కేజీ బరువు తగ్గితే రూ.969 బహుమానం! | Sakshi
Sakshi News home page

కేజీ బరువు తగ్గితే రూ.969 బహుమానం!

Published Sun, May 21 2017 1:50 AM

కేజీ బరువు తగ్గితే రూ.969 బహుమానం! - Sakshi

వాంగ్‌ క్సేబో.. చైనాలోని క్జియన్‌ నగరంలో ఇన్వెస్టింగ్‌ కన్సల్టింగ్‌ కంపెనీకి యజమాని. ఇటీవల కాలంలో వాంగ్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాడు. అతని కంపెనీ విపరీతమైన లాభాల్లోకి రావడంతో వాంగ్‌ ఫేమస్‌ అయిపోలేదు.. తన కంపెనీలో అమలు చేసిన ఒక కార్యక్రమం వల్ల వార్తల్లో నిలిచాడు. ఇంతకీ అతను చేసిన ఆ కార్యక్రమం ఏంటంటే ఎవరైతే బరువు తగ్గుతారో వారికి నగదును బహూకరించడం. ప్రతి ఒక కేజీ బరువు తగ్గినందుకు గాను 15 డాలర్లు (సుమారు రూ. 969) ఇస్తానని వాంగ్‌ తన ఉద్యోగులకు ప్రకటించాడు.

డ్యూటీకి రాగానే డెస్క్‌ నుంచి ఎవరూ ఎక్కువగా కదలకుండా అలాగే పనిచేస్తున్నారని, అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంలోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నారని తద్వారా వాళ్లంతా ఊబకాయులుగా మారిపోతున్నారని ఆయన ఈ పనికి పూనుకొన్నాడు. ఈ బరువు తగ్గించే కార్యక్రమం వల్ల చక్కని సంస్కృతిని అభివృద్ధి చేయడంతో పాటు ఉద్యోగుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించవచ్చని వాంగ్‌ తెలిపాడు. మార్చిలో ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఇప్పటికే సగానికి పైగా ఉద్యోగులు బరువు తగ్గారు. కొవ్వు పదార్థాలను తినడం మానేసి, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం ప్రారంభించారు.

మరికొందరైతే ఎక్కువ డబ్బులు పొందాలని జిమ్‌కు సైతం వెళుతున్నారు. జోవై అనే మహిళా ఉద్యోగి గత రెండు నెలల్లో 20 కేజీలు తగ్గిందంటే వారు దాన్ని ఎంత సీరియస్‌గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఇప్పటివరకు 300 డాలర్లను గెలుపొందింది. తాను రోజూ జిమ్‌కు  వెళ్లడంతోపాటు చక్కని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Advertisement
Advertisement