
ఆన్‌లైన్ దొంగలతో జర జాగ్రత్త!
మీ మొబైల్ నెంబర్‌కు లక్ష డాలర్ల లాటరీ తగిలింది. ఆ మొత్తానికి అవసరమైన పన్నును ప్రభుత్వానికి చెల్లించి మిగతా సొమ్మును తీసుకోండి.
న్యూయార్క్: ‘మీ మొబైల్ నెంబర్‌కు లక్ష డాలర్ల లాటరీ తగిలింది. ఆ మొత్తానికి అవసరమైన పన్నును ప్రభుత్వానికి చెల్లించి మిగతా సొమ్మును తీసుకోండి. నగదును ఒప్పుకోము. అలా ఒప్పుకునే ఆన్‌లైన్ దొంగలు ఉంటారు. జాగ్రత్త! మేము మాత్రం చెక్కుల రూపంలోనే పక్కా బ్యాంకు ఎకౌంట్ల ద్వారానే స్వీకరిస్తాం. మా కంపెనీ వివరాలను కావాలంటే చెక్ చేసుకోండి...అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా అమెరికాలోని డిస్నీల్యాండ్‌ను ఉచితంగా సందర్శించే అవకాశం మీకు లభించింది.
ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోండి. వెంటనే వంద రూపాయలను ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి మీ పేరును రిజిస్టర్ చేసుకోండి లేదా రోజూ పది రూపాయల చొప్పున మూడు నెలలపాటు ఆన్‌లైన్ ట్రేడింగ్ కంపెనీకి చెల్లించండి, ఆ తర్వాత వరుసగా మూడు నెలలపాటు రోజుకు వంద రూపాయల చొప్పున స్వీకరించండి’ అనే తప్పుడు మెయిళ్లతో ప్రజలను తప్పుదారి పట్టించి ఆన్‌లైన్ ద్వారా కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్న సంస్థలు కోకొల్లలుగా ఉన్నాయి.
ఇలాంటి తప్పుడు ప్రకటనలపై అనుమానాలతో పలుసార్లు పట్టించుకోకపోయినా రకరకాల మాటలతో ప్రజలను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తారు ఆన్‌లైన్ చోరాగ్రేసరులు. కొన్నిసార్లు నమ్మించిందేకు మన బ్యాంక్ ఖాతాలకు డబ్బులు కూడా పంపిస్తారు. ఇలాంటి అంతర్జాలం మాయగాళ్లు పక్కా బ్యాంక్ ఖాతాలతో బాధితుల నుంచి డబ్బు కొల్లగొట్టడం ఎలా సాధ్యం అవుతుందన్న అనుమానం సహజంగా కలుగుతుంది. దీని వెనక వారికి పెద్ద ఆన్‌లైన్ నెట్‌వర్క్ ఉంటుంది.
అలాంటిదే కెనడాకు చెందిన ‘ప్యాక్‌నెట్ సర్వీసెస్ లిమిటెడ్’ . పేపెంట్ ప్రాసెసర్‌గా పనిచేసే ఈ కంపెనీ బాధితుల ఖాతాల నుంచి డబ్బులను తీసుకొని మోసగాళ్ల ఖాతాల్లోకి చేరవేస్తూ ఉంటుంది. మోసగాళ్లు తమ ఖాతాల్లోని సొమ్మును వెంట వెంటనే డ్రా చేసుకుంటారు. ఈ మధ్యవర్తిగా వ్యవహరించినందుకు ప్యాక్‌నెట్ లాంటి కంపెనీలకు పెద్ద మొత్తంలో కమిషన్లు అందుతాయి. అమెరికా న్యాయశాఖ, ఇతర దర్యాప్తు సంస్థలు ఇటీవలనే ప్యాక్‌నెట్ లావాదేవీలను ట్రాక్‌చేసి కంపెనీని మూసివేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి లావాదేవీలు నిర్వహిస్తున్న ప్యాక్‌నెట్ కంపెనీ ఒక్క అమెరికా ప్రజల నుంచే ఏడాదికి ఐదు కోట్ల డాలర్ల ఈ మెయిళ్ల ఫ్రాడ్‌ను నిర్వహించిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ చోరాగ్రేసర్లు, వారికి సహకరించే ఆన్‌లైన్ నెట్‌వర్క్ కంపెనీలు ఎన్నో ఉన్నాయని అమెరికా దర్యాప్తు సంస్థలు హెచ్చరిస్తున్నాయి.