రాజధాని ఆదాయంపై ఆధారపడని దేశం | germany not depend on europe capital for development | Sakshi
Sakshi News home page

రాజధాని ఆదాయంపై ఆధారపడని దేశం

Oct 3 2016 7:02 PM | Updated on Sep 4 2017 4:02 PM

రాజధాని ఆదాయంపై ఆధారపడని దేశం

రాజధాని ఆదాయంపై ఆధారపడని దేశం

యూరప్‌లో రాజధాని నగరం ఆదాయంపై ఆధారపడకుండా ఆర్థికంగా ఎంతో మనగలుగుతున్న ఏకైక దేశం జర్మనీ.

బెర్లిన్‌: ప్రపంచంలో ఎక్కువ దేశాలు, ముఖ్యంగా యూరప్‌ దేశాలు స్థూల జాతీయ ఆదాయానికి ఎక్కువగా రాజధాని నగరాలపైనే ఆధారపడతాయి. రాజధాని నగరం నుంచి సమకూరే ఆదాయాన్ని తొలగిస్తే వాటి జాతీయ స్థూల ఉత్పత్తి శాతం గణనీయంగా పడిపోతుంది. యూరప్‌లో రాజధాని నగరం ఆదాయంపై ఆధారపడకుండా ఆర్థికంగా ఎంతో మనగలుగుతున్న ఏకైక దేశం జర్మనీ. దాని జాతీయ స్థూలాదాయంలో రాజధాని నుంచి తలసరి ఆదాయం 0.2 శాతం కూడా మించదు. 
 
తూర్పు జర్మనీలో కమ్యూనిస్టు ప్రభుత్వం పడిపోయిన కారణంగా 1989లో బెర్లిన్‌ గోడను పడగొట్టిన విషయం తెల్సిందే. దీనివల్ల ధనిక ప్రాంతమైన పశ్చిమ బెర్లిన్, పేద ప్రాంతమైన తూర్పు బెర్లిన్‌ను కలసిపోయాయి. ఈ పర్యవసానం వల్ల బెర్లిన్‌ ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. నగరంలోని రెండు ప్రాంతాలు కలసిపోవడం వల్ల నిరుద్యోగ సమస్య తీవ్రమైంది. జాతీయ నిరుద్యోగం సగటుకన్నా బెర్లిన్‌లోనే ఎక్కువ. నగరాన్ని అభివద్థి చేయడం కోసం జర్మనీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకన్నా రాజధాని నగరానికి ఎక్కువ నిధులను, ఎక్కువ సబ్సిడీలను ఇవ్వాల్సి వచ్చింది. 
 
బెర్లిన్‌ ప్రధాన పర్యాటక కేంద్రంగా వాసికెక్కినా దేశ వాణిజ్య నగరంగా ఫ్రాంక్‌ఫర్ట్‌ కొనసాగుతోంది. జర్మనీ పారిశ్రామిక దిగ్గజ సంస్థలు ఒక్క చోట కేంద్రీకతం కాకుండా పలు నగరాలకు విస్తరించి ఉన్నాయి. బీఎండబ్యూ, సీమన్స్‌ లాంటి భారీ పరిశ్రమల ప్రధాన కార్యాలయాలు బవారియా నగరంలో ఉన్నాయి. రాజధాని నగరం లండన్‌ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే బ్రిటన్‌లో తలసరి ఆదాయం 11శాతం, పారిస్‌ లేకపోతే ఫ్రాన్స్‌ ఆదాయం 15 శాతం, ఎథెన్స్‌ లేకపోతే గ్రీస్‌ తలసరి ఆదాయం 20 శాతం పడిపోతుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement