‘వుహాన్‌’ డైరీలో నమ్మలేని నిజాలు..

Chinese writer Fang Fang Writes About Corona Virus In Wuhan - Sakshi

బీజింగ్‌ : కరోనా వైరస్‌ పురుడుపోసుకున్న చైనాలోని వుహాన్ నగరం గతకొంత కాలంగా పెద్ద ఎ‍త్తున వార్తల్లో నిలిచింది. వైరస్‌ పుట్టక దగ్గర నుంచి లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు అక్కడ ఏం జరిగిందన్న విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వుహాన్‌లో కరోనాను కట్టడి చేయడానికి చైనా ప్రభుత్వం అనుసరించిన విధానాల గురించి తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నించాయి. మరోవైపు అక్కడి కరోనా కేసులను, మరణాల లెక్కలను చైనా ప్రభుత్వం దాచిపెట్టిందనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అయితే చైనా మీడియాపై ఆంక్షలు ఉ‍న్నందున ఏదీ బహిరంగ ప్రపంచానికి తెలియలేదు. ఈ క్రమంలోనే ‘వుహాన్‌’ గురించి ఓ రచయిత ఆన్‌లైన్‌లో రాసిన పలు విషాయాలు తీవ్ర సంచలనంగా మారాయి.

చైనాకు చెందిన ప్రముఖ రచయిత్రి, చైనా సాహిత్య అవార్డు గ్రహీత ఫాంగ్ ఫాంగ్ వుహాన్‌లో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఓ డైరీ రాయడం మొదలుపెట్టారు. ఇందులో అనేక విషయాలను గురించి ఆమె ప్రస్తావించారు. కరోనా వైరస్‌ పుట్టుక, మరణాలు, వైరస్‌ కారణంగా వుహాన్ ప్రజల ఇబ్బందులను ఆమె డైరీలో రాశారు. రోగులకు తగినన్ని హాస్పిటల్స్ లేకపోవడంతో ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారని, దీని కారణంగా చాలామంది మరణించినట్టు ఆమె తన ఈ డైరీలో పేర్కొన్నారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకుతుందని వైద్యులు హెచ్చరించినా, అధికారులు ప్రజలను హెచ్చరించలేదని ఆమె తెలిపారు.

ఇలా వివాదాస్పదమైన ఎన్నో అంశాలను ఆమె తన ఈ డైరీలో రాయడంతో అంతర్జాతీయంగా ఇది సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఈ డైరీని కొలిన్ హర్పర్స్ అనే సంస్థ అనేక భాషల్లో ముద్రించాలని సంకల్పించింది. దీంతో వుహాలో లాక్‌డౌన్‌ సమయంలో ఏం జరిగింది అనే కొన్ని విషయాలు బయటకు రావడంతో చైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే రచయిత ఫాంగ్ ఫాంగ్‌ బెదిరింపులు ఎదుర్కొంటున్నారని తెలిసింది.

కాగా వైరస్‌ తీవ్రత పూర్తిగా తగ్గటంతో వుహాన్‌లో ఇటీవల లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించిన ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top