ప్రాణాలు కాపాడిన ఆపిల్‌ వాచ్‌; ఆశ్చర్యంలో నెటిజన్లు

Apple Watch Saves Biker Life After Detecting Fall - Sakshi

ఆపిల్‌ వాచ్‌  ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాలు.. గాబ్‌ బర్డెట్‌, అతని తండ్రి బైక్‌పై పర్వతారోహణకు వెళ్లారు. చెరో మార్గం గుండా పర్వతాన్ని అధిరోహిస్తుండగా.. తన తండ్రి ప్రమాదంలో ఉన్నట్టు అతని చేతికున్న ఆపిల్‌ వాచ్‌ నుంచి బర్డెట్‌ వాచ్‌కు అలర్ట్‌ వచ్చింది. అంతేగాక అతని తండ్రి ఉన్న ప్రదేశాన్ని సైతం వాచ్‌ షేర్‌ చేసింది. దాంతో బర్డెట్‌ సదరు ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్నాడు. అయితే, అక్కడ  తన తండ్రి కనిపించలేదు. కానీ, తండ్రి వాచ్‌ నుంచి మరోసారి సందేశం వచ్చింది. ఆయన సేక్రేడ్ హార్ట్ మెడికల్ సెంటర్‌లో ఉన్నట్టు వాచ్‌ అలర్ట్‌ ఇచ్చింది. బర్డెట్‌ ఆస్పత్రికి చేరుకుని తన తండ్రిని కలుసుకున్నాడు. పర్వతారోహణ సమయంలో తన అనుభవాలను ఫేస్‌బుక్‌లో పంచుకున్నాడు.

‘‘పర్వతారోహణ చేస్తుండగా ప్రమాదవశాత్తూ నాన్న బైక్‌నుంచి పడిపోయాడు. ఆయన తలకు బలమైన గాయమైంది. దాంతో ఆయన చేతికున్న ఆపిల్‌ వాచ్‌లో గల ‘‘హార్డ్‌ ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌’’ అత్యవసర నెంబర్‌ 911కు కాల్‌ కనెక్ట్‌ చేసింది. సమాచారం అందుకున్న ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్‌లో అక్కడికి చేరుకుని నాన్నకు ప్రాథమిక చికిత్సనందించారు. అనంతరం ఆస్పత్రికి చేర్చి సత్వర వైద్య చికిత్స చేశారు. ప్రస్తుతం నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది’’ అని బర్డెట్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఇదంతా ఆపిల్‌ వాచ్‌లో సెట్‌ చేయబడిన హార్డ్‌ ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ వల్లే సాధ్యమైందని, ప్రతి ఒక్కరూ తమ పరికరాల్లో ఈ ఫీచర్‌ను సెట్‌ చేసుకోవాలని కోరారు. అయితే, ఆపిల్‌ వాచ్‌లో ఈ ఫీచర్‌ ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top