ఈ బాలుడికి ప్రపంచమే పాదాక్రాంతం | A 13-year-old wheelchair-bound musical prodigy of Indian origin is a motivational star | Sakshi
Sakshi News home page

ఈ బాలుడికి ప్రపంచమే పాదాక్రాంతం

Jun 1 2017 4:48 PM | Updated on Oct 22 2018 6:05 PM

ఈ బాలుడికి ప్రపంచమే పాదాక్రాంతం - Sakshi

ఈ బాలుడికి ప్రపంచమే పాదాక్రాంతం

అమెరికాలోని న్యూజెర్సీలో భారత సంతానానికి చెందిన స్పార్ష్‌ షా అనే 13 ఏళ్ల బాలుడు ఇప్పుడు సంచలనాలకే సంచలనమయ్యారు.

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూజెర్సీలో భారత సంతానానికి చెందిన స్పార్ష్‌ షా అనే 13 ఏళ్ల బాలుడు ఇప్పుడు సంచలనాలకే సంచలనమయ్యారు. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఈ బాలుడి మాటలు, పాటలే ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈయన మాటలు నిస్తేజులకు కూడా స్ఫూర్తినిస్తుంటే, పాటలు అభిరుచి లేనివారికి కూడా మాధుర్యాన్ని పంచుతున్నాయి.శరీరంలో 35 చోట్ల ఎముకలు విరిగి పుట్టిన ఈ బాలుడికి ఇప్పటి వరకు శరీరంలో 140 చోట్ల ఎముకలు విరిగాయి. ‘ఆస్టియోజెనెసిస్‌ ఇంపర్‌ఫెక్టా’ అనే అరుదైన జబ్బుతో జన్మించిన ఈ బాలుడు మున్ముందు తన శరీరంలో ఎన్ని ఎముకలు విరుగుతాయో ఆ దేవుడికే తెలయాలంటున్నారు.

కాళ్ల నుంచి నడుము వరకు కదలకపోయినా సరే, శరీరంలో పటపట మంటూ ఎముకలు విరుగుతున్నాసరే అధైర్య పడకుండా పాటలే తన జీవితమన్న అభిరుచిని పెంచుకొని పాటల ప్రపంచంలో లీనమవుతున్న స్పార్ష్‌ను చూసి ప్రపంచంలో ఎవరూ జాలి పడరు. అయ్యే పాపం అనరు. బాలుడి మాటలకు ఉత్తేజితులవుతారు. ప్రతి జీవితానికి ఓ ఆశయమనేది ఉండాలనే జ్ఞానోదయంతో ఆలోచిస్తారు. ఇప్పటికీ భారతీయ, అమెరికా సంగీత రీతులను అవపోషణ పట్టిన ఈ బాలుడు సంగీత ప్రపంచం కోసం తన పేరును ‘ప్యూర్‌ ప్లస్‌ రిథమ్‌’ను కలిపి ప్యూరిథమ్‌గా మార్చుకున్నారు.

‘నాట్‌ అఫ్రైడ్‌’ అంటూ 2016, జనవరిలో ఈ బాలుడు విడుదల చేసిన వీడియో ఆల్బమ్‌ వైరల్‌ అయింది. దాదాపు ఆరు కోట్ల మంది వీక్షించారు. ‘రాగ ర్యాప్‌’ అంటూ సరికొత్త బాణì నీ సష్టించారు.  ఇప్పటి వరకు అనేక సంగీత కచేరీలు ఇచ్చిన ఈ బాలుడు ఇప్పటి వరకు 50 లక్షల డాలర్లను సంపాదించారు. వాటితో వైద్యం చేయించుకుంటూ సంగీత సాధన సాగిస్తున్నారు. గత డిసెంబర్‌ నెలలో ముంబయికి వచ్చి ఓ టీవీ టాక్‌ షోలో పాల్గొన్న ఈ బాలుడు... ‘ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏదీ ఉండదు.

కాకపోతే అది సాధించేందుకు కావాల్సినంత తపన, సాధన ఉండాలి. వెరీ సింపుల్‌గా సాధించవచ్చు. 11 అక్షరాలతో ఉండే కొన్ని సంక్లిష్ట ఆంగ్ల పద బంధాలను చదివినప్పుడు అమ్మో, వాటిని గుర్తుపెట్టుకోవడం ఎంత కష్టమో అనుకున్నాను. ఆ మాటకొస్తే నా ఆరోగ్య పరిస్థితి క్లిష్టమైనది కాదా? అనుకున్నా. ఆ తర్వాత ఆ పద పంధాలన్నీ నాకు చాలా సులభమైనవి అనిపించాయి’ అంటూ నవ్వుతూ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మాట్లాడారు.

‘నాకు గ్రామీ అవార్డులు అక్కర్లేదు. నా పాటను ప్రపంచంలో ప్రతి ఒక్కరు వినాలన్నది నా ఆశ. కనీసం వంద కోట్ల మంది ప్రేక్షకుల ముందు ఓ సారి ప్రదర్శన ఇవ్వాలన్నది నా కోరిక. ఇదేమీ సాధ్యం కాదన్నా సందేహం నాకేమీ లేదు. ఏదో రోజు సాధిస్తానన్న సంపూర్ణ విశ్వాసంతోనే ముందుకు పోతున్నా. సాధించి తీరుతా’ ప్యూరిథమ్‌ చెబుతున్న ఇప్పటి మాటలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement