
గుర్తించని సూక్ష్మజీవులు వేల రకాలు
మన శరీరంలో ఎన్ని రకాల బ్యాక్టీరియా ఉందో మీకు తెలుసా? కొంచెం కష్టమే.
మన శరీరంలో ఎన్ని రకాల బ్యాక్టీరియా ఉందో మీకు తెలుసా? కొంచెం కష్టమే. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త రకాల బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొందరు ఇతర విశ్వవిద్యాలయాలతో కలసి తాజాగా కొన్ని వేల రకాల కొత్త బ్యాక్టీరియాను గుర్తించారు. హ్యూమన్ మైక్రో బయోమ్ ప్రాజెక్టులో భాగంగా జరిగిన ఈ పరిశోధనలో కడుపు, చర్మం, నోరు, జననేం ద్రియాల్లో ఉండే బ్యాక్టీరి యాను గుర్తించారు.
వీటితోపాటు కొన్ని రకాల వైరస్, శిలీంధ్రాలు కూడా ఇప్పటివరకూ మన దృష్టికి రాలేదని తెలిసింది. శరీరంలోని సూక్ష్మజీవుల కు.. మనకు వచ్చే వ్యాధులకూ సంబంధం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 265 మంది నుంచి సేకరించిన 1,631 నమూనాలను పరిశీలించడంతో పాటు కాలంతో పాటు వీటిలో వస్తున్న మార్పులనూ అర్థం చేసుకునేందుకు ప్రయత్నం జరిగింది.
మానవ జన్యుక్రమం గురించి తెలిసినా.. అది ఇప్పటివరకూ కొత్త మందుల తయారీకి, చికిత్సకుగానీ పెద్దగా ఉపయోగపడింది లేదని.. శరీరంలోని సూక్ష్మజీవావ రణం గురించి అర్థం చేసుకోగలిగితే ఈ పరిస్థితిలో మార్పు వచ్చేందుకు అవకాశముందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కుర్టిస్ హుట్టన్‌హోవర్ అంటున్నారు. కేన్సర్ చికిత్సలో వాడే కీమోథెరపీ మందులను కొన్ని బ్యాక్టీరియా జీర్ణం చేసుకుంటున్నట్లు.. ఫలితంగా కీమోథెరపీ ద్వారా వచ్చే ప్రయోజనం తగ్గుతున్నట్లు ఇటీవలే కొందరు శాస్త్రవేత్తలు గుర్తించారు.