భేటీ వెనుక ఆ ఇద్దరు...!

Role Of Indian Discent Ministers behind the Success Of Summit - Sakshi

‘శిఖరాగ్రం’ విజయం  వెనక భారత సంతతి మంత్రుల పాత్ర..

డొనాల్డ్‌ ట్రంప్, కిమ్‌ జోంగ్‌–ఉన్‌ శిఖరాగ్ర సమావేశం విజయం సాధించడం వెనక  భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తుల కృషి దాగి ఉంది. వారే సింగపూర్‌ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్, న్యాయ, హోం వ్యవహారాల శాఖ మంత్రి కె. షణ్ముగం. వీరద్దరూ కూడా అధికార ‘పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ’కి చెందినవారు. సింగపూర్‌లో ఈ భేటీ నిర్వహణకు నిర్ణయించింది మొదలు రెండుదేశాల అధినేతలు అక్కడకు చేరుకుని అందులో పాల్గొనే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ చారిత్రక సమావేశానికి ఏ రూపంలోనూ ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా  ఉండేందుకు బాలకృష్ణన్‌ ఇటీవలి  వాషింగ్టన్, ప్యాంగ్‌యాంగ్, బీజింగ్‌లలో పర్యటించి  మంత్రాంగం నెరిపారు. వైద్యవిద్యను అభ్యసించిన ఆయన నేత్రవైద్యంలో పీజీ చేశారు. శిఖరాగ్ర సమావేశం పాల్గొనేందుకు వచ్చిన ఉత్తరకొరియా నేత కిమ్‌కు విమానాశ్రయంలో బాలకృష్ణన్‌ స్వాగతం పలికారు. 70 ఏళ్ల అనుమానాలు, యుద్ధాలు, దౌత్య వైఫల్యాల నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోందని, అయితే దశాబ్దాల ఉద్రిక్తతలు ఒకే ఒక  భేటీతో దూరమయ్యే అవకాశాలు లేవని ఆయన పేర్కొన్నారు.  అయితే ఈ దేశాధినేతలు, వారి సిబ్బందిని వివిధ సందర్భాల్లో కలుసుకున్నపుడు మాత్రం ఈ సమావేశం పట్ల ఎంతో విశ్వాసంతో, ఆశాభావంతో ఉన్నారని వెల్లడించారు. 

శిఖరాగ్ర సభాస్థలి, పరిసరాలు, దీనితో ముడిపడిన వేదికలు, ప్రాంతాల భద్రతా ఏర్పాట్లకు షణ్ముగం బాధ్యత వహించారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడై, న్యాయవాదిగానూ పనిచేసిన ఈయన ఇరువురు దేశాధినేతలు, వారి సిబ్బంది భద్రత, రక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ భేటీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసేందుకు తమ అధికారులు అహోరాత్రులు శ్రమించినట్టు షణ్ముగం తెలిపారు. రక్షణ చర్యల్లో భాగంగా  ఐదువేల మంది హోంటీమ్‌ ఆఫీసర్లు వివిధ రూపాల్లో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. అటు అమెరికాతో, ఇటు ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలు కలిగిన కొన్ని దేశాల్లో  సింగపూర్‌ కూడా ఒకటి కావడం వల్లే ఆ దేశ మంత్రులుగా వీరిద్దరూ కీలక భూమికను నిర్వహించగలిగారని నిపుణులు చెబుతున్నారు. –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

కొరియాతో శాంతి చర్చలు ఏ ఫెయిల్యూర్‌ స్టోరీ 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top