టర్కీ రాజధాని అంకారాలో జనసమ్మర్థం ఉన్న ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి బాంబుదాడిలో కనీసం 34 మంది మరణించగా, మరో 125 మంది గాయపడ్డారు.
అంకారా: టర్కీ రాజధాని అంకారాలో జనసమ్మర్థం ఉన్న ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి కారు బాంబుదాడిలో కనీసం 34 మంది మరణించగా, మరో 125 మంది గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం సెంట్రల్ అంకారాలోని కిజిలే స్క్వేర్ సమీపంలో ఓ బస్ స్టాప్ వద్ద ఈ ఘటన జరిగింది. వాణిజ్య సముదాయాలు, ట్రాన్స్పోర్ట్ హబ్ గల ఈ ప్రాంతంలో భారీ నష్టం జరిగింది.
పేలుడు పదార్థులు నింపిన కారులో ఒకరు లేదా ఇద్దరు వచ్చి, బస్ స్టాప్ లక్ష్యంగా ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గత ఐదు నెలలలో అంకారాలో ఉగ్రవాద దాడి జరగడమిది మూడోసారి. టర్కీ ప్రధాని కార్యాలయం, పార్లమెంట్, విదేశీ ఎంబసీలు గల ప్రాంతానికి సమీపంలో ఈ బాంబు దాడి జరిగింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు, కుర్దీష్ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్నారు. కాగా ఈ దాడికి బాధ్యులు ఎవరన్నది ఏ ఉగ్రవాద సంస్థా ఇంకా ప్రకటించలేదు. సెంట్రల్ అంకారాలో దాడి జరిగే అవకాశముందని, ఆ ప్రాంతానికి వెళ్లవద్దంటూ గత శుక్రవారం అమెరికా ఎంబసీ ఆ దేశ పౌరులను హెచ్చరించింది.