నీరవ్‌ లండన్‌లో తేలాడు

Fugitive Nirav Modi tracked down in London - Sakshi

విలాసవంతమైన భవనంలో నివాసం

దానికి సమీపంలోనే నగల దుకాణం తెరిచిన వైనం

వెలుగులోకి తెచ్చిన ‘ది డైలీ టెలిగ్రాఫ్‌’

త్వరలో ఆయన అరెస్ట్‌కు వారెంట్‌ జారీ

తరువాత వేగం పుంజుకోనున్న అప్పగింత ప్రక్రియ

లండన్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, ఆభరణాల వ్యాపారి నీరవ్‌ మోదీ(48) లండన్‌ వీధుల్లో ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడి ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న మోదీ కొత్తగా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించినట్లు ‘ది డైలీ టెలీగ్రాఫ్‌’ పత్రిక శనివారం వెలుగులోకి తెచ్చింది. నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగిచేందుకు ఇక్కడి వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో వారెంట్‌ జారీ ప్రక్రియ ప్రారంభమైందని సంబంధిత అధికారులు చెప్పారు. త్వరలోనే మోదీపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయ్యే అవకాశాలున్నాయని, దీంతో అప్పగింత ప్రక్రియలో ముందడుగు పడుతుందని భారత అధికారులు తెలిపారు.

మరోవైపు, నీరవ్‌ మోదీని అప్పగించాలని కోరుతూ భారత్‌ దాఖలుచేసిన విజ్ఞప్తిని యూకే హోం శాఖ కార్యదర్శి సాజిద్‌ జావీద్‌ ధ్రువీకరించారు. భారత్‌ గత ఆగస్టులోనే ఈ మేరకు దరఖాస్తు చేసింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి మోసపూరితంగా రూ.13,500 కోట్ల రుణాలు పొందిన కుంభకోణంలో నీరవ్‌ మోదీతో పాటు అతని మేనమామ మెహుల్‌ చోక్సీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ మోసం వివరాలు బహిర్గతం కాకముందే 2018, జనవరిలో ఈ ఇద్దరు దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. నీరవ్‌ మోదీని భారత్‌ తీసుకొచ్చి విచారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ వెల్లడించింది. నీరవ్‌ మోదీ లాంటి వాళ్ల కోసం మోదీ సర్కారు ‘మోసగాళ్ల సెటిల్‌మెంట్‌ యోజన’ అనే పథకాన్ని నడుపుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది.

నో కామెంట్‌..ప్లీజ్‌
మహారాష్ట్రలోని కిహిమ్‌ బీచ్‌లో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నీరవ్‌ మోదీ భారీ సౌధాన్ని అధికారులు కూల్చివేసిన మరుసటి రోజే ఆయన జాడ అధికారికంగా తెలియడం గమనార్హం. రోడ్డుపై మోదీకి తారసపడిన విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించారు. బ్రిటన్‌లో రాజకీయ శరణార్థి కోసం దరఖాస్తు చేసుకున్నారా? భారత్‌ చేస్తున్న ఆరోపణలపై స్పందనేంటి? లాంటి ప్రశ్నలకు ‘నో కామెంట్‌’ అని మాత్రమే ఆయన సమాధానమిచ్చాడు.

మోదీ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసినా, అతని అరెస్ట్‌ కోసం ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీచేసినా..లండన్‌లో తాను నివాసముంటున్న ప్రాంతానికి సమీపంలోనే కొత్తగా వజ్రాల వ్యాపారం ప్రారంభించినట్లు తెలిసింది. నీరవ్‌ మోదీని అప్పగించాలని భారత హైకమిషన్‌ గతేడాది ఆగస్టులోనే విజ్ఞప్తి చేయగా, ఆ ప్రతిపాదన అప్పటి నుంచి యూకే హోం శాఖ పరిశీలనలో ఉంది. మోదీ లండన్‌లోనే ఉన్నట్లు తాజాగా ధ్రువీకరణ కావడంతో యూకే హోం శాఖ స్పందిస్తూ..నిందితులపై అప్పగింత వారెంట్‌ జారీ అయిన తరువాత నేరస్థుల అప్పగింత ప్రక్రియ ముందుకు సాగుతుందని పేర్కొంది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధినేత విజయ్‌ మాల్యా విషయంలోనూ ఇలాగే జరిగింది. నీరవ్‌ మోదీపై అప్పగింత వారెంట్‌ జారీ అయిన తరువాత స్కాట్లాండ్‌ యార్డ్‌ పోలీసులు విచారణ జరపనున్నారు.  

అరెస్ట్‌కు ‘శరణార్థి’ అడ్డంకి?
గతేడాది జూలైలో మోదీకి వ్యతిరేకంగా రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. యూకేలో ఆయన శరణు కోరాడా? లేదా? అన్నది స్పష్టంగా తెలియరాలేదు. ఒకవేళ శరణార్థి హోదా కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్లయితే, అది పరిష్కారమయ్యే వరకు ఆయన్ని అరెస్ట్‌ చేయడం కుదరదు. స్వదేశంలో విచారణ పక్షపాతంగా జరగడం లేదని, వేధింపులకు గురవుతున్నానని, తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని నిరూపించగలిగితే సదరు వ్యక్తికి శరణార్థి హోదా ఇచ్చే అవకాశాలున్నాయని సీనియర్‌ వలసల నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు. గతేడాదే లండన్‌కు పారిపోయి వచ్చిన నీరవ్‌ మోదీ 2018 ఫిబ్రవరిలో భారత అధికారులు ఆయన పాస్‌పోర్టును రద్దు చేశాక కూడా కనీసం నాలుగు సార్లు బ్రిటన్‌ నుంచి విదేశాలకు ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఆయన బ్రిటన్‌లో పనిచేసుకోవడానికి, పెన్షన్‌కి, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌కి అవకాశం కల్పిస్తూ నేషనల్‌ ఇన్సూరెన్స్‌ నంబర్‌ని కూడా పొందినట్లు ది డైలీ టెలీగ్రాఫ్‌ తెలిపింది.

నీరవ్‌ అక్కడున్న సంగతి తెలుసు: భారత్‌
నీరవ్‌ మోదీ లండన్‌లో తలదాచుకున్న సంగతి తెలుసు కాబట్టే ఆయన్ని అప్పగించాలని బ్రిటన్‌ను విజ్ఞప్తి చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఆయన్ని భారత్‌ తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. నీరవ్‌ మోదీని లండన్‌లో గుర్తించినంత మాత్రాన వెంటనే భారత్‌కు తీసుకురాలేమని, ఇందుకోసం అధికారిక ప్రక్రియ ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ తెలిపారు. నీరవ్‌ను అప్పగించాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), సీబీఐ వేర్వేరుగా విన్ననపాలు పంపినట్లు చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్‌ స్పందిస్తూ...బ్యాంకు మోసగాళ్ల కోసం మోదీ ప్రభుత్వం ప్రత్యేక సెటిల్‌మెంట్‌ యోజనా నడుపుతోందని తీవ్రంగా మండిపడింది. బ్యాంకుల నుంచి రూ. లక్ష కోట్లు కొల్లగొట్టి పారిపోయిన బడా పారిశ్రామికవేత్తల్లో ఒక్కరినైనా ఈ ఐదేళ్లలో తీసుకురాలేకపోయారని దుయ్యబట్టింది.

రూ.9 లక్షల కోటు, బుర్ర మీసాలతో
బొద్దుగా, బుర్ర మీసాలతో సుమారు రూ. 9 లక్షల విలువ చేసే ఆస్ట్రిచ్‌ హైడ్‌ కోటు ధరించిన నీరవ్‌ మోదీ లండన్‌ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను ‘ది డైలీ టెలిగ్రాఫ్‌’ విడుదల చేసింది. టాటెన్‌హామ్‌ కోర్టు రోడ్డులో బహుళ అంతస్తుల విలాసవంతమైన ఆకాశహార్మ్యంలోని ఒక ఫ్లోర్‌లో సగభాగాన్ని ఆయన అద్దెకు తీసుకున్నట్లు ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ ఫ్లాట్‌ అద్దె నెలకి రూ.15.48 లక్షలు అని అంచనా. నీరవ్‌ మోదీ ఈ ఫ్లాట్‌కి వంద గజాల దూరంలోనే కొత్తగా వజ్రాలæ వ్యాపారం మొదలుపెట్టినట్లు తెలిసింది. నీరవ్‌ మోదీ తన అపార్ట్‌మెంట్‌ నుంచి సెంటర్‌ పాయింట్‌లో ఉన్న ఈ వజ్రాల వ్యాపార సంస్థ వరకూ తన చిన్న కుక్కపిల్లను వెంటబెట్టుకొని ప్రతిరోజూ వెళుతున్నట్టు ఆ పత్రిక వెల్లడించింది.
నీరవ్‌ మోదీ ప్రస్తుతం లండన్‌లోని ఈ బహుళ అంతస్తుల భవంతిలోని ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నాడు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top