
బరువు తగ్గేందుకు చాలామంది చాలా ప్రయత్నాలే చేసుంటారు.. చేస్తూనే ఉంటారు. అయితే అలాంటి కసరత్తులు లేకుండానే బరువు తగ్గొచ్చని చెబుతున్నారు నార్వేలోని వెస్ట్‌ఫోల్డ్ హాస్పిటల్ ట్రస్ట్‌కు చెందిన శాస్త్రవేత్తలు. కొద్దికాలం పాటు ప్రోబయోటిక్స్ (మేలు చేసే బ్యాక్టీరియాతో కూడిన ఆహార, పానీయాలు)ను తీసుకోవడం ద్వారా బరువు, బాడీమాస్ ఇండెక్స్‌ను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
ఇప్పటికే జరిగిన దాదాపు 16 అధ్యయనాలకు సంబంధించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చామని హెడీ బోర్‌గెరాస్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. 3 వారాల నుంచి 12 వారాల పాటు ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా శరీర బరువు తగ్గినట్లు గుర్తించారు.
అయితే ఈ మార్పు కొంచెం తక్కువగానే ఉన్నా మరిన్ని విస్తృత స్థాయి పరిశోధనల ద్వారా ప్రోబయోటిక్స్ ప్రభావాన్ని స్పష్టంగా అంచనా వేయగలమని అంటున్నారు. ఇంకో విషయమేంటంటే పెరుగు.. ఊరగాయలు కూడా ప్రోబయోటిక్సే. తగిన మోతాదులో తింటే వీటి ద్వారా బరువు తగ్గొచ్చన్న మాట.