సయీద్‌ను విడుదల చేయండి

Pakistan court orders release of Hafiz Saeed from house arrest - Sakshi

పాక్‌ ప్రభుత్వానికి జేఆర్‌బీ ఆదేశం

లాహోర్‌: 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ను గృహ నిర్బంధం నుంచి విడుదల చేయాలని పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన జ్యుడీషియల్‌ రివ్యూ బోర్డు (జేఆర్‌బీ) పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సయీద్‌పై మరే కేసు లేనందున ఆయన నిర్బంధాన్ని మరో 3 నెలలు పొడిగించడం కుదరదని జస్టిస్‌ అబ్దుల్‌ సమీ ఖాన్‌ నేతృత్వంలోని బోర్డు తేల్చిచెప్పింది. సయీద్‌ విడుదలైతే దేశంపై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి వస్తుందని పాక్‌ హోం, ఆర్థిక, న్యాయ శాఖలు చేసిన విజ్ఞప్తులను తిరస్కరించింది.

దీంతో ఈ ఏడాది జనవరి నుంచి గృహ నిర్బంధంలో ఉన్న సయీద్‌ గురువారం విడుదల కానున్నారు. సయీద్‌ తలపై అమెరికా 10 మిలియన్‌ డాలర్ల బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. బోర్డు తీర్పు అనంతరం సయీద్‌ స్పందిస్తూ.. ‘తాజా తీర్పుతో పాకిస్తాన్‌ స్వతంత్ర దేశంగా నిరూపితం కావడంతో ఈ రోజు భారత్‌ తీవ్ర అవమానానికి గురైంది. ఇండియా నన్ను ఏమీ చేయలేదు. కశ్మీర్‌కు అతి త్వరలోనే స్వాతంత్య్రం సిద్ధిస్తుంది’ అని తెలిపారు.

పాక్‌ కపటబుద్ధికి సాక్ష్యమిదే: భారత్‌
తీర్పుపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదంపై పోరాడుతున్నట్లు అంతర్జాతీయ సమాజాన్ని పాక్‌ తప్పుదోవ పట్టిస్తోందనటానికి తాజా ఘటనే నిదర్శనమంది. ఉగ్ర పోరాటంలో పాక్‌ ద్వంద్వ ప్రమాణాలను ఇది తేటతెల్లం చేస్తోందని పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top