
బ్రిటన్ మహిళలకు మాతృత్వం శాపమా?
మాతృత్వంతోనే మహిళల జన్మ సార్థకం అవుతుందంటారు. కానీ ఆ మాతృత్వం వల్లే మహిళల జీతభత్యాలు తగ్గిపోతున్నాయని, వారి పదోన్నతి అవకాకాశాలు అడుగంటుతున్నాయన్నది ఎంతమంది గుర్తిస్తారు?
లండన్: మాతృత్వంతోనే మహిళల జన్మ సార్థకం అవుతుందంటారు. కానీ ఆ మాతృత్వం వల్లే మహిళల జీతభత్యాలు తగ్గిపోతున్నాయని, వారి పదోన్నతి అవకాకాశాలు అడుగంటుతున్నాయన్నది ఎంతమంది గుర్తిస్తారు? ప్రపంచంలోని పలు దేశాల్లో, ముఖ్యంగా మాతృత్వాన్ని ప్రోత్సహించే బ్రిటన్‌లో అమ్మతనం అనంతరం మగవారు, ఆడవారి వేతనాల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోతోందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ స్టడీస్ ఓ నివేదికలో వెల్లడించింది.
ప్రస్తుతం ఈ వ్యత్యాసం బ్రిటన్‌లో 33 శాతం ఉంది. తొలి ప్రసూతి సెలవు అనంతరం ఉద్యోగాలకు తిరిగొస్తున్న తల్లులు వేతనాల్లో వ్యత్యాసాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. మేనేజర్ పదవులకు ఎంపిక కావాల్సిన మహిళలను కూడా తల్లులైన కారణంగా ఆఫీసుల్లో, కంపెనీల్లో రొటీన్ ఉద్యోగ బాధ్యతలు అప్పగిస్తున్నారు. కొందరు తల్లులు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. మరికొందరు తల్లులు పిల్లల పోషణ బాధ్యతలను చూసికోవాల్సిన అవసరం ఉండటం వల్ల, కార్యాలయాల్లో తల్లులకు తగిన పని వాతావరణం లేకపోవడం వల్ల స్వచ్ఛందంగా పార్ట్ టైమర్లుగా మారాల్సి వస్తోంది. ప్రమోషన్ల విషయంలో కూడా తల్లుల పేర్లను కంపెనీలు పరిశీలించడం లేదని ఐఎఫ్‌ఎస్ నివేదిక వెల్లడించింది.
తల్లులైన తర్వాత 20 ఏళ్ల సర్వీసు కాలాన్ని పరిశీలిస్తే వారు మగవారికన్నా నాలుగేళ్లు మాత్రమే తక్కువగా పనిచేస్తున్నారు. 2003 సంవత్సరంలో మగ, ఆడ మధ్య వేతన వ్యత్యాసం 23 శాతం ఉండగా ఇప్పుడది 38 శాతానికి చేరుకొంది. దీన్ని గమనించి బ్రిటన్ ప్రభుత్వం వేతన వ్యత్యాసాలను సరిదిద్దేందుకు కొన్ని చర్యలను ప్రకటించింది. 250, అంతకన్నా ఎక్కువ ఉద్యోగులు కలిగిన ప్రతి కంపెనీ మహిళా ఉద్యోగులకు, పురుష ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలు ఏమిటో, పదోన్నతులు ఏమిటో ప్రతి ఏడాది ప్రభుత్వానికి సమర్పించాలని నియమాన్ని తీసుకొచ్చింది. ఈ నియమాన్ని 2017 నుంచి తప్పనిసరి అమలు చేయాలని కూడా ఆదేశించింది.
ముఖ్యంగా స్కాట్లాండ్‌లో స్త్రీ, పురుష వేతనాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉందని నివేదిక తెలియజేసింది. ఆ తేడా ఏడాదికి దాదాపు పది లక్షల రూపాయలు ఉంటోంది. అయితే, ఉత్తర ఐర్లాండ్‌లో మాత్రం ఆశ్చర్యంలో పురుషులకాన్న మహిళలకే జీతాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క 2012లో తప్పిస్తే 2010 నుంచి ఇప్పటి వరకు మగవాళ్లకన్నా ఆడవాళ్లకే జీతాలు ఎక్కువగా ఐర్లాండ్ లో ఉంటున్నాయి. తల్లులయిన తర్వాత కూడా అక్కడ వేతనాల్లో తేడాలు లేవు. 2012లో మాత్రం స్త్రీ, పురుషుల వేతనాలు సమంగా ఉన్నాయి.