వైద్యశాస్త్రంలో చేసిన కృషికిగాను అమెరికా, జర్మనీలకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు ఉమ్మడిగా ఈ ఏటి నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు.
స్టాక్‌హోమ్: వైద్యశాస్త్రంలో చేసిన కృషికిగాను అమెరికా, జర్మనీలకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు ఉమ్మడిగా ఈ ఏటి నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. శరీర కణాల్లో అంతర్గతంగా, కణాల మధ్య రవాణా వ్యవస్థపై పరిశోధన చేసిన.. అమెరికాకు చెందిన జేమ్స్ రోత్‌మాన్, రాండీ షెక్‌మాన్‌తో పాటు జర్మనీ సంతతి శాస్త్రవేత్త థామస్ స్యూదోఫ్‌లను నోబెల్‌కు ఎంపిక చేసినట్లు నోబెల్ జ్యూరీ ప్రకటించింది. ఈ బహుమతి కింద దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలను ముగ్గురు శాస్త్రవేత్తలు ఉమ్మడిగా అందుకోనున్నారు. డిసెంబర్ 10న స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగే కార్యక్రమంలో వారికి పురస్కారాలను అందజేస్తారు. కాగా, గతేడాది కణాల్లో ప్రోగ్రామింగ్‌పై పరిశోధన చేసిన జపాన్‌కు చెందిన షిన్యా యమనక, బ్రిటన్‌కు చెందిన జాన్ గుర్డోన్ సంయుక్తంగా వైద్యశాస్త్ర నోబెల్‌ను అందుకున్నారు.
ఏమిటి వారి పరిశోధన..
సాధారణంగా శరీరంలో కణాలు సజీవంగా ఉండాలంటే వాటికి నిత్యం పోషకాలు అందుతూ ఉండాలి. దానితోపాటు వివిధ గ్రంధులు, నాడీవ్యవస్థ సహా వివిధ అవయవాల్లోని కణాలు.. ఆ అవయవానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక ఉమ్మడి విధులను నిర్వర్తిస్తుంటాయి. అందుకోసం వాటి మధ్య రసాయన మాలిక్యూల్‌ల రూపంలో సమాచార మార్పిడి జరుగుతుంది. అంతేగాకుండా కణాల్లో ఉత్పత్తయిన ఇన్సూలిన్ వంటి హార్మోన్ల మాలిక్యూల్‌లు కూడా రవాణా అయి ఒకే చోటికి చేరి ఒకేసారి విడుదలవుతాయి. అయితే, ఈ రసాయన మాలిక్యూల్‌లు వివిధ కణాల మధ్య బుడగల రూపంలో రవాణా అవుతాయని.. అన్ని ఒకే స్థితిలో, ఒకే సమయంలో, కణంలోని నిర్ణీత ప్రాంతానికి ఎలా చేరుతాయనేదానిని రోత్‌మాన్, షెక్‌మాన్, స్యూదోఫ్ గుర్తించారు. దీనిద్వారా అవయవాల పనితీరులో, హార్మోన్ల విడుదల, రోగ నిరోధక వ్యవస్థలో లోపాలు.. నాడీ సంబంధిత, మధుమేహం వంటి వ్యాధులకు కారణాలను గుర్తించవచ్చు. తద్వారా ప్రభావవంతమైన చికిత్సలను రూపొందించవచ్చు. ఈ పరిశోధన వైద్యశాస్త్రంలో ఎన్నో గొప్ప ఆవిష్కరణలకు నాంది పలకవచ్చని భావిస్తున్నారు.