ధ్యానంతో మార్పులు అవాస్తవం! | Sakshi
Sakshi News home page

ధ్యానంతో మార్పులు అవాస్తవం!

Published Tue, Feb 6 2018 4:02 AM

Coventry University study on Meditation - Sakshi

లండన్‌: ధ్యానం మనుషుల్లో మార్పు తెస్తుందనే విషయం పూర్తిగా అవాస్తవమని తాజా అధ్యయనంలో తేలింది. ధ్యానం ద్వారా మానవుల్లో సత్ప్రవర్తన వస్తుందనడం కేవలం అపోహ మాత్రమేనని వెల్లడైంది. బ్రిటన్‌లోని కోవెన్ట్రీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. దీనికి గానూ ‘«ధ్యానం వల్ల ప్రశాంతత, కరుణ వంటి భావనలు వస్తాయా, లేదా’అనే అంశంపై గతంలో నిర్వహించిన 20 అధ్యయన ఫలితాలను వారు పరిశీలించారు.

మెడిటేషన్‌ ద్వారా సానుకూల దృక్పథం వస్తుందని తొలుత భావించినా, దీనిలో సిద్ధాంతపరమైన లోపాలు ఉన్నట్లు వారు గుర్తించారు. మెడిటేషన్‌ చేసే బృందాన్ని, చేయని వారిని విడివిడిగా పరిశీలించిన అనంతరం వారు ఈ అంచనాకు వచ్చారు. మెడిటేషన్‌ టీచర్లు నిర్వహించిన అధ్యయనాల్లో ధ్యానం గురించి పాజిటివ్‌గా రాసినట్లు తెలిపారు. మెడిటేషన్‌ చేసేవారు ఎలాంటి పనులు చేయకుండా ఉన్నప్పుడు సానుకూల దృక్పథంతో ప్రేమగా వ్యవహరిస్తున్నారని గుర్తించారు. ఒకవేళ వాళ్లు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు దూకుడు స్వభావం, పక్షపాత వైఖరిని అదుపు చేసుకోలేకపోతున్నట్లు స్పష్టమైందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ధ్యానం ద్వారా ఓ వ్యక్తి స్వభావం, భావనలు ఇతరుల మీద ఎలా ప్రభావం చూపుతాయనే అంశం మీద మరింత అధ్యయనం చేస్తున్నామని వర్సిటీకి చెందిన మిగైల్‌ ఫారిస్‌ తెలిపారు. పరిశోధన వివరాలు సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Advertisement
Advertisement