అమెరికాలో నలుగురు తెలుగువారు దుర్మరణం | Four Telugu People Found Dead In Iowa USA | Sakshi
Sakshi News home page

అమెరికాలో నలుగురు తెలుగువారు దుర్మరణం

Jun 17 2019 1:10 AM | Updated on Jun 17 2019 5:09 AM

Four Telugu People Found Dead In Iowa USA - Sakshi

అమెరికా ఐయోవా రాష్ట్రంలోని చంద్రశేఖర్‌ ఇంటి వద్ద పోలీసుల తనిఖీలు 

వెస్ట్‌డెస్‌ మోయిన్స్‌: అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి వెస్ట్‌డెస్‌ మోయిన్స్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తెలుగువారు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మృతుల శరీరంపై తుపాకీ బుల్లెట్ల గాయాలున్నాయి. ఈ విషయమై నగర పోలీస్‌ సార్జంట్‌ డాన్‌ వేడ్‌ మాట్లాడుతూ..‘యాష్‌వర్త్‌ రోడ్డు–అస్పెన్‌ డ్రైవ్‌ల మధ్య ఉన్న 65 స్ట్రీట్‌లోని ఓ ఇంట్లో సమస్య ఉందని శనివారం ఉదయం 10 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) 911కు ఫోన్‌కాల్‌ వచ్చింది. దీంతో మా యూనిట్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఇంట్లో బుల్లెట్‌ గాయాలతో రక్తపు మడుగులో ఉన్న నలుగురి మృతదేహాలను గుర్తించాం. ఈ దుర్ఘటనలో చంద్రశేఖర్‌ సుంకర(44), లావణ్య సుంకర(41)తో పాటు 15, పదేళ్ల వయసున్న ఇద్దరు అబ్బాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. వీరి ఇంటికి వచ్చిన బంధువుల్లో ఒకరు నలుగురి మృతదేహాలను చూడగానే భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం అటుగా వెళుతున్నవారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు’అని తెలిపారు.

రియల్‌ ఎస్టేట్‌ రికార్డుల ప్రకారం లావణ్య–చంద్రశేఖర్‌ ఈ ఇంటిని 2019, మార్చి 25న కొనుగోలు చేశారని వెల్లడించారు. పోస్‌మార్టం తర్వాతే మరణానికి గల కారణాన్ని అధికారికంగా చెప్పగలమన్నారు. ఈ దుర్ఘటనపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. వెస్ట్‌డెస్‌ మోయిన్స్‌లో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయనీ, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. కాగా, ముగ్గురు కుటుంబ సభ్యులను చంద్రశేఖరే కాల్చిచంపాడనీ, అనంతరం తనను తాను కాల్చుకున్నాడని కొందరు స్థానికులు తెలిపారు. ఆయన గతకొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement