జీరో దందా జోరు | Zero initiative danda | Sakshi
Sakshi News home page

జీరో దందా జోరు

Jan 4 2016 12:52 AM | Updated on Aug 14 2018 10:54 AM

జీరో దందా జోరుగా సాగుతోంది. పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటూ అక్రమార్కులు సరుకులు

♦ నెలకు రూ.300 కోట్లు
♦ రాష్ట్ర సరిహద్దుల ద్వారా దర్జాగా అక్రమ రవాణా
♦ ఏపీ సరిహద్దుల్లో ఇప్పటికీ ఏర్పాటు కాని చెక్‌పోస్టులు
♦ అతీగతీ లేని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల ప్రతిపాదన
 
 సాక్షి, హైదరాబాద్: జీరో దందా జోరుగా సాగుతోంది. పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటూ అక్రమార్కులు సరుకులు తరలిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ దందా కొనసాగుతోంది. ప్రతిరోజు కోట్ల రూపాయల విలువైన వస్తు సామగ్రి అక్రమంగా రాష్ట్రానికి తరలివస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 19 నెలలు గడుస్తున్నా ఏపీ సరిహద్దుల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఏడు చెక్‌పోస్టుల్లో ఒక్కదానికీ మోక్షం లభించలేదు. దీంతో ప్రతినెలా సుమారు రూ.300 కోట్ల విలువైన వస్తు సామగ్రి అక్రమంగా రాష్ట్రానికి తరలివస్తోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తెలియజేసినా పట్టించుకోకపోవడం గమనార్హం.

వాణిజ్యపన్నుల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గత ఆరునెలల్లో జరిపిన దాడుల్లోనే రూ.1,300 కోట్లకుపైగా విలువైన జీరో వ్యాపారాన్ని కనుగొన్నారంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఈ సరుకుకు సంబంధించి రూ.100 కోట్ల మేర వాణిజ్యపన్నుల శాఖ అపరాధరుసుము, పన్నుల కింద నోటీసులు పంపించడమేగాక, అందులో రూ. 45 కోట్ల మేర ఇప్పటికే వసూలు చేసింది. కట్టుదిట్టమైన నిఘా ఉంటే అధికారికంగానే నెలకు రూ.30 కోట్ల వరకు పన్ను రూపంలో ప్రభుత్వానికి సమకూరుతుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులే అంగీకరించడం గమనార్హం.

హైదరాబాద్‌లోని బేగంబజార్, ఫీల్‌ఖానా, సిద్దిఅంబర్‌బజార్, అబిడ్స్‌తోపాటు సికింద్రాబాద్‌ల నుంచే ఈ దందా పెద్దఎత్తున సాగుతోంది. ఈ ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్‌పోర్టు కంపెనీల్లో 80 శాతం ట్రక్కులు అక్రమ రవాణాకే వినియోగిస్తున్నారంటే దందా ఏ స్థాయిలో సాగుతోందో అర్థమవుతుంది. కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల నకిలీ వేబిల్లులు, ట్రాన్సిట్ పాస్‌లతో అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, జైపూర్‌ల నుంచి అక్రమ రవాణా సాగుతుండగా, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ ట్రాన్సిట్ పాస్‌లతో కేరళ, కర్ణాటకల నుంచి సరుకు రవాణా జరుపుతున్నారు.

 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులే పరిష్కారం
 తెలంగాణ, ఏపీల మధ్య ఏర్పాటు చేయతలపెట్టిన 7 చెక్‌పోస్టులతోపాటు ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, కర్ణాటక సరిహదుల్లో ఉన్న మరో 7 చెక్‌పోస్టులను ఇంటిగ్రేటెడ్(సకల హంగులతో గల చెక్‌పోస్టులు)గా మార్చాలని వాణిజ్య పన్నుల శాఖ కోరుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం లేదు. సీసీ కెమెరాలతోపాటు, స్కానర్లు, జీపీఎస్ విధానం, ఇతర అధునాతన హంగులన్నీ ఉండే ఈ చెక్‌పోస్టుల వద్దకు లారీ వస్తే అందులో ఉన్న సరుకు ఏంటో, ఏ రాష్ట్రం నుంచి వస్తోందో కనుగొనే వీలు కలుగుతుంది. ఈ నేపథ్యంలో వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ శనివారం సీఎం కేసీఆర్‌కు వాణిజ్యపన్నుల శాఖ ప్రతిపాదనలను వివరించారు. రూ.400 కోట్లు ఖర్చు చేస్తే 14 చెక్‌పోస్టులను ఇంటిగ్రేటెడ్‌గా మార్చవచ్చని, అదనంగా వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సమకూరుతుందని ఆయన వివరించారు. వచ్చే బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని కేటాయించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement