విమాన ప్రమాదంలో నేతాజీ మృతి | Sakshi
Sakshi News home page

విమాన ప్రమాదంలో నేతాజీ మృతి

Published Fri, Sep 2 2016 2:50 AM

విమాన ప్రమాదంలో నేతాజీ మృతి

వెలుగులోకి 60 ఏళ్ల నాటి జపాన్ ప్రభుత్వ నివేదిక

 లండన్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై 60 ఏళ్ల క్రితం నాటి జపాన్ ప్రభుత్వ విచారణ నివేదిక శుక్రవారం వెలుగుచూసింది. ఆగస్టు 18, 1945న తైవాన్ విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని ఆ రహస్య పత్రాల్లో పేర్కొన్నారు. నేతాజీ మరణ కారణాల్ని ఆధార సహితంగా తెలుసుకునేందుకు ఏర్పాటైన బ్రిటన్ వెబ్‌సైట్ Bosefiles.info ఈ వివరాల్ని బయటపెట్టింది. 1956లో ఈ నివేదికను టోక్యోలోని భారత రాయబార కార్యాలయానికి సమర్పించారని తెలిపింది. తైవాన్‌లో విమాన ప్రమాదానికి గురైన నేతాజీ... తైపీ ఆస్పత్రిలో అదే రోజు సాయంత్రం మరణించారని వెల్లడించింది.

‘విమానం 20 మీటర్ల ఎత్తుకు ఎగరగానే ఎడమవైపు రెక్కలోని పెటల్ విరగడంతో ఇంజిన్ ఆగిపోయింది. దాంతో విమానం అదుపుతప్పి ... కింద ఉన్న కంకర రాళ్లపై పడింది.  క్షణాల్లో మంటల్లో చిక్కుకుంది. మంటలు అంటుకోవడంతో బోస్ కిందకు దూకేశారు.  కల్నల్ రెహమాన్, ఇతర ప్రయాణికులు నేతాజీ బట్టలు తీసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆయన శరీరం తీవ్రంగా కాలిపోయింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాన్‌మన్ బ్రాంచ్ ఆఫ్ తైపీ ఆర్మీ ఆస్పత్రిలో చేర్చగా... రాత్రి 7 గంటల సమయంలో మరణించారు. ఆగస్టు 22న తైపీ మున్సిపల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు’ అని విచారణ నివేదికలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement