
ప్రైవేటు ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల మోసం
ఉన్నత విద్యామండలి పరిశీలనలో వెలుగు చూసిన నిజాలు
పుస్తకాల లెక్కల్లోనే విద్యార్థులు.. వారిదంతా వేరే దారి
తూతూ మంత్రంలా పరీక్షలు.. పాస్ సర్టీఫికెట్లు
సాక్షి, హైదరాబాద్: క్లాసులే పెట్టరు..విద్యార్థులే రారు..ఫీజు రీయింబర్స్‌మెంట్ మాత్రం కాలేజీల ఖాతాల్లోకి వెళుతుంది.ఇదీ ప్రైవేటు ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల తీరు. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగుతోంది. దీనిపై ఏటా కుప్పలుతెప్పలుగా ఫిర్యా దులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి ఇటీవల దాదాపు 40 కాలేజీలను తనిఖీ చేసింది. చాలాచోట్ల ఎంబీఏ, ఎంసీఏ బోధనే జరగడం లేదని గుర్తించింది. కొన్నిచోట్ల అదే ప్రాంగణంలో ఇంజనీరింగ్ కాలేజీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం కాలేజీలు కనిపిస్తున్నాయి.
కౌన్సెలింగ్ జరుగుతోంది. సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. రికార్డుల్లో ఉన్న విద్యార్థులు కాలేజీల్లో మాత్రం కనిపించరు. తనిఖీలు చేపడతామని యూనివర్సిటీ అధికారులు నోటీసులు ఇస్తే మాత్రం పిలిపిస్తారు. ఘట్‌కేసర్‌లోని ఓ రాజకీయ నేత కాలేజీకి వెళ్లిన మండలి అధికారులు నివ్వెరబోయారు. అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ మినహా ఎంబీఏ, ఎంసీఏ తరగతులు, రికార్డులు కనిపించలేదు.
పరీక్షల తీరూ ప్రహసనమే
రాష్ట్రవ్యాప్తంగా 281 ఎంబీఏ కాలేజీల్లో 38,200 సీట్లున్నాయి. 76 ఎంసీఏ కాలేజీల్లో 8,900 సీట్లున్నాయి. ఒక్కో వర్సిటీ పరిధిలో ఒక్క కాలేజీని మినహాయిస్తే..మిగతావన్నీ ప్రైవేట్ కాలేజీలే. ఉమ్మడి ప్రవేశపరీక్ష ద్వారా ఈ సీట్లు భర్తీ చేస్తారు. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ.28 వేల ఫీజు రీయింబర్స్ చేస్తుంది. ఇతర స్కాలర్‌షిప్పులూ విద్యార్థులకు అందుతాయి. ఈ ప్రక్రియ మొత్తం సాధారణంగానే జరిగిపోతుంది. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు 50 శాతం ప్రాజెక్టు వర్క్ ఉంటుంది. ఈ రిపోర్టులనూ వీరు తయారు చేయడం లేదు.
ఇతరులు చేసినవి డబ్బులిచ్చి కొంటున్నారు. కాలేజీలో ఒక్క క్లాసు కూడా జరిగిన దాఖలాల్లేవు. ఎంబీఏ, ఎంసీఏ అధ్యాపకులు ఎవరో? వారికి ఏ అకౌంట్ నుంచి వేతనాలు ఇస్తున్నారో.. తెలిపే ఒక్క ఆధారం మండలి అధికారులకు కనిపించలేదు. విద్యార్థులంతా వార్షిక సంవత్సరం ఆఖరులో పరీక్షలకు హాజరవుతారు. అక్కడా కాలేజీలే మేనేజ్ చేస్తున్నాయనేది ఆరోపణ. క్లాసులకు రాకున్నా, పాఠాలు చదవకున్నా, అందరూ పాసయిపోతున్నారు. ఇలా డిగ్రీలు ఇస్తే విద్యార్థుల్లో నైపుణ్యం ఏముంటుందని మండలి వైస్‌చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం అన్నారు.
నివేదికను తొక్కి పెట్టిందెవరు?
ఆనవాళ్లే లేని కాలేజీల బాగోతంపై తనిఖీలు జరిపిన మండలి అధికారులు నివేదిక రూపొందించారు. ఇది జరిగి రెండు నెలలైంది. ఇంతవరకూ ఇది ప్రభుత్వం వద్దకే చేరలేదు. రాజకీయ ఒత్తిడే కారణమని తెలుస్తోంది. తనిఖీ వ్యవహారంపై మండలి వర్గాల్లోనూ వివాదాలకు కారణమవుతోంది. కీలకమైన నివేదికను ప్రభుత్వం దృష్టికి తేవాలని ఒక వీసీ పట్టుబడుతున్నారు. దీనిపై ఆందోళన చేసేందుకు విద్యార్థి సంఘాలు సమాయత్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఉస్మానియా వర్సిటీ అధికారులు గురువారం నుంచి కాలేజీల తనిఖీలు చేపట్టబోతున్నారు. ఇది పూర్తయిన తర్వాతే అనుబంధ గుర్తింపు ఇస్తారు. మండలి నివేదికను పరిగణలోనికి తీసుకుంటే చాలా కాలేజీలకు అనుబంధ గుర్తింపు వచ్చే అవకాశం ఉండదు. ఈ మొత్తం వ్యవహారంలో అన్ని స్థాయిలకు ముడుపులు వెళుతున్నాయని విద్యార్థి వర్గాలు అంటున్నాయి.