దంపతుల మధ్య ఘర్షణ భర్త హత్యకు దారితీసింది.
హైదరాబాద్: దంపతుల మధ్య ఘర్షణ భర్త హత్యకు దారితీసింది. సైదాబాద్ పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండజిల్లా శాలిగౌరారం గ్రామానికి చెందిన గండి పోత వెంకటేశ్ (50), సుగునమ్మ (40) భార్యాభర్తలు. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి చంపాపేట సమీపంలోని నీలంరాజశేఖర్‌రెడ్డినగర్(చింతల్)లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. కూతుళ్లకు పెళ్లి కాగా.. కుమారుడు హరి 8వ తరగతి చదువుతున్నాడు. వెంకటేష్ రాళ్లు కొడుతూ కుటుంబాన్ని పోషించేవాడు.
వెంకటేష్ ఏడాది క్రితం ప్రమాదవశాత్తు కాళ్లు విరగడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. పనిపాట లేకపోవడంతో తాగుడుకు బానిసయ్యాడు. కుటుంబ పోషణ సుగునమ్మ మీద పడింది. దీంతో ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరి మధ్య తరుచు గొడవలు జరుగుతున్నాయి. మత్తుకు భానిసైన వెంకటేష్ ఇంట్లోని వుస్తువులు విక్రయిస్తు వచ్చిన సొమ్ముతో కల్లు తాగడం మొదలు పెట్టాడు. ఇలా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండటంతో ఇద్దరి మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి.
ఇదిలా ఉండగా ఆదివారం ఇంట్లో ఉన్న సెల్‌ఫోన్ అమ్మేసి కల్లు తాగి రాత్రి ఇంటికి వచ్చాడు. దీంతో సెల్‌ఫోన్ విషయమై ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఇక ఇతని వేధింపులు తాళలేనని భావించిన సుగునమ్మ పక్కనే ఉన్న ఇనుప రాడ్‌తో వెంకటేష్ తలపై దాడి చేసింది. దీంతో అతని తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకన్న పోలీసులు సుగునమ్మ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.