భారీ సుంకాలను ఒప్పుకోం

Donald Trump says India is recent tariff hike unacceptable - Sakshi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టీకరణ

ఇండియా భారీగా సుంకాలు విధిస్తోందని ఆగ్రహం

ట్రంప్‌ ఆరోపణలను ఖండించిన భారత సర్కారు

వాషింగ్టన్‌/ఒసాకా: అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. అమెరికా ఉత్పత్తులపై ఇండియా భారీగా దిగుమతి సుంకాలను విధిస్తోందని మండిపడ్డారు. ఇటీవల అమెరికా నుంచి దిగుమతయ్యే  28 ఉత్పత్తులపై భారత్‌ సుంకాలు వడ్డించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని తేల్చి చెప్పారు. నేటి నుంచి రెండ్రోజుల పాటు సాగే జీ20 సదస్సులో పాల్గొనేందుకు జపాన్‌లోని ఒసాకాకు ట్రంప్‌ చేరుకున్నారు. ఈ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో ట్రంప్‌ ప్రత్యేకంగా భేటీ కావాల్సిఉంది.

ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ స్పందిస్తూ..‘భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నిజానికి చాలా ఏళ్ల నుంచి భారత్‌ అమెరికా ఉత్పత్తులపై చాలా భారీస్థాయిలో దిగుమతి సుంకాలను విధిస్తోంది. తాజాగా దాన్ని ఇంకా పెంచింది. దీన్ని ఎంతమాత్రం అంగీకరించబోం. భారత్‌ ఈ సుంకాలను వెంటనే తగ్గించాలి’ అని డిమాండ్‌ చేశారు. ఇటీవల భారత్‌లో పర్యటించిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఇరుదేశాల మధ్య సుంకాల విషయంలో ఏకాభిప్రాయం సాధ్యమేనని చెప్పిన మరుసటిరోజే ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ట్రంప్‌ ఆరోపణలు సరికాదు: భారత్‌
భారత్‌ భారీగా పన్నులు విధిస్తోందన్న ట్రంప్‌ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్‌ విధిస్తున్న సుంకాలు అంత ఎక్కువగా లేవని స్పష్టం చేసింది. ‘అమెరికా ఉత్పత్తులపై మేం విధిస్తున్న సుంకాల కంటే కొన్ని భారతీయ ఉత్పత్తులపై అగ్రరాజ్యం విధిస్తున్న సుంకాలు భారీగా ఉంటున్నాయి’ అని పేర్కొంది.

అసలు గొడవేంటి?
అమెరికాలోని హార్లే–డేవిడ్‌సన్‌ సంస్థకు చెందిన బైక్‌లపై భారత్‌ 100 శాతం పన్ను విధించడాన్ని గతంలో ట్రంప్‌ బాహాటంగానే తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో హార్లేడేవిడ్‌సన్‌ బైక్‌లపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 50 శాతానికి తగ్గించింది. అయినా శాంతించని ట్రంప్‌.. భారత్‌ను ‘సుంకాల రారాజు’గా అభివర్ణించారు. గతేడాది మార్చిలో భారత్‌ నుంచి దిగుమతి అయ్యే స్టీల్‌పై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం టారిఫ్‌ విధించారు. అక్కడితో ఆగకుండా ఇండియాకు గతంలో ఇచ్చిన ప్రాధాన్యత వాణిజ్య హోదా(జీఎస్పీ)ని రద్దుచేశారు. దీంతో ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన భారత్‌.. అమెరికా నుంచి దిగుమతయ్యే బాదం, పప్పుధాన్యాలు, వాల్‌నట్‌ సహా 28 ఉత్పత్తు్తలపై సుంకాలను గణనీయంగా పెంచింది. తాజాగా ఈ వ్యవహారంపైనే ట్రంప్‌ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top