
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగర శివార్లలోని తెల్లాపూర్‌లో ఉంటున్న ఓ వ్యక్తి తాను ముంబైలో ఉంటున్నట్లు ఆన్‌లైన్‌లో ప్రచారం చేసుకున్నాడు. ఫిన్‌పెయిర్ పేరుతో వెబ్‌సైట్ ఏర్పాటు చేసి వ్యాపారాభివృద్ధికి రుణం ఇస్తానంటూ ఎర వేశాడు. నమ్మి ముందుకు వచ్చిన నగర వ్యాపారి నుంచి రూ.1.5 కోట్లు స్వాహా చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడు డి.నాగరాజును అరెస్టు చేసినట్లు డీసీపీ దార కవిత శుక్రవారం వెల్లడించారు.
తెల్లాపూర్ రోడ్డులోని హోనర్ వివాంటీస్‌లో నివసించే నాగరాజు ఆన్‌లైన్‌లో ఫిన్ పెయిర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. దీనికోసం ఓ వెబ్‌సైట్‌ను రూపొందించిన ఇతగాడు అందులో ఇది ముంబై కేంద్రంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నాడు. వివిధ రకాలైన వ్యాపారులను వారి వ్యాపారాభివృద్ధి కోసం తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామంటూ ఆన్‌లైన్ వేదికగా ప్రచారం చేశాడు.
నగరానికి చెందిన ఓ వ్యాపారి (39) ఆన్‌లైన్‌లో వచ్చిన ఈ ప్రకటన చూసి ఆకర్షితుడయ్యాడు. తనకు రుణం కావాలంటూ ఆ ప్రకటనలో పొందపరచగా...అది చూసిన నాగరాజు 2023 జూన్‌లో సదరు వ్యాపారిని సంప్రదించాడు. వ్యాపారి పూర్వాపరాలు, రుణం అవసరాలను తెలుసుకున్న నాగరాజు భారీ మొత్తం తక్కువ వడ్డీకి ఇవ్వడానికి అంగీకరించాడు. ఆపై వివిధ రకాలైన రుసుముల పేరు చెప్పి ఆ ఏడాది నవంబర్ నుంచి దశల వారీగా రూ. కోటీ 55 లక్షలు స్వాహా చేశాడు.
అప్పటి నుంచి త్వరలో రుణం మంజూరై ఖాతాలో పడుతుందంటూ నమ్మబలుకుతున్నాడు. ఎట్టకేలకు మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ కె.సతీష్ రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితుడిని అరెస్టు చేసింది. ఇతడు ఇలాంటి నేరాలు ఇంకా ఏవైనా చేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది.