వినూత్నంగా పెళ్లి ప్రపోజల్ | variety wedding proposal with scene from love actually movie | Sakshi
Sakshi News home page

వినూత్నంగా పెళ్లి ప్రపోజల్

Dec 24 2015 5:54 PM | Updated on Apr 4 2019 3:19 PM

వినూత్నంగా పెళ్లి ప్రపోజల్ - Sakshi

వినూత్నంగా పెళ్లి ప్రపోజల్

అమెరికాలోని కెంటకీ చెందిన విలియమ్స్ జీజే జెరార్డ్ తన గర్ల్ ఫ్రెండ్ జెనా ఎలాంగ్‌కు వినూత్నంగా పెళ్లి ప్రతిపాదన ఎలా చేయాలని తెగ ఆరాటపడ్డారు.

ప్రేమించిన అమ్మాయి ముందుకు పెళ్లి ప్రతిపాదన ఎలా తీసుకురావాలని భారత్‌ లాంటి దేశాల్లో మొహమాటపడే యువకులు ఎక్కువే ఉంటారు. పాశ్చాత్య దేశాల్లో పెళ్లి ప్రతిపాదన తీసుకరావడానికి మొహమాటపడరు గానీ పెళ్లి ప్రతిపాదన వీలైనంత వినూత్నంగా ఉండాలని తాపత్రయపడతారు. అలాగే అమెరికాలోని కెంటకీ చెందిన విలియమ్స్ జీజే జెరార్డ్ తన గర్ల్ ఫ్రెండ్ జెనా ఎలాంగ్‌కు వినూత్నంగా పెళ్లి ప్రతిపాదన ఎలా చేయాలని తెగ ఆరాటపడ్డారు, ఎడతెరిపి లేకుండా ఆలోచిస్తూ వచ్చారు. చివరకు 9 నిమిషాల ప్రతిపాదన ప్లాన్ చేసుకోవడానికి ఏకంగా ఆయనకు 9 నెలల టైమ్ పట్టింది.

విలియమ్స్ తన పెళ్లి ప్రతిపాదన కోసం 'లవ్ యాక్చువల్లీ' అనే హాలీవుడ్ క్లాసిక్ సినిమాలోని ఓ సీన్ రిపీట్ చేయాలనుకున్నారు. ఓ చారిటీ చెక్కును అందుకోవడానికి కెంటకీ విశ్వవిద్యాలయానికి రావాలని మూడు రోజుల క్రితం తన గర్ల్ ఫ్రెండ్ జెనాకు కబురంపారు. అందుకు ఆమె అంగీకరించారు. జెనా తల్లి నాన్ ప్రాఫిట్ సంస్థ 'గాడ్స్ పాంట్రీ'కి సీఎఫ్‌ఓగా పనిచేస్తున్నారు. తల్లి తరఫున చెక్కును అందుకోడానికి తల్లితో సహా వచ్చిన జెనా.. యూనివర్సిటీ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఓ బ్రాస్ బ్రాండ్ వెంటరాగా విలియమ్స్ స్వాగతం పలికారు. మృదుమధుర సంగీతం వినిపిస్తూ బ్రాస్ బ్రాండ్ ముందు నడుస్తుండగా, వెనకాల జెనాను, ఆమె తల్లిని తోడ్కొని విలియమ్స్ అనుసరించారు.

సంగీతానికే ఆశ్చర్య పడిన జెనా.. యూనివర్సిటీలో ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలో గుమిగూడిన విద్యార్థులు చప్పట్లతో స్వాగతం చెబుతుంటే ఉక్కిరిబిక్కిరయ్యారు. తనకు ఎందుకింద ప్రాముఖ్యం ఇస్తున్నారో తెలియక ఉబ్బి తబ్బిబ్బయ్యారు కూడా. చివరకు ఎలాగో చెక్కును అందుకొని కొంచెం ఖాళీగా ఉన్న బాస్కెట్ బాల్ కోర్టులోకి ప్రవేశించారు. ఇప్పుడే వాష్‌రూమ్‌కు వెళ్లొస్తానంటూ విలియమ్స్ అక్కడి నుంచి జారుకున్నారు. అప్పటివరకు సాధారణ దుస్తుల్లో ఉన్న విలియమ్స్ యూనివర్సిటీ సమీపంలో జ్యుయెలరీ షాప్‌కెళ్లి సూటు బూటు ధరించారు. యూనివర్సిటీలోని ఓ ద్వారం గుండా హఠాత్తుగా జెనా ముందు ప్రత్యక్ష మయ్యారు. ఆమె ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే ఆమెను 'ఆశ్చర్యం' అని రాసున్న ఓ హ్యాంగర్ వద్దకు తీసుకెళ్లారు. దానికి చుట్టి ఉన్న కవర్ తీయగానే వందలాది ప్లకార్డులు కనిపించాయి.

వాటిలో నుంచి విలియమ్స్ ఒక్కొక్కటే తీసి తన ప్రేమ సందేశాలను వరుసగా చదివి వినిపిస్తూ వచ్చారు. 9 నెలలుగా ప్రేమతో రగిలిపోతున్న హృదయం గురించి చెబుతూ వచ్చారు. చివరకు 'లవ్ యాక్చువల్లీ' సినిమాలోలాగే 'ఈ భూమండంలోనే నీవే నాకు తగిన దానివి' అనే సందేశం వినిపించగానే.. అప్పటివరకు సంభ్రమాశ్చార్యాల్లో మునిగిపోయిన జెనా ఒక్కసారిగా ముందుకు వచ్చి విలియమ్స్ పెళ్లి ప్రతిపాదనను అంగీకరిస్తూ నుదుటిపై ముద్దుపెట్టుకున్నారు. చుట్టూ వందల సంఖ్యలో మూగిన విద్యార్థులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఈ ప్రపోజల్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement