జీవిత ఖైదును సవాల్‌ చేసిన చచ్చి, బతికిన ఖైదీ

Life Sentence Not finished until Death Is Permanent Court Clears To Prisoner - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇదో చిత్రమైన కేసు. చచ్చి, బతికిన ఓ ఖైదీ దాఖలు చేసిన పిటిషన్‌తో యావత్‌ దేశం దృష్టికి వచ్చిన కేసు. తనకు విధించిన యావజ్జీవ శిక్ష తన చావుతోనే ముగిసిందని, తనను తక్షణమే విడుదల చేయాలంటూ ఖైదీ వాదించిన కేసు. ఈ వాదనతోటి కోర్టు అంగీకరిస్తుందా, లేదా? అంటూ తీర్పు కోసం దేశ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూసిన కేసు.....చివరకు ఏమైందీ?

 అమెరికా, అయోవా రాష్ట్రంలోని పెనిటెన్చరీ జైలులో హత్యానేరం కింద యావజ్జీవ కారాగారా శిక్ష అనుభవిస్తున్న బెంజామిన్‌ శ్రైబర్‌ ఓ రోజు హఠాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. జైలు అధికారులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన ఆస్పత్రి అధికారులు పెదవి విరిచారు. ‘లాభం లేదు, చనిపోయాడు’ అన్నారు. అంతలోనే ఖైదీ గుండె కొట్టుకోవడం గమనించారు. వైద్య చికిత్సల కోసం అతడిని ఆపరేషన్‌ థియేటర్‌లోకి తరలించారు. తనకు ‘పునర్జీవ చికిత్స’లు చేయరాదంటూ అంతకు కొన్నేళ్ల ముందే బెంజామిన్‌ ఓ పత్రం మీద సంతకం చేసి ఉన్నారు. బతికే అవకాశం లేదనుకున్న రోగులకు నరాల్లోకి కొన్ని రకాల రసాయనాలను పంపించడాన్ని ‘పునర్జీవ చికిత్స’లుగా వ్యవహరిస్తారు. 
బెంజామిన్‌ అపస్మారక స్థితిలోనే ఉండడంతో టెక్సాస్‌లో ఉన్న అతని సోదరుడిని పిలిపించి రోగి పరిస్థితిని వివరించారు. కిడ్నీ నిండా రాళ్లు పేరుకు పోయాయని, పునర్జీవ చికిత్స ద్వారా ఆయన్ని స్ప్రహలోకి వస్తే ఆపరేషన్‌ చేయవచ్చని చెప్పారు. ‘బెంజామిన్‌కు ఏమైనా బాధ కలుగుతుంటే అందుకు మందులివ్వండి. 

లేదంటే అలాగే వదిలేయండి’ అని చెప్పడాన్ని అనుమతిగా తీసుకున్న వైద్యులు అన్ని చికిత్సలు చేసి బెంజామిన్‌ను బతికించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయగానే బెంజామిన్‌ జైలు అధికారులు తిరిగి జైలుకు తీసుకెళ్లారు. 1997లో ఓ దారుణ హత్య కేసులో బెంజామిన్‌కు ఒక్క రోజు పెరోల్‌ కూడా దొరకని యావజ్జీవ కారగార శిక్ష పడింది. 2015, మార్చి నెలలో అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆస్పత్రి పాలయ్యారు.

తిరిగి జైలుకొచ్చాక తాను చావుదాకా వెళ్లి తిరిగి వచ్చినట్లు బెంజామిన్‌కు తెల్సింది. 2018, ఏప్రిల్‌ నెలలో జిల్లా కోర్టులో బెంజామిన్‌ ఓ చిత్రమైన పిటిషన్‌ను దాఖలు చేశారు. తనకు విధించిందీ యావజ్జీవ కారాగార శిక్ష కనుక, తన చావుతో అది ముగుస్తుందని, తాను ఆస్పత్రిలో చనిపోయినప్పుడే అది ముగిసిపోయిందని, అనవసరంగా నాలుగేళ్లు అదనంగా తనను జైలులో ఉంచారంటూ కేసు వాదించారు. అందుకు సంబంధించి ఆస్పత్రి రికార్డుల కాపీలను కూడా సమర్పించారు. వాదోపవాదాలు విన్న తర్వాత కేసులో జీవం లేదని, అస్సలు పరిశీలనార్హం కూడా కాదంటూ జిల్లా జడ్జీ తీర్పు చెప్పారు. దాంతో తీర్పును సవాల్‌ చేస్తూ బెంజామిన్‌ న్యాయవాది అయోవాలోని అప్పీళ్ల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మొన్న బుధవారం నాడు అప్పీళ్ల కోర్టు తీర్పు చెప్పింది. 

‘యావజ్జీవ కారాగార శిక్ష అంటే డాక్టరిచ్చే డెత్‌ సర్టిఫికెట్‌తో ముగిసేది కాదు. బతికున్నంత కాలం జైలులో ఉంచడమే యావజ్జీవ కారాగార శిక్ష. పైగా నీవు బతికి లేకుంటే కోర్టుకు ఎలా వచ్చావు?’అంటూ జడ్జీ అమంద పాటర్‌ఫీల్డ్‌ కేసును కొట్టివేశారు. ‘పునరుజ్జీవ చికిత్స’ వద్దంటూ తన క్లైంట్‌ సంతకం చేశాక ఎలా చేస్తారని, అందుకు నష్ట పరిహారం చెల్లించాలంటూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ గురించి బెంజామిన్‌ న్యాయవాది ప్రశ్నించగా, జిల్లా కోర్టు ఆ అంశాన్ని ప్రస్తావించలేదు కనుక, తాము పరిగణలోకి తీసుకోలేదని జడ్జీ స్పష్టం చేశారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top