాదం

పెనమలూరు: టీడీపీ కార్యకర్తలు రచ్చకెక్కారు. దివంగత ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా బాహాబాహీకి దిగారు. గొడవలో టెంట్‌ నేలకూలటంతో కార్యకర్తలు భయంతో పరుగులు తీశారు. ఇక ఎమ్మెల్యే కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కానూరులో ఇద్దరు నాయకులు కానూరులో ఎవరికి ప్రాధాన్యత అనే విషయమై గొడవ పడ్డారు. వివరాలు.. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా గురువారం కానూరులో టీడీపీ గ్రామ అధ్యక్షుడు దోనేపూడి రవికిరణ్‌ అధ్యక్షతన కార్యక్రమాలు చేపట్టారు. సనత్‌నగర్‌లో రవి,  రామాలయం వద్ద వెలగపూడి శంకరబాబు వర్ధంతి కార్యక్రమాలు చేశారు. ఈ టెంట్‌కు పక్కనే టీడీపీ మండల కార్యదర్శి షేక్‌ బుజ్జి, సేవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి రవితో పాటు ఆయతో ఉన్న వారు రావాలని శంకరబాబు కోరగా, తమకు చెప్పకుండా కార్యక్రమం పెట్టడమేమిటని రవి ప్రశ్నించాడు. 

దీంతో అక్కడే ఉన్న షేక్‌ బుజ్జీ స్పందించి పార్టీ  ప్రతిపక్షంలో ఉండగా పదేళ్లు పోరాటం చేశామని, ఇప్పుడు పార్టీలోకి వచ్చి తమకు చెబుతారా అని వీరంగం వేశాడు.  మాటామాట పెరగటంతో రాయలేని విధంగా బూతులు తిట్టుకున్నారు. ఈ గందరగోళంలో టెంట్‌ కూలిపోవటంతో కార్యకర్తలు భయంతో పరుగులు తీశారు. పార్టీ  గ్రామ అధ్యక్షుడిగా ఉన్న తనను దూషించాడని రవి, ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి బుజ్జిపై ఫిర్యాదు చేశాడు. దీని పై స్పందించిన ఎమ్మెల్యే ప్రసాద్‌ గ్రామాల్లో పార్టీ గ్రామ అధ్యక్షుడు చేసే కార్యక్రమాలు అధికార కార్యక్రమాలని చెప్పి నచ్చచెప్పారు.

సమన్వయ కమిటీలో...
ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రసాద్‌ అధ్యక్షతన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పెదఓగిరాలకు చెందిన పిచ్చిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేకు ఫోన్‌ చేస్తే తీయటం లేదని, గుర్తింపు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గ్రామంలోకి వస్తే కనీస సమాచారం ఉండటం లేదని కార్యకర్తలకు ఏమి సమాధానం చెప్పాలని నిలదీశారు. దుర్గగుడి పాలకమండలి సభ్యుడు వెలగపూడి శంకరబాబు మాట్లాడుతూ కానూరులో పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 

దీనికి కానూరు మాజీ సర్పంచి అన్నే వేణుగోపాలకృష్ణమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామం ఎవరి సొత్తుకాదని, తాము 4 వేల సభ్యత్వాలు చేయించామని, ఎవరికి చేతైతే వారు చూసుకోవటమేనని అన్నారు. కాగా కానూరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమనటంతో పార్టీలో గందరగోళం ఏర్పడింది. 

 

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top