ట్రంప్‌కి రోజూ కోవిడ్‌ పరీక్షలు

Donald Trump personal valet tests positive for COVID-19 - Sakshi

అమెరికా అధ్యక్షుడి వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి కరోనా  

వాషింగ్టన్‌/ఐక్యరాజ్యసమితి/బ్యాంకాక్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి కరోనా వైరస్‌ సోకడంతో వైట్‌హౌస్‌ ఉలిక్కి పడింది. వెంటనే అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌కి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో నెగెటివ్‌ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ట్రంప్‌ ఇకపై రోజూ పరీక్షలు జరపాలని నిర్ణయించుకున్నారు.

కరోనా సోకిన సహాయకుడు ట్రంప్‌కి అత్యంత సన్నిహితంగా వ్యవహరించేవారని, అధ్యక్షుడి భోజన ఏర్పాట్లు, ఆయనకు దుస్తులు అందివ్వడం వంటి పనులు చేసేవారని సీబీఎస్‌ న్యూస్‌ వెల్లడించింది. అయితే ట్రంప్‌ దీనిని తోసిపుచ్చారు. అతనిని తాను చాలా తక్కువసార్లు కలుసుకున్నానని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా తాను, ఉపాధ్యక్షుడు కరోనా పరీక్షలు చేయించుకుంటే నెగెటివ్‌ వచ్చిందని గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇప్పటివరకు వారానికి ఒకసారి కోవిడ్‌ పరీక్ష చేయించుకునే వాడినని, ఇకపై రోజూ చేయించుకుంటానని ట్రంప్‌ చెప్పారు.
భారత సంతతికి చెందిన

వైద్యులైన తండ్రీకూతురు మృతి
అమెరికాలోని న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన వైద్యులైన తండ్రీ కూతుళ్లు కోవిడ్‌–19 బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. సత్యేందర్‌ దేవ్‌ ఖన్నా(78) కొన్ని దశాబ్దాలుగా న్యూజెర్సీలో వివిధ ఆసుపత్రుల్లో సర్జన్‌గా సేవలు అందిస్తున్నారు. ఆయన కుమార్తె ప్రియా ఖన్నా (43) కిడ్నీ సంబంధిత      వ్యాధుల్ని నయం చేసే నిపుణురాలు. ఆమె యూనియన్‌ ఆస్పత్రిలో చీఫ్‌ ఆఫ్‌ రెసిడెంట్‌గా ఉన్నారు. వీరిద్దరికీ ఇటీవల కరోనా వైరస్‌ సోకింది. డాక్టర్‌ సత్యేంద్ర ఖన్నా నాలుగు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న క్లారా     మాస్‌ మెడికల్‌ సెంటర్‌లో కోవిడ్‌కు       చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.   అదే ఆస్పత్రిలోనే సేవలందిస్తున్న ప్రియాఖన్నా కూడా కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరి మృతి అత్యంత బాధాకరమని న్యూజెర్సీ గవర్నర్‌ ఫిల్‌ ముర్ఫీ చెప్పారు. రాష్ట్రం అద్భుతమైన ఇద్దరు వైద్యుల్ని కోల్పోయిందని అన్నారు.  

విదేశీయులపై విద్వేషం వద్దు : యూఎన్‌  
కోవిడ్‌–19 ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో విదేశీయులపై విద్వేషం సునామీలా పెరిగిపోతోందని, దానికి అడ్డుకట్ట వేయడానికి అందరూ కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్టెరస్‌ అన్నారు. అయితే ఆయన ప్రత్యేకంగా ఏ దేశం పేరుని కూడా ప్రస్తావించలేదు. ఆగ్నేయాసియా, తూర్పు ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా   సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో వలసదారులు ఎటూ వెళ్లడానికి లేకుండా ఉన్నారని, వారికి వైరస్‌ సోకే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  

జిన్‌పింగ్‌కు కిమ్‌ ప్రశంస
కరోనా వైరస్‌ను నియంత్రించడంలో విజయం సాధించినందుకుగాను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ప్రశంసించారు. ఈ మేరకు జిన్‌పింగ్‌కు వ్యక్తిగత సందేశాన్ని పంపించారు. కరోనా కారణంగా ఉత్తర కొరియా ఆర్థికంగా సంక్షోభ పరిస్థితులు నెదుర్కొంటోందని దక్షిణ కొరియా మీడియాలో కథనాలు ప్రచురిస్తున్న నేపథ్యంలో కిమ్‌ తన సందేశాన్ని పంపారు.  

14.7 శాతానికి చేరుకున్న నిరుద్యోగం
కోవిడ్‌–19 అగ్రరాజ్యం అమెరికాను ఆర్థికంగా తీవ్రంగా కుంగదీసింది. 2007–2009 మధ్య కాలంలో అమెరికాను కుదిపేసిన ఆర్థిక మాంద్యం తర్వాత ఆ స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోతోంది. గత నెలలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 14.7శాతానికి చేరుకుంది. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే 2.05 కోట్ల    మంది ఉద్యోగాలు కోల్పోయారు.  ఫిబ్రవరి వరకు అమెరికాలో ఉపాధి అవకాశాలు బాగా ఉన్నాయి. నిరుద్యోగం రేటు 50 ఏళ్ల కనిష్టం 3.5 శాతానికి తగ్గింది. వరసగా 113 నెలల పాటు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తూనే ఉండడం కూడా ఒక రికార్డే. ఇక మార్చిలో       నిరుద్యోగం 4.4 శాతంగా ఉంది. అదే ఏప్రిల్‌ వచ్చేసరికి 14.7 శాతానికి ఒక్కసారిగా పెరిగిపోయింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top