పేషెంట్‌ జీరో ఎవరు?

Who Is The Zero Patient Of Coronavirus ? - Sakshi

కరోనా మొదట సోకిందెవరికి?

గుర్తించే పనిలో శాస్త్రవేత్తలు

చైనా, అమెరికా, ఇరాన్, ఇటలీలో తొలి కేసు గుర్తింపునకు యత్నాలు

ఇదంతా పక్కనపెడితే.. ఈ విలయం మొట్టమొదట అందరికంటే ముందు తాకింది ఎవరిని?. అంటే తొట్టతొలి కరోనా రోగి.. వైద్య పరిభాషలో చెప్పాలంటే ‘పేషెంట్‌ జీరో’ ఎవరు? చైనాలోని వూహాన్‌ నగరంలో పుట్టి..
ఒక్కో దేశాన్నీ చుట్టబెట్టేసింది కరోనా. లక్షల్లో బాధితులు.. వేలల్లో మృతులు. అగ్రరాజ్యమైనా.. అభివృద్ధి చెందుతున్న దేశమైనా.. అన్నింటా మరణ మృదంగమే!.

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల పేర్లు గోప్యంగా ఉంచుతున్నారు. పేషంట్లను ‘నంబర్లు’ గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏడు లక్షలకుపైగా రోగులు ఉండగా, వీరిలో ‘పేషెంట్‌ జీరో’ ఎవరన్నది తెలుసుకోవడం కష్టమే. అయినా.. శాస్త్రవేత్తలు, సాంక్రమిక వ్యాధి నిపుణులు ఇప్పుడు అదేపనిలో ఉన్నారు. గతేడాది డిసెంబరులో చైనాలో మొదలైన కరోనా మూలాలను వెతికే ప్రయత్నం చేస్తున్నారు. కొంత విజయం సాధించారు కూడా. ఇటలీ, ఇరాన్, అమెరికాల్లోనూ ‘పేషెంట్‌ జీరో’ గుర్తింపునకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే భవిష్యత్తులో ఇలాంటి విపత్తు సంభవించినప్పుడు మెరుగైన చికిత్స, నియంత్రణ చర్యలకు వీలుంటుందన్నది శాస్త్రవేత్తల అంచనా.

పరిశోధనలకు కీలకం: పేషెంట్‌ జీరో ఎవరో తెలుసుకోవడమనేది వ్యాధులపై పరిశోధనలు చేసే వారికి కీలకం. వైరస్‌ లేదా సూక్ష్మజీవి ఎంతమందికి సోకే అవకాశముందో సూచించేందుకు ‘ఆర్‌–నాట్‌’ అనే పదాన్ని వాడుతుంటారు. కరోనా విషయంలో ఆర్‌–నాట్‌ 2.5గా ఉంది. అంటే పది మందికి వైరస్‌ సోకితే వారి నుంచి కనీసం 25 మంది దాని బారిన పడతారన్నమాట. పేషెంట్‌ జీరో ఎవరనేది తెలుసుకుంటే వైరస్‌ ఎక్కడ పుట్టింది? ఎలా విస్తరించింది? ఎంత మేరకు నియంత్రణ చర్యలు చేపట్టాలనేది తెలుస్తుందని హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) మాజీ డైరెక్టర్‌ సీహెచ్‌.మోహన్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. వైరస్‌ జన్యుక్రమంలో మార్పులను గుర్తించడం చికిత్సను అభివృద్ధి చేసేందుకు అవసరమని ఆయన  చెప్పారు. ఈ నేపథ్యంలోనే చైనాతోపాటు ఇతర దేశాలూ పేషెంట్‌ జీరోను గుర్తించేందుకు శ్రమిస్తున్నాయి. కాకపోతే కొన్ని రోజులపాటు వైరస్‌ లక్షణాలేవీ కనిపించకపోవడం వల్ల చాలామంది అన్ని రకాల నియంత్రణలు, పరీక్షలను దాటుకుని తమకు తెలియకుండానే కరోనాను వ్యాప్తి చేశారు కాబట్టి.. పేషెంట్‌ జీరోను గుర్తించడం సులువు కాదు.

చైనాలో ‘పేషెంట్‌ జీరో’ ఆమె?
వూహాన్‌ నగరంలో ఉండే సముద్ర జంతువుల మార్కెట్లోనే కరోనా వైరస్‌ మనుషులకు సోకిందనే అనుమానాలున్నాయి. ఇదే మార్కెట్లో రొయ్యల వ్యాపారి వీ గుయిక్సియాన్‌ (57) అనే మహిళ చైనా వరకు పేషెంట్‌ జీరో కావచ్చని అంచనా. చైనా డిజిటల్‌ వార్తా పత్రిక ‘ద పేపర్‌’ కథనం ప్రకారం.. ఈమె గతేడాది డిసెంబరులో అస్వస్థతతో ఆసుపత్రిలో చేరింది. ఏటా శీతాకాలంలో జలుబు చేయడం సాధారణమే అనుకుని చాలాకాలం ఆసుపత్రికి వెళ్లలేదని, లక్షణాలు బాగా ముదిరాక చేరానని ఆమె చెప్పింది. మార్కె ట్లోని మూత్రశాలల ద్వారా తనకు వైరస్‌ సోకి ఉండొచ్చనేది ఆమె అంచనా. ప్రభుత్వం కొంచెం ముందుగానే మేల్కొని చర్యలు తీసుకుని ఉంటే ఈ స్థాయిలో మరణాలు ఉండేవి కాదని తెలిపింది. కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన తొలి 24 మందిలో ఈమె ఒకరని వూహాన్‌ మున్సిపల్‌ ఆరోగ్య కమిషన్‌ కూడా నిర్ధారించింది. అయితే గతేడాది డిసెంబరు 1న చైనా శాస్త్రవేత్తలు ఒక ప్రకటన చేస్తూ.. కరోనా బారినపడ్డ తొలి వ్యక్తికి సముద్రజీవుల మార్కెట్‌తో సంబంధం లేదని చెప్పారు. కాబట్టి వీ గుయిక్సియాన్‌ పేషెంట్‌ జీరో అయినప్పటికీ జంతువుల నుంచి వైరస్‌ సోకిన తొలి మనిషి మాత్రం కాకపోవచ్చు.

ఇటలీలో మ్యూనిచ్‌ వాసి!
యూరోపియన్‌ దేశాల్లో కరోనాతో తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో ఇటలీ ఒకటి. వైరస్‌ వ్యాప్తితో ఈ దేశం జనవరి చివరిలో అన్ని విమాన సర్వీసులను రద్దు చేసింది. రోమ్‌లో ఇద్దరు చైనీయులకు వైరస్‌ సోకడం దీనికి కారణమైంది. అయితే నిపుణుల అంచనాల మేరకు ఈ వైరస్‌ విమాన సర్వీసుల రద్దుకు ముందే ఇటలీలోకి ప్రవేశించింది. ఫిబ్రవరి 21న ఇటలీ ఉత్తర ప్రాంతంలోని లాంబార్డీలో కరోనా వైరస్‌ సామాజిక స్థాయిలో విస్తరించడం మొదలైంది. మిలాన్‌ సమీపంలోని కొడోగ్నో పట్టణంలో మటియాస్‌ అని పిలిచే 38 ఏళ్ల వ్యక్తిని వైద్యులు ‘పేషెంట్‌ వన్‌’గా గుర్తించారు. ఈ వ్యక్తి ఇటీవల చైనాకు వెళ్లిన దాఖలాల్లేవు. కాకపోతే అతడి సహోద్యోగి ఒకరు చైనా నుంచి కొంతకాలం క్రితమే తిరిగి వచ్చాడు. ఈ వ్యక్తే పేషెంట్‌ జీరో కావచ్చునని అనుకున్నా.. అతడిలో వైరస్‌ లేనట్లు పరీక్షల్లో తేలింది. మటియాస్‌ వ్యాధిబారిన పడక ముందే ఇటలీలోకి వైరస్‌ వచ్చిందని, జన్యుక్రమాన్ని బట్టి చూస్తే జనవరి 19 –22 మధ్య మ్యూనిచ్‌ ప్రాంతంలో వైరస్‌ అంటించుకున్న వారెవరో ఇటలీకి దాన్ని మోసుకొచ్చి ఉండాలని బయోమెడికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ మసీమో గల్లీ అంటున్నారు.

అమెరికాలో వాషింగ్టన్‌ స్టేట్‌ వ్యక్తి..
అమెరికాలో తొలి కరోనా కేసు జనవరి 20న నమోదైంది. వూహాన్‌ నుంచి తిరిగొచ్చిన వాషింగ్టన్‌ స్టేట్‌ వ్యక్తి (35)లో లక్షణాలు కనిపించాయి. వూహాన్‌ నుంచి తిరిగొచ్చిన 4 రోజులకు అంటే జనవరి 19న అతడు సియాటెల్‌లోని చికిత్స కేంద్రాన్ని సందర్శించినట్లు బూల్మ్‌బర్గ్‌ ఒక కథనంలో పేర్కొంది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇంటికి ఇతడు మరికొందరితో కలిసి ప్రయాణించాడని తెలుస్తోంది. 

ఇరాన్‌లో..
చైనాకు తరచూ ప్రయాణించే కోమ్‌ ప్రాంతపు వ్యాపారి నుంచి కరోనా వైరస్‌ ఇరాన్‌లోకి ప్రవేశించి ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. అతడే ఇరాన్‌ ఆరోగ్య శాఖ మంత్రి సయీద్‌ నమాకీ. నేరుగా చైనాకు వెళ్లే విమానాలను ప్రభుత్వం రద్దు చేసిన సందర్భంలో ఈయన ఇతర మార్గాల ద్వారా చైనా వెళ్లివచ్చినట్లు తెలుస్తోంది. వ్యాధి లక్షణాలతో ఈ వ్యక్తి మరణించారు కూడా.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top