జాతీయ జెండాతో ‘కీకీ’ చాలెంజ్‌.. వివాదంలో ఎయిర్‌లైన్స్‌

Tourist Kiki Challenge In Aeroplane Gets Pakistan International Airlines Into Trouble - Sakshi

కీకీ చాలెంజ్‌.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్న సరికొత్త చాలెంజ్‌. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్‌ అయిన ఈ చాలెంజ్‌ వల్ల ఇబ్బందుల పాలవుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ) కూడా ఈ జాబితాలో చేరింది. అసలేం జరిగిందంటే.. పోలాండ్‌కు చెందిన టూరిస్ట్‌ ఇవా బయాంక జుబెక్‌ ప్రస్తుతం పాకిస్తాన్‌లో పర్యటిస్తోంది. అయితే పాకిస్తాన్‌ స్వాతం‍త్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పీఐఏ ఆమెతో ఓ ప్రమోషనల్‌ వీడియోను రూపొందించింది. 

పాక్‌ జాతీయ జెండాను ఒం‍టిపై కప్పుకున్న ఇవా బయాంక.. ఆగి ఉన్న విమానంలో డాన్స్‌ చేస్తూ కీకీ చాలెంజ్‌ విసిరింది. ఇందుకు సంబంధించిన వీడియోను పీఐఏ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘ప్రపంచాన్నంతటినీ చుట్టి వస్తోన్న గ్లోబల్‌ సిటిజన్‌ ఇవా జుబెక్‌ హృదయం ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది. పీఐఏలో ప్రయాణిస్తూ ఆమె సరికొత్త అనుభవాన్నిఆస్వాదిస్తున్నారు. ఇంతకు ముందెన్నడు, ఎవరూ సెలబ్రేట్‌ చేసుకోని విధంగా ఆమె పాక్‌ స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుతున్నారంటూ’  ట్వీట్‌ చేసింది. ఈ  వీడియో వైరల్‌ కావడంతో వివాదం చెలరేగింది.

చర్యలు తప్పవు..
ఇవా బయాంక చర్యను తీవ్రంగా తప్పు పట్టిన పాక్‌ నేషనల్‌ అకౌంటబిలిటి బ్యూరో(ఎన్‌ఏబీ) ఆమెపై, పీఐఏపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఎన్‌ఏబీ అధికారి మాట్లాడుతూ.. ‘ అసలు ఆమెను ఆగి ఉన్న విమానంలోకి వచ్చేందుకు, డ్యాన్స్‌ చేసేందుకు అనుమతించింది ఎవరో కనుక్కునే పనిలో ఉన్నాం. జాతీయ జెండాను అవమానించినందుకు ఆమెకు నోటీసులు జారీ చేశాం. ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా పీఐఏకి లెటర్‌ కూడా పంపించామని’ పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top