ఉందిలే మంచి కాలం

Green card Bill that favours Indian techies may get green signal  - Sakshi

గ్రీన్‌కార్డు కోటా బిల్లుకు అమెరికా గ్రీన్‌ సిగ్నల్‌

అమెరికాలోని భారతీయుల్లో హర్షాతిరేకాలు

అమెరికాలో శాశ్వత నివాసం కోసం కలలు కంటూ ఉద్యోగాల ఆధారిత గ్రీన్‌ కార్డు కోసం దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులకు ఇది శుభవార్త. గ్రీన్‌కార్డులను ఒక్కో దేశానికి గరిష్టంగా ఏడు శాతం మాత్రమే మంజూరు చేయాలన్న కోటా పరిమితిని ఎత్తివేసే బిల్లుకి అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ‘ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హై స్కిల్డ్‌ ఇమిగ్రెంట్స్‌ యాక్ట్‌ ఆఫ్‌ 2019 (హెచ్‌ఆర్‌ 1044)’ బిల్లుకు సభలో అనూహ్యమైన మద్దతు లభించింది. మొత్తం 435 మంది సభ్యులకుగాను 365 మంది అనుకూలంగా ఓటు వేస్తే, 65 మంది వ్యతిరేకించారు.

జోలాఫ్రెన్, కెన్‌బర్గ్‌లు గత ఫిబ్రవరిలో ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ద్వారా కుటుంబాల ప్రాతిపదికన వలస వీసా కోటాను ఏడు నుంచి 15శాతానికి పెంచడంతో వలసదారులకు భారీగా ఊరట లభిస్తోంది.  సెనేట్‌లోనూ ఈ బిల్లుకి ఆమోద ముద్ర పడాల్సి ఉంది. గ్రీన్‌ కార్డు బిల్లు కాంగ్రెస్‌ ఆమోదం పొందితే భారత్‌ వంటి దేశాల నుంచి తక్కువ వేతనాలకే నిపుణులైన ఉద్యోగుల్ని అమెరికా కంపెనీలు నియమిస్తాయని, దీని వల్ల అమెరికాలో మధ్యతరగతికి ఎక్కువగా నష్టం జరుగుతుందని బిల్లును వ్యతిరేకిస్తున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మనోళ్లకే భారీగా ప్రయోజనం
గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో భారతీయులే 6 లక్షల మందికి పైగా నిరీక్షణ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న వలస విధానమే కొనసాగితే ఇండియా వంటి అధిక జనాభా కలిగిన దేశాల వారు గ్రీన్‌ కార్డు కోసం 151 ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తుందని క్యాటో ఇనిస్టిట్యూట్‌ వంటి సంస్థలు అంచనా వేశాయి.   అధికంగా గ్రీన్‌కార్డు లభించిన దేశాల్లో చైనా ముందుంది. బిల్లు చట్టంగా మారితే  3 లక్షల మంది భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది. దరఖాస్తు చేసుకున్న భారతీయుల్లో ఇప్పటివరకు ప్రతిఏటా 25శాతం మందికే గ్రీన్‌కార్డులు మంజూరవుతూ వచ్చాయి.

ఓ భార్య కల ఫలించిన వేళ
రెండేళ్ల క్రితం అమెరికాలోని కన్సాస్‌లో జాతి వివక్షకు బలైపోయిన తెలంగాణ టెక్కీ కూచిభట్ల శ్రీనివాస్‌ భార్య సునయన గ్రీన్‌కార్డు బిల్లుకి గట్టిగా మద్దతు కూడగట్టడంలో విజయం సాధించారు. 2017 ఫిబ్రవరిలో కన్సాస్‌ రెస్టారెంట్‌లో శ్రీనివాస్‌ను కొందరు దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. భర్త మరణించాక కూడా అమెరికాలోనే ఉండాలనుకున్న సునయన దూమల ఎన్నో కష్టనష్టాలు అనుభవించారు. తాత్కాలిక వీసా మీదే ఆమె ఇన్నాళ్లూ అమెరికాలో ఉంటూ పనిచేస్తున్నారు. ఈ వీసాల కోసం కంపెనీ యాజమాన్యాల దయాదాక్షిణ్యాల మీదే భారతీయులు ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో గ్రీన్‌కార్డు బిల్లు చట్టరూపం దాల్చడానికి సునయన తన వంతు ప్రయత్నాలు చేశారు. పలుమార్లు వాషింగ్టన్‌ వెళ్లి న్యాయ నిపుణులతో, ప్రవాస భారతీయ సంఘాలతో సంప్రదింపులు జరిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top