ఇక సుదీర్ఘ ప్రయాణం షురూ...!

World Longest Non Stop Flight Takes Off From Singapore - Sakshi

19 గంటల్లోనే సింగపూర్‌ నుంచి న్యూయార్క్‌కు..

ఏకధాటిగా16,000 కి.మీ ప్రయాణం 

ఇకపై సుదీర్ఘ విమాన ప్రయాణాలకు ప్రపంచం సిద్ధమవుతోంది. సింగపూర్‌ నుంచి నేరుగా నాన్‌స్టాప్‌ ఫ్లయిట్‌లో 19 గంటల వ్యవధి లోనే 16,700 కి.మీ దూరంలో (10,400 మైళ్లు) ఉన్న న్యూయార్క్‌కు చేరుకోవచ్చు. గురువారం 161 మంది ప్రయాణికులతో కూడిన సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ‘ఎయిర్‌బస్‌ ఏ350– 900 యూఎల్‌ఆర్‌’న్యూయార్క్‌కు తొలిసారిగా బయ లుదేరి వెళ్లింది. ప్రస్తుతం పౌర విమానరంగంలో డైరెక్ట్‌ ఫ్లయిట్‌ రూపంలో అత్యంత సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్న విమానం ఇదే కావడం విశేషం. ఈ విమానాన్ని నడిపేందుకు ఇద్దరు పైలట్లు ఉంటారు. ఇద్దరు ఫస్ట్‌ ఆఫీసర్లతో పాటు 13 మంది కేబిన్‌ సిబ్బంది ఉంటారు. వీరందరికీ కూడా కచ్చితమైన పని విభజన ఉంటుంది. ప్రతి ఒక్కరికీ కనీసం నాలుగు గంటల విశ్రాంతి లభించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 

వినోదం కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఆహారపరంగా కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆకాశయానం సందర్భంగా ఆరోగ్య పరిరక్షణకు వీలుగా సేంద్రియ ఉత్పత్తులతో తినుబండారాలు తయారుచేశారు. సుదీర్ఘ ప్రయాణంతో ప్రయాణికులు విసుగు చెందకుండా ఉండేందుకు 1,200 గంటల పాటు వినోదం అందించేందుకు వివిధ రకాల ఆడియో, వీడియో కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. సినిమాలు, టీవీల ద్వారా వినోదాన్ని అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

25 శాతం తక్కువ ఇంధనం..
మామూలు విమానాల్లో కంటే ఇందులో కేబిన్‌ ఎత్తు ఎక్కువగా ఉంటుంది. జెట్‌లాగ్‌ను తగ్గించేం దుకు ఉపయోగపడేలా తగిన లైటింగ్‌ ఏర్పాట్లతో పాటు పెద్ద కిటికీలు ఉంటాయి. దాదాపుగా ఒక రోజంతా విమానంలోనే గడపాల్సి ఉన్నందున ప్రయాణికులు అలసిపోకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇతర విమానాల కంటే 25 శాతం తక్కువ ఇంధనం ఖర్చయ్యేలా ఈ రెండు ఇంజన్ల విమానాన్ని రూపొందించారు. ఈ విమానం 18 గంటల 45 నిమిషాల్లోనే నేవార్క్‌ ఎయిర్‌పోర్టులో దిగేందుకు అవకాశమున్నా, ఏకధాటిగా 20 గంటల పాటు ప్రయాణిం చేందుకు వీలుగా దీనిని తయారుచేశారు.

మరో 6 విమానాల కొనుగోలు..
ఇప్పటివరకు న్యూజిలాండ్‌లోని ఆక్‌లాండ్‌– ఖతార్‌లోని దోహాల మధ్య 17 గంటల 40 నిమిషాల పాటు సాగే ఖతార్‌ విమాన ప్రయా ణమే సుదీర్ఘమైనది. తాజాగా సింగపూర్‌– న్యూయార్క్‌ల మధ్య డైరెక్ట్‌ ఫ్లయిట్‌ సర్వీస్‌ మొదలయ్యాక మరిన్ని సుదూర ప్రయాణాలకు విమానయాన సంస్థల మధ్య పోటీ పెరగవచ్చని అంచనా. ఈ డైరెక్ట్‌ ఫ్లయిట్‌ను ప్రయాణికులు ఆదరిస్తారన్న విశ్వాసంతో ఉన్న సింగపూర్‌ ఎయిర్‌లైన్స్, ఈ ప్రయాణాల కోసం త్వరలో మరో 6 విమానాలు కొనుగోలు చేయనుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top