ముమ్మాటికీ రిగ్గింగే..! పీఈసీపై సంచలన ఆరోపణలు

PMLN Rejects The Elections Result Says Shahbaz Nawaz Sharif - Sakshi

ఇస్లామాబాద్‌: తీవ్ర ఉద్రిక్తలు, ఘర్షణల మధ్య ముగిసిన పాకిస్తాన్‌ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనని ఓవైపు పాకిస్తాన్‌తో సహా పొరుగుదేశం భారత్‌ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఇమ్రాన్‌ఖాన్‌ ‘పాకిస్తాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌’ (పీటీఐఈ) మినహా మిగతా పార్టీలన్నీ ఎన్నికల్లో భారీయెత్తున రిగ్గింగ్‌ జరిగిందని పాకిస్తాన్‌ ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఒప్పుకోబోమని తేల్చి చెప్తున్నాయి.

రిగ్గింగ్‌.. రిగ్గింగ్‌..!!
నవాజ్‌ షరీఫ్‌ జైలుపాలు కావడంతో అతని తమ్ముడు షాబాజ్‌ఖాన్‌ ‘పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌’ (పీఎంఎల్‌-ఎన్‌) అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఘన విజయం సాధించి పీఎంఎల్‌-ఎన్‌ను అధికారంలోకి తేవడమే కాకుండా జైలుపాలైన నవాజ్‌ షరీఫ్‌కు ఊరట కలిగిద్దామనుకున్న షాబాజ్‌ ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన బుధవారం రాత్రి లాహోర్‌లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్‌ పీటీఐ పార్టీ మెరుగైన స్థానంలో ఉండడానికి కారణం రిగ్గింగేనని చెప్తున్నారు. నిస్సిగ్గుగా ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడి అధికారంలోకి వచ్చే పీటీఐతో దేశం మరో ముప్పయ్యేళ్లు వెనక్కి పయనిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏజెంట్లు లేకుండా ఎలా..!
పోలీంగ్‌ బూత్‌ల నుంచి తమ పార్టీ ఏజెంట్లు బలవంతంగా బయటకు గెంటేశారని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) మండిపడింది. ఓట్ల లెక్కింపులో సైతం అక్రమాలు చోటుచేసుకున్నాయని అనుమానాలు వ్యక్తం చేసింది. చిన్నాచితకా పార్టీలు కూడా ఎన్నికల ఫలితాలు నమ్మేట్టుగా లేవని అంటున్నాయి. అయితే, ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందనే ఆరోపణలపై ఎలక్షన్‌ కమిషన్‌ స్పందించింది. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని పేర్కొంది. మరోవైపు 111 పైగా స్థానాల్లో మంచి ఆధిక్యంలో నిలిచిన పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ పగ్గాలు చేపట్టడం ఖాయమని ఇప్పటివరకు వెలువడిన ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top