జీవం పుట్టుకకు దారేదీ? | Where is the birth of life? | Sakshi
Sakshi News home page

Oct 4 2017 1:15 AM | Updated on Oct 4 2017 1:15 AM

Where is the birth of life?

భూమ్మీద జీవం ఎలా పుట్టింది? చాలా ఆసక్తికరమైన ప్రశ్న. సముద్రపు అడుగున పుట్టిందని కొందరు. అగ్నిపర్వత బిలాల్లోంచి ఆవిర్భవించిందని ఇంకొందరు శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు. సుమారు 370 నుంచి 450 కోట్ల ఏళ్ల కింద ఆకాశం నుంచి కొన్ని ఉల్కల ముక్కలు వెచ్చటి, చిన్నసైజు నీటి కుంటల్లోకి పడటం జీవం పుట్టుకకు కారణమైందని తాజాగా మెక్‌మాస్టర్‌ విశ్వవిద్యాలయం, జర్మనీలోని మ్యాక్స్‌ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై సముద్రాల మధ్య ఖండాలు ఏర్పడుతున్న సమయంలోనే భూమ్మీద జీవం ఏర్పడింది.

ఉల్కా శకలాలతో పాటు మౌలిక పోషకాలు చేరడంతో ముందుగా తనంతట తాను పునరుత్పత్తి చేసుకోగల ఆర్‌ఎన్‌ఏ ఏర్పడిందని.. ఇది తర్వాతి కాలంలో జీవం ఆవిర్భవానికి దారితీసిందని కె.డి.పియర్స్‌ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. ఖగోళ భౌతిక శాస్త్రంతో పాటు భూగర్భ, రసాయ, జీవ శాస్త్రాలన్నింటి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొంటున్నారు. వెచ్చటి కుంటల్లోని నీరు ఆవిరి కావడం, మళ్లీ నీరు చేరడం వంటి సహజ ప్రక్రియల వల్ల ఉల్కా శకలాల ద్వారా నీటిలోకి చేరిన రసాయనాలు ఒకదానితో ఒకటి బంధం ఏర్పరచుకునేందుకు వీలేర్పడిందని తెలిపారు. అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు కొన్ని ఆర్‌ఎన్‌ఏలు పరిస రాల్లోని పోషకాలను గ్రహించి మరిన్ని ఆర్‌ఎన్‌ఏలను ఉత్పత్తి చేయగలిగాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement