
ఆ మరణ శిక్ష తప్పు!
1944.. అమెరికాలో హత్యానేరంపై 14 ఏళ్ల నల్లజాతి బాలుడిని అరెస్ట్ చేశారు. విచారించారు. ఎలక్ట్రిక్ కుర్చీలో కూర్చోబెట్టి మరణశిక్ష విధించారు.
70 ఏళ్ల తరువాత గుర్తించిన అమెరికా కోర్టు
కొలంబియా: 1944.. అమెరికాలో హత్యానేరంపై 14 ఏళ్ల నల్లజాతి బాలుడిని అరెస్ట్ చేశారు. విచారించారు. ఎలక్ట్రిక్ కుర్చీలో కూర్చోబెట్టి మరణశిక్ష విధించారు. ఇదంతా జరిగింది కేవలం మూడు నెలల్లోనే. కనీసం అపీల్‌కు కూడా అవకాశం ఇవ్వలేదు. అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలో ఈ అ‘న్యాయం’ జరిగింది. 2014.. 70 ఏళ్ల తరువాత ఇప్పుడు.. ఆ బాలుడికి అన్యాయం జరిగిందని బుధవారం స్థానిక జిల్లా కోర్టు తేల్చింది. ‘ఆ తీర్పు షాకింగ్.. అధర్మం.. అన్యాయం’ అని న్యాయమూర్తి కార్మెన్ ముల్లెన్ వ్యాఖ్యానించారు. 7, 11 ఏళ్ల ఇద్దరు బాలికలను తలపై ఇనుప రాడ్‌తో మోది చంపేశాడన్న ఆరోపణపై 14 ఏళ్ల జార్జి స్టిన్నీని 1944 నవంబర్‌లో అరెస్ట్ చేశారు. ఆ హత్యలకు ప్రత్యక్ష సాక్షులెవరూ లేరు.
బాలికలిద్దరూ పూలు తెంపుకుంటుండగా.. వారితో పాటు స్టిన్నీని చూశానని ఒక సాక్షి చెప్పాడు. ఆ సాక్ష్యాన్నే పరిగణనలోకి తీసుకుని ఆ బాలుడికి మరణశిక్ష విధించారు. మరణ శిక్షను అమలు చేసే సమయంలో ఎలక్ట్రిక్ కుర్చీ స్ట్రాప్స్, కాలికి బిగించిన ఎలక్ట్రోడ్ ఆ బాలుడి సైజుకు సరిపోలేదని ఆ బాలుడు అంత చిన్నగా ఉన్నాడని శిక్షను అమలు చేసిన వారు గుర్తించారు. 20 శతాబ్దిలో మరణశిక్షకు గురైన అతి పిన్నవయస్కుడిగా స్టిన్నీ నిలిచాడు. దర్యాప్తు అధికారులు, లాయర్లు, జడ్జీలు అంతా తెల్లవారే ఉన్న కాలంలో నల్లజాతి వారికి లభించే న్యాయానికి ఉదాహరణగా పౌర హక్కుల సంఘాలు దీన్ని పేర్కొంటాయి. ఈ దారుణంపై జార్జి ఫ్రిస్టన్ అనే వ్యక్తి అలుపెరగని న్యాయపోరాటం చేయడంతో బుధవారం తాజా తీర్పు వెలువడింది.