సంగీత కచేరీ చేస్తూనే పెళ్లి | Sakshi
Sakshi News home page

సంగీత కచేరీ చేస్తూనే పెళ్లి

Published Thu, Mar 17 2016 1:55 PM

సంగీత కచేరీ చేస్తూనే పెళ్లి

అక్షయ్, శ్రీరామ్‌లు పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులు. వారికి సంగీతమంటే పిచ్చి ప్రేమ. ఆ పిచ్చే వారిద్దరినీ కలిపింది. అమెరికాలోని డెట్రాయిట్‌లో ఉంటున్న వారిద్దరి మధ్య ప్రేమ అంకురించడానికి అదే తోడ్పడింది. ప్రత్యేక బ్రాస్ బ్యాండ్‌ను ఏర్పాటుచేసేందుకు ఓ మంచి సింగర్ కోసం వెతుకుతున్న శ్రీరామ్‌కు అక్షయ్ రూపంలో సింగర్ దొరికింది. బ్రాండ్ సంగతి పక్కన పెడితే ఇద్దరి మధ్య ఏదో తెలియరాని ప్రేమానుభూతి కలిగింది. దాంతో ఇద్దరు డేటింగ్ మొదలు పెట్టారు. అభిరుచులు కలిశాయి. మనసులు కలిశాయి. పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు.

తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారిద్దరు సంప్రదాయబద్ధంగానే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే అందులో నూతనత్వం ఉండాలనుకున్నారు. వినూత్నంగా పెళ్లికి ప్లాన్ చేసుకున్నారు. సంప్రదాయబద్ధంగానే బంధుమిత్రులను పెళ్లికి ఆహ్వానించారు. పెళ్లికి హాజరైన బంధుమిత్రులు పెళ్లి పందిరిని చూసి ఆశ్చర్యపడ్డారు. పెళ్లి వేదికపై వారికి ఆర్కెస్ట్రా కనిపించింది. పెళ్లి కొడుకు శ్రీరామ్ సంప్రదాయబద్ధంగా ధోవతి కట్టుకొని, పైనుంచి జాకెట్ ధరించి స్టేజ్‌ మీద డ్రమ్స్ సరిచేస్తూ కనిపించారు.

ఇంతలో అచ్చం పెళ్లికూతురులా ఆకుపచ్చ సిల్క్ చీర కట్టుకొని మెడలో బంగారు నగలు ధరించి స్టేజ్ మీదకు వచ్చింది అక్షయ్. సభికులకు ఆహ్వానం పలికి మైక్ పట్టుకొని పాటందుకుంది. డ్రమ్స్ స్పెషలిస్ట్ అయిన శ్రీరామ్ డ్రమ్స్ వాయిస్తూ ఆర్కెస్ట్రాను లీడ్ చేశారు. ఇదేమిటి పెళ్లి చేసుకోవాల్సిన వధూవరులు ఇలా కచేరీ చేస్తున్నారేమిటంటూ బంధుమిత్రులు కాసేపు ఆశ్చర్యపోయారు. వినసొంపైన సంగీత వాయిద్యాల మధ్య అక్షయ్ మధురగానానికి మైమరిచిపోయిన ఆహూతులు పెళ్లి విషయాన్ని మరచిపోయి సంగీత కచేరీలో లీనమయ్యారు.

పాట వెనుక పాటతో వధూవరులు అలరిస్తుండగా, మంద్రంగా ప్రారంభమైన సంగీతఝరి హోరెత్తిపోయింది. సరిగ్గా ఆ దశలో పెళ్లికూతురు మరో సింగర్‌కు అవకాశం ఇచ్చి లోపలికెళ్లారు. ఎర్రటి పట్టు చీర, నడుముకు వడ్డాణం, మెడపై మరిన్ని నగలతో మళ్లీ స్టేజ్ ఎక్కారు. స్టేజ్ మీది వాయిద్యాలను కాస్త దూరం జరిపారు. పెళ్లి కొడుకు తాను ధరించిన జాకెట్ విప్పేసి పెళ్లి కొడుకు ఆహార్యంలో ముందుకొచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న బ్రాహ్మణుడి మంత్రోచ్ఛారణల మధ్య వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఆర్కెస్ట్రా కొనసాగింది. ఈ ఆర్కెస్ట్రాకు 'దుల్హన్ బ్రాస్ బ్యాండ్' అని పేరు కూడా పెట్టారు. వారం రోజుల క్రితం డెట్రాయిట్‌లో ఈ పెళ్లి జరిగింది.

Advertisement
Advertisement